విహారయాత్రకు వెళ్తున్నారా?

ఇప్పుడు అమ్మాయిలూ సోలో, గ్రూప్‌ ట్రిప్‌లకు వెళుతున్నారు. ఒత్తిడిని దూరంగా ఉంచడానికీ ఇదే ప్రధాన మార్గమవుతోంది. మీరూ వెళుతున్నారా? అయితే ఇవి మరచిపోకండే!

Published : 17 Jun 2022 00:59 IST

ఇప్పుడు అమ్మాయిలూ సోలో, గ్రూప్‌ ట్రిప్‌లకు వెళుతున్నారు. ఒత్తిడిని దూరంగా ఉంచడానికీ ఇదే ప్రధాన మార్గమవుతోంది. మీరూ వెళుతున్నారా? అయితే ఇవి మరచిపోకండే!

* ముందుగానే.. ఏ ఇబ్బందులూ ఎదురవ్వ కుండా సాగాలంటే ముందస్తు ప్రణాళిక తప్పని సరి. వెళ్లే ముందే ఉతకాల్సిన దుస్తులు, సర్దడం, సరకులు తెచ్చుకోవడం వంటివి పూర్తి చేయండి. వచ్చాక చేద్దామనుకుంటే ఓపిక ఉండదు. వెళ్లే ప్రదేశంలో వసతి, ఆహారం వంటివన్నీ ప్లాన్‌ చేసుకోండి. వెళ్లాక చూద్దామనుకుంటే ఇబ్బంది పడతారు.

* మరీ ఎక్కువ లగేజీని తీసుకెళ్లొద్దు. త్వరగా అలసిపోతారు. వీలైనంత తక్కువ ఉంటే మంచిది. స్నేహితులంతా ఒకే తరహా దుస్తులు వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది.

* బడ్జెట్‌లోనే.. ఒక్కరే వెళుతున్నప్పుడు ‘ఇంతలోనే వెళ్లి రావాలి’ అనుకుంటే పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ నలుగురితో వెళుతున్నప్పుడు అలా కాదు. పైగా అందరిముందూ చిన్న బోవాల్సీ రావొచ్చు. మీ దగ్గరున్న మొత్తం, తిరగాలనుకున్న ప్రదేశాలు, అందుకయ్యే ఖర్చులు... రాసుకొని బడ్జెట్‌ అంచనా వేసుకోవాలి. దాని ఆధారంగా ప్రణాళిక తయారు చేసుకొని, మీదగ్గరున్న మొత్తంలోనే పూర్తి అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే సమస్యా ఉండదు.

* అలా జరిగితే.. బృందంలో సమయపాలన కష్టం. కొందరు త్వరగా సిద్ధమైతే మరికొందరు ఎంతకీ తెమలరు. అలాంటప్పుడే గొడవలకు తెర లేచేది. వీటికీ మానసికంగా సిద్ధమవండి. ఏరోజు ఏయే ప్రదేశాలకు వెళ్లాలనేది ప్రణాళిక వేసుకోవాలి. ముందురోజే సమయం, ఆహారం విషయాలపై స్పష్టతనిచ్చి, అది అమలయ్యేలా చూసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తే సరి.

* ప్రయాణాల్లో శరీరానికి నీరు ఎక్కువ అవసరం. వెంట తప్పకుండా వాటర్‌ బాటిల్‌ను ఉంచుకోవాలి. నచ్చిన చోట తెలియకుండానే ఎక్కువ సమయం తిరుగుతాం. కాళ్లకు ఇబ్బంది కలిగించని చెప్పుల్ని ఎంచుకోవాలి. వ్యాలెట్‌, కార్డులు, ఐడెంటిటీ కార్డు వంటివి గుర్తుగా పెట్టుకోవాలి. నగలు ఎంత తక్కువ తీసుకెళితే అంత మంచిది. అన్ని వేళలా ఆహారం సరి పడకపోవచ్చు. ఆరోగ్యకరమైన చిరుతిళ్లనూ దగ్గరుంచుకోవాలి. ఫోన్‌ ఛార్జర్‌తోపాటు పవర్‌ బ్యాంక్‌నీ ఉంచుకోవడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్