ఒక ఆలోచన... వేల జీవితాల్లో వెలుగు

స్త్రీలు స్వీయ నిర్ణయాలు తీసుకోవాలి, సాధికారత సంపాదించాలి, రాజకీయాల్లో పాల్గొనాలి.. ఇదేదో స్లోగన్‌లా ఉందా? కాదు కాదు.. ‘ఈక్విడైవర్సిటీ ఫౌండేషన్‌’ స్థాపకురాలు అనిందితా మజుందార్‌ ధ్యేయమది. ఆ ఆలోచనకు పురికొల్పిన పరిస్థితులేమిటో చూద్దాం...

Published : 10 Aug 2021 03:16 IST

స్త్రీలు స్వీయ నిర్ణయాలు తీసుకోవాలి, సాధికారత సంపాదించాలి, రాజకీయాల్లో పాల్గొనాలి.. ఇదేదో స్లోగన్‌లా ఉందా? కాదు కాదు.. ‘ఈక్విడైవర్సిటీ ఫౌండేషన్‌’ స్థాపకురాలు అనిందితా మజుందార్‌ ధ్యేయమది. ఆ ఆలోచనకు పురికొల్పిన పరిస్థితులేమిటో చూద్దాం...

నీస స్వేచ్ఛలేని, శారీరక, మానసిక హింస అనుభవిస్తున్న మహిళలు ప్రతి చోటా ఉన్నారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనుకునేది అనిందిత. ఆ తపనతోనే ‘నారీ జాగరణ్‌’లో చేరి పన్నెండేళ్లు పనిచేసింది. స్త్రీ సంక్షేమం ఆ సంస్థ లక్ష్యం. అనిందితది పశ్చిమ్‌బంగ మరిన్ని సేవా కార్యక్రమాలతో, మరింత తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో 2016లో సొంతంగా ‘ఈక్వి డైవర్సిటీ’ ప్రారంభించింది. ‘ఛాందస భావాలు, పాతుకుపోయిన పితృ స్వామ్యం, లైంగిక హింస.. ఈ వైఖరి ఇకనైనా మారాలి. కేంద్ర స్థాయిలో మహిళా నాయకులున్నారు. కానీ పంచాయతీ లెవెల్లో పాతినిధ్యం తగ్గిపోతోంది. ప్రతినిధులు గనుక స్త్రీలయితే, బాధితులు మొహమాటం లేకుండా తమ వెతలను చెప్పుకోగలరు’ అనుకున్న ఆమె మహిళలు స్థానిక పాలక సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. స్థానిక అధికారులను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తోంది.

2017లో ఈక్విడైవర్సిటీలో చేరిన మహిళల స్థితిగతులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించగా.. 65 శాతం స్త్రీలకి సొంత ఆదాయం లేదని, గ్రాడ్యుయేట్లు 4 శాతం కన్నా తక్కువని తెలిసింది. 77 శాతం లైంగిక హింసలు, ఆదాయం, జీవనోపాధి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఆసక్తికరమైన సంగతేమంటే 64 శాతం భర్త లేదా రాజకీయ పార్టీలు కోరినందునే నామినేషన్లు దాఖలు చేశామన్నారు. బడ్జెట్‌ తయారీ, పంచాయతీ బాధ్యతలు, చట్టాలు లాంటి అంశాల్లో సంస్థ వారికి అవగాహన కలిగిస్తుంది. పంచాయతీలో ఎలా మాట్లాడాలో వివరిస్తారు. వీళ్లంతా నారీ జాగరణ్‌ కమిటీగా ఏర్పడ్డారు. ఈ కమిటీల లక్ష్యం మహిళల హక్కులకు మద్దతు ఇవ్వడం. హింస నుంచి బయటపడిన వారికి ఆసరా ఇవ్వడం. ఈ ఫౌండేషన్‌ కొన్ని గ్రూపులతో కలిసి ఆరువేల మందికి సహాయం అందించింది. లైంగిక హింస నివారణ, గృహనిర్మాణ పథకాలు, పాఠశాలల మరమ్మతు, ప్రభుత్వ మరుగుదొడ్లు, ఆట స్థలాల పునరుద్ధరణ లాంటి అనేక పనులు నిర్వహించింది. పిల్లలకు జీవన నైపుణ్యాలు మొదలైన అంశాల్లో తర్ఫీదిస్తుంది. ‘వాళ్లు తమ మనోభావాలను తెలియజేయడానికి ఇదొక వేదిక. పిల్లలు నిస్సహాయత, పరాయీకరణ, ఒంటరితనం, కుటుంబసభ్యుల సమస్యలు, ఉపాధ్యాయులతో దెబ్బలు తినడం, ఆత్మీయులను కోల్పోవడం, ఆహార నాణ్యత లేకపోవడం లాంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నాం. సామాజిక బాధ్యతలను చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం. మా శ్రమ వృథా పోలేదు. కష్టసమయాల్లో సాయం చేసేందుకు ఎందరో వనితలు ముందుకొస్తున్నారు. పురులియా, బీర్బం, సుందర్బన్‌ ప్రాంతాల్లో 1600 మంది గ్రామీణ మహిళలు మాతో కలిసి పనిచేస్తున్నారు. దీనికి నిధులు తగినంతగా లేవు. వ్యక్తిగత విరాళాలపై ఆధారపడుతున్నాం. మేం పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకెన్నో ఉన్నాయి..’ అంటుందామె. ఇప్పుడు సోనాలి అనే యువతి ‘నారీ జాగరణ్‌’లో సంఘ నాయకురాలిగా ఉంది. మహిళలకు తమ హక్కులను తెలియజేస్తుంది. చట్టవిషయాల్లో అవగాహన కల్పిస్తుంది. మానసిక ఆందోళనలు తగ్గించుకునేందుకు నిపుణులతో మాట్లాడిస్తుంది. ఎందరో దివ్యాంగులకు మెరుగైన జీవితాలను ఇచ్చేందుకు పనిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్