సామాజిక ఖాతా.. జాగ్రత్త!

మీ అకౌంటే.. స్నేహితులందరికీ మెసేజ్‌ వెళుతుంది. ‘నువ్వు పంపిన లింకు అసభ్య వెబ్‌సైట్లలోకి వెళుతోం’దంటూ అయిన వాళ్ల నుంచి చీవాట్లు. పంపిందేమో మీరు కాదు. అయినా ఎలాగంటే.. సమాధానం ఖాతా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిందనే!

Updated : 22 Nov 2022 16:29 IST

మీ అకౌంటే.. స్నేహితులందరికీ మెసేజ్‌ వెళుతుంది. ‘నువ్వు పంపిన లింకు అసభ్య వెబ్‌సైట్లలోకి వెళుతోం’దంటూ అయిన వాళ్ల నుంచి చీవాట్లు. పంపిందేమో మీరు కాదు. అయినా ఎలాగంటే.. సమాధానం ఖాతా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిందనే! ఇలా జరగొద్దంటే.. జాగ్రత్తగా ఉండాలి!

* ప్రతిదీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం మామూలైంది. ఎక్కువ లైకుల కోసం లాక్‌ పెట్టుకోం. అందరూ చూసే ఊరుకోరుగా! దుర్బుద్ధి ఉన్నవాళ్లు వాటిని సేవ్‌ చేసుకొని అదే పేరుతోనే ఖాతాలో ఉన్న స్నేహితులకే తిరిగి రిక్వెస్టులు పెడుతున్నారు. తెలిసినవాళ్లేగా అని రూఢీ చేసుకోకుండా వాళ్లూ ఓకే చేస్తున్నారు. తర్వాత చాట్‌ల్లో పక్కదోవ పట్టడం, డబ్బులు కోల్పోవడం వగైరా. అమ్మాయిలనేసరికి ఇంకా త్వరగా స్పందిస్తారు. చేసేది వేరేవాళ్లైనా మాట వచ్చేది మీకే! కాబట్టి, కొత్తవాళ్ల రిక్వెస్టులు ఓకే చేయొద్దు. స్నేహితులే అయినా రూఢీ చేసుకోండి, ఫర్లేదు. అన్నింటి కన్నా ప్రధానం ఖాతాని ప్రైవేటు చేసుకోండి.

* ఖాతా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లొద్దంటే పటిష్ట భద్రత తప్పనిసరి. ఇంటిపేరు, పుట్టినరోజు ఇలా తేలిగ్గా ఊహించగలిగేవి, మీపేరుతోనే ఉండే పాస్‌వర్డ్‌లు పెట్టద్దు. తెరచిన ప్రతిసారి పాస్‌వర్డ్‌తోపాటు ఓటీపీ కూడా అవసరమయ్యేలా సెట్టింగుల్లో మార్చుకోండి. ఆఫీసు, ఇల్లు సురక్షితమే అని బ్రౌజర్లలో తెరచి లాగవుట్‌ చేయకుండా వెళుతుంటాం. అదీ మంచి పద్ధతి కాదు.

* ఇప్పుడు ఒక్కదాంతో సరిపెట్టుకునేదెందరు? ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విటర్‌ అన్నిట్లోనూ ఖాతా తెరవాల్సిందే. లేదంటే అప్‌డేట్‌ అవ్వలేదంటారేమోనని భయం. తేలిగ్గా గుర్తుంటాయి కదాని అన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ వాడుతుంటాం. ఇదీ ప్రమాదమే. ఒక్కోదానికి ఒక్కోటి పెట్టుకోవాలి.

* జాక్‌పాట్‌లు, ఊహించని ధరలంటూ లింకులొస్తాయి. దానిలోకి వెళ్లడానికి సామాజిక మాధ్యమ ఖాతా తెరవమంటారు. తీరా తెరిచాక తేలిగ్గా ఉండే క్విజ్‌, సర్వే ఇచ్చి పూర్తిచేశాక గెలిచామంటూ ఒక బహుమతి ప్రకటిస్తారు. దాన్ని పొందాలంటే ఈ లింకును మరికొందరికి పంపమంటారు. ఇదీ ఒకరకమైన మోసమే. మీ ఖాతా వివరాలు వాళ్ల చేతుల్లోకి వెళ్లడమే కాదు.. మీ స్నేహితుల్లో మరికొందరి వివరాలనూ అందజేసిన వారవుతారు. సాధారణంగా ఇలాంటివన్నీ పెద్ద సంస్థల పేరిట జరుగుతాయి కాబట్టి, మోసపోవడం సహజమే! లింకు తెరచే ముందు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళితే ఎంతవరకూ నమ్మకమో అర్థమవుతుంది. మోసానికీ ఆస్కారముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని