ఆ పిల్లల కోసం ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది!

ఒక అమ్మ కష్టం మరో అమ్మకే తెలుస్తుంది... ‘నా పాపకి పాఠాలు చెప్పరూ?’అని 35 ఏళ్ల క్రితం ఓ తల్లి చేసిన అభ్యర్థన ఆమెని కదిలించింది. అదే ఆమెను మానసిక

Published : 02 Jul 2021 01:08 IST

ఒక అమ్మ కష్టం మరో అమ్మకే తెలుస్తుంది... ‘నా పాపకి పాఠాలు చెప్పరూ?’అని 35 ఏళ్ల క్రితం ఓ తల్లి చేసిన అభ్యర్థన ఆమెని కదిలించింది. అదే ఆమెను మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని స్థాపించేలా చేసింది. 72 ఏళ్ల వయసులోనూ ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు విశాఖపట్నానికి చెందిన మల్లంపల్లి నాగరాజకుమారి..

నలభైరెండేళ్ల క్రితం విశాఖపట్నంలో ఓ చిన్న పాఠశాలని ప్రారంభించి విజయవంతంగా నడుపుతుండేవారు నాగరాజకుమారి. కొన్నేళ్ల తర్వాత ఒకావిడ మాటలు రాని తన కూతురికి పాఠాలు నేర్పమని అడిగింది. మరికొన్ని రోజులకు మరో బధిర విద్యార్థినిని కూడా చేర్చుకున్నారు కుమారి. ఇలా ఏడాది గడిచేసరికి ఇటువంటి పిల్లలు పదహారుమందయ్యారు. అప్పుడే కుమారి ఆలోచించారు. సాధారణ పిల్లలు ఎక్కడైనా సులభంగా చదువుకుంటారు. ఇటువంటి పిల్లలకు చదువు చెప్పడంలోనే కదా గొప్పదనం ఉందనుకున్నారు. అదే ఏడాది ‘సన్‌ఫ్లవర్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ సొసైటీ’ను నెలకొల్పారు. ఆ పిల్లల కోసం తను 35 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హేండీక్యాప్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో 9 నెలల శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుంచి మానసిక వికలాంగులు, వీధిబాలలు, అనాథ, పేద ఆడపిల్లలకు ఉచితంగా చదువు, వృత్తివిద్య శిక్షణ అందిస్తూ వారి కాళ్లమీద వారు నిలబడేందుకు కృషి చేశారు. ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా మానసిక వికలాంగులకు శిక్షణ ఇచ్చారు. అనాథలు, వీధి బాలల కోసం అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసి 300 మందిని అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం 175 మంది మానసిక వికలాంగులకు శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత, సొంతంగా తినడం, తమ పనులు తాము నేర్చుకోవడం వంటివన్నీ నేర్పిస్తారు. నెమ్మదిగా వాళ్లని చదువులవైపు మళ్లిస్తారు. వీటితోపాటు పిల్లలకు ఇష్టమైన సంగీతం, నృత్యం, కంప్యూటర్‌, కొవ్వొత్తుల తయారీ, టైలరింగ్‌ వంటి వృత్తివిద్య శిక్షణలు అందిస్తారు. మూగ, చెవిటి పిల్లలు కూడా సాధారణ పిల్లలతో కలిసిపోయేలా తయారు చేస్తారు. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో చాలామంది ఆడపిల్లలు వివాహాలు చేసుకొని మంచి జీవితాల్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాలను అద్దె కేంద్రాల్లోనే నడుపుతున్నారు. కొవిడ్‌ కారణంగా నిర్వహణ భారమూ పెరిగింది. ఈ మాట అడిగితే ‘ఏ స్వార్థమూ లేని ఈ పిల్లలకోసం ఎంత కష్టమైనా పడాలనిపిస్తుందని’ అని నవ్వేస్తారామె. 72 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా ఉంటారామె. ఆమె ప్రారంభించిన పాఠశాల ఇప్పుడు కళాశాలగా విస్తరించింది. దాన్ని ఆమే పర్యవేక్షిస్తున్నారు. భర్త బీమాసంస్థలో ఉన్నతోద్యోగి. ఆయన సహకారంతోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కొవిడ్‌ మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్‌ నిర్వాహకులు పెద్దమొత్తంలో డబ్బులకు పీడిస్తున్నారని విన్నారు. వెంటనే తన దగ్గరున్న పాఠశాల బస్సును అంబులెన్స్‌గా మార్చారు. 24గంటలూ పని చేసేందుకు వీలుగా ఇద్దరు డ్రైవర్లు, ఒక వాలంటీరును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వందకు పైగా మృతదేహాలను ఉచితంగా శ్మశానవాటికలకు తరలించారు. రహదారుల మీద ఎవరైనా నిర్భాగ్యులు, నిరాశ్రయులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుంటారు. కుటుంబసభ్యులకు అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్న వారెందరికో ఆర్థికంగా అండగా నిలిచారు. ‘గత నెలలో ఫోన్‌ రింగయితేనే భయమేసేది. ఎవరు ఫోన్‌ చేసినా మృతదేహాన్ని తరలించేందుకు రావాలని కోరేవారు. అటువంటి బాధ ఎవరికీ రాకూడదు. అటువంటిది ఇప్పుడు రోజుకు ఒక ఫోన్‌ వస్తుంది. నాకదే సంతోషంగా అనిపిస్తోంది’ అంటున్నారు నాగరాజకుమారి.

సురేశ్‌ రావివలస, విశాఖపట్నం


మంచిమాట

రాకెట్‌లో ప్రయాణించే అవకాశం వస్తే ఎక్కడ, ఏ సీటు అని అడగొద్దు. ముందు ఎక్కి కూర్చోండి.
- షెరిల్‌ శాండ్‌బర్గ్‌, ఫేస్‌బుక్‌, సీఓఓ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్