నీతిబాహ్యమైన పోలిక

వికృత మనస్తత్వం గలవారు ఎదుటి వ్యక్తి అంగీకారంతో సంబంధం లేకుండా పశు ప్రవృత్తితో వ్యవహరించే దారుణ ప్రవర్తన.. అత్యాచారం. చందాదారులు, ఆర్థిక క్రమశిక్షణ గల ఓ సంస్థకు మధ్య పరస్పర అంగీకారం, సహకారంతో సాగుతున్న పొదుపు ఉద్యమాన్ని ఇలాంటి అనైతిక చర్యతో పోల్చడం జుగుప్సాకరం.. అసందర్భం, అవివేకం కూడా.

Published : 26 Jun 2023 15:16 IST

అత్యాచారం అనేది ఒక మృగ సమానుడు ఎదుటి వ్యక్తి అంగీకారం లేకుండా వారి మానవ హక్కులను హరించే పశు ప్రక్రియ. అటువంటి పశు ప్రక్రియను వ్యక్త పరచలేని, బాధితురాలి వ్యక్తిగత గోప్యత దృష్ట్యా వ్యక్తపరచరాని నేరాన్ని.. ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగిన సంస్థను, భవిష్యత్తును భద్రపరచుకోవాలనుకునే చందాదారుల పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్న పొదుపు ఉద్యమంతో పోల్చడం అసందర్భం, అశ్లీలం, అన్యాయమే కాదు నీతి బాహ్యమని కూడా వివేకవంతులు, వృత్తిలో నైతిక విలువలు పాటించే వారు ముక్త కంఠంతో నిరసిస్తున్నారు. అధికారులకు ప్రవర్తనా నియమావళి అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమంలోనైనా, విలేకరుల సమావేశంలోనైనా ఎవరి వ్యక్తిగత గోప్యతకూ, వ్యక్తిత్వానికీ ఎటువంటి నష్టం జరగకుండా తమ భావాలను వ్యక్తం చేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షంలో అది అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఇటీవల చేసిన హేయమైన వ్యాఖ్యలపై ముగ్గురు సామాజికవేత్తలు ‘వసుంధర’తో తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు..


పిల్లలపై నేరాలు... సర్వసాధారణమా?

- దేవి, సామాజిక ఉద్యమకారిణి

మైనర్‌ బాలబాలికలపై రకరకాల అకృత్యాలు జరుగుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం.. గడిచిన ఏడెనిమిదేళ్లలో ఇవి 90 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో దాన్ని అరికట్టడానికున్న పోక్సో చట్టంపై అవగాహన ఉంటే.. బాలికల లైంగిక వేధింపులపై ఇలా బహిరంగంగా ఒక అధికారి మాట్లాడేవారా? అది కూడా చాలా సహజమన్నట్లుగా ఉదహరించారు. అంటే ఈ దేశంలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అంత సర్వసాధారణంగా అనిపిస్తున్నాయా? సందర్భం లేకుండా మాట్లాడగలిగేలా ఉన్నాయా? ఆయన అన్నట్టుగా కేకో, చాక్లెట్టో ఆశపెట్టి పిల్లలని లొంగదీసుకుంటారు. అయితే, పిల్లలపై అత్యాచారాల్లో 90శాతం కేసుల్లో వాళ్లకి తెలిసిన వాళ్లే చేస్తారు. దగ్గర బంధువులే ఎక్కువగా ఉంటారు. పైగా చాకెట్లు, కేకులు చూపించి లోబరుచుకోవడం మొదటిదశ. తర్వాత భయపెడతారు. బాధిస్తారు. ఒక ఫైనాన్షియల్‌ అంశంలోకి ఇలా సంబంధం లేని, అందులోనూ పసిపిల్లలపై అకృత్యాలని ఉదాహరణగా చెప్పడం సరికాదు. పసిపిల్లల్లో ఇంకా వివేచన మొదలుకాని వయసులో ఇలాంటి అత్యాచారాలు జరుగుతాయి. అందుకే మనం వాళ్లకి చట్టం ద్వారా మరింత రక్షణ కల్పిస్తాం. కానీ చందాదారులు వివేచన లేని చిన్నపిల్లలేం కాదే! సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగినవారు. వాళ్లని ఏమీ తెలియని వాళ్లుగా, అత్యాచార బాధితులతో పోల్చడం ఎంత వరకూ సబబు? ఇలా పొలిటికల్లీ మోటివేటెడ్‌ కామెంట్లు చేయడం వృత్తిరీత్యా సరికాదు. దిల్లీలోని రెజ్లర్ల విషయంలోనూ దిల్లీ పోలీసులు ఇటువంటి ట్వీట్లే చేశారు. మీరు కేసు నడుపుతున్న వ్యక్తి దోషా, నిర్దోషా అన్నది కోర్టు తేల్చాలి. ఆ ఆధారాల్ని ప్రెస్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసుల పని పక్కాగా చార్జ్‌షీట్‌ వేసి, నిరూపించి చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేయడం. కానీ కొన్ని కేసుల్లో సెలక్టివ్‌గా ట్వీట్లు చేయడం, సామాజిక మాధ్యమాల్లో, ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటం అనేది పోలీసు అధికారుల వ్యవహారం కాదు కదా!  


సంబంధంలేని విషయాల్లో పోల్చడం నేరం...

- జి. వరలక్ష్మి, న్యాయవాది.

వ్యక్తులూ లేదా వ్యవస్థల మీద ఉన్న కోపాల్నీ, తమ ఉద్దేశాల్నీ ప్రదర్శించడానికి మహిళలూ, మైనర్‌ బాలికల జీవితాలతో పోలుస్తూ మాట్లాడటం బాధాకరం. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా చేయడం మరింత శోచనీయం. బాధిత స్త్రీ, పిల్లల తరఫున మాట్లాడటమంటే వారి రక్షణకోసం చర్యలు తీసుకోవడం, వారిపై దాడుల్ని అరికట్టడం వంటివి చేయడం. అది వదిలేసి... మహిళలూ, మైనర్లు అయిన బాలికల మానం గురించీ సంబంధంలేని విషయాలతో వారిని పోల్చి మాట్లాడటం తప్పు. దీని మీద ఆయా సంస్థలే కాదు... ఈ వ్యాఖ్యలతో నొచ్చుకున్న మహిళలెవరైనా సరే ఐపీసీ సెక్షన్‌ 500 కింద పరువునష్టం కేసుని ఆ వ్యక్తి మీద వేయొచ్చు. ‘చాక్లెట్‌ ఇచ్చి మైనర్‌ బాలికను’అంటూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాలేదు. అత్యాచార బాధితులను మీడియా ముందుకు తేవొద్దని చట్టం చెబుతోంది. ఇలాంటి హేయమైన చర్యల్ని పబ్లిక్‌గా ఉదహరించడం మహిళల్ని సామూహికంగా అవమానించడమే. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ కల్పించే (పోక్సో)యాక్ట్‌-2012- ప్రకారం మైనర్లపై జరిగే లైంగిక హింస గురించి బహిరంగంగా వ్యాఖ్యానించడమూ నేరమే.


సున్నితమైన అంశాలపై హేళనా?

- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

అత్యాచార ఘటన శారీరకంగానే కాదు.. మానసికంగానూ హింసే! శారీరక బాధ కొన్నిరోజులకు తగ్గుతుంది. మానసిక బాధ అలా కాదు. ఏళ్లపాటు వెంటాడుతుంది. బాధితురాలే కాదు ఆమె కుటుంబం కూడా మాటల్లో చెప్పలేని వేదనను అనుభవిస్తుంది. ఆందోళన, డిప్రెషన్‌ దీర్ఘకాలంలో వేధిస్తాయి. మాట్లాడాలన్నా, ఎవరితోనైనా కలవాలన్నా జంకుతారు. సైకలాజికల్‌ డిజార్డర్లకూ గురవుతారు. ఒక్కోసారి వాటినుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకునేవారూ ఎందరో. ఎవరో చేసిన తప్పునకు తమను తాము నిందించుకుంటూ ఆత్మహత్యలవరకూ వెళ్లేవారున్నారు. అత్యాచార సంఘటనల గురించి చేసే వ్యాఖ్యల విషయంలో వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. ఇలాంటి వాటిని దేనితోనైనా పోల్చేటప్పుడు సహానుభూతి ఉండాలి. సున్నితమైన అంశాల గురించి మాట్లాడే మాటలు బాధితులు, స్త్రీలు, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. బహిరంగంగా హేళన చేసినట్లు మాట్లాడటం, వారిని ఎలాగైనా మభ్యపెట్టొచ్చనే అర్థం వచ్చేలా ప్రవర్తించడం వల్ల ఆయా వర్గాలవారు ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశముంది. ఇప్పటికే కుంగుబాటుకు గురైన చిన్నారులు, లైంగిక వేధింపులకు గురవుతున్నవారు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఈ బాధల నుంచి బయటపడగలమనే నమ్మకాన్నీ కోల్పోతారు. వీటిని ఎదుర్కోవడమే బాధితులకు అత్యంత కష్టమైన విషయం. ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లు ఆత్మస్థైర్యం పెరిగేలా చేయాలి కానీ వాళ్లు కుంగిపోయేలా అత్యాచారం, టీజింగ్‌లకు అమ్మాయిలే కారణం అన్నట్లుగా మాట్లాడటం హేయమైన చర్య.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్