Published : 29/11/2021 01:27 IST

వెతల జీవితం.. అందంగా దిద్దుకుంది!

భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆదుకోవాల్సిన వారే రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. అయినా ఆమె అధైర్య పడలేదు. ఒంటరి పోరాటం చేస్తూ ఇద్దరు కూతుళ్లని చదివించారు. పైగా టైలరింగ్‌, బ్యూటీషియన్‌లాంటి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణనిస్తూ ఇతర మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు. ఆమే హనుమకొండకు చెందిన మాదం పద్మజాదేవి. తన ప్రయాణం ఆమె మాటల్లోనే...

డిగ్రీ పూర్తి కాగానే అమ్మానాన్నలు నాకు పెళ్లి చేశారు. మావారు ఎరువుల వ్యాపారం చేసేవారు. వివాహమయ్యాక కొన్నాళ్లకు హైదరాబాద్‌ వెళ్లాం. తను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చూసుకున్నారు. నేను బ్యూటీషియన్‌ కోర్సులో చేరా. అలాగే చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపుడి నృత్యాన్ని ఇతరులకు నేర్పేదాన్ని. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా. దాదాపు 60కిపైగా సీరియల్స్‌, షార్ట్‌ఫిల్మ్స్‌కి డబ్బింగ్‌ చెప్పా. మామయ్య అనారోగ్యం కారణంగా కొన్నాళ్లకు మళ్లీ వరంగల్‌ తిరిగొచ్చేశాం. 2002లో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని స్థాపించి నామమాత్రపు ఫీజు తీసుకుంటూ మహిళలకు టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేదాన్ని.

భర్తను కోల్పోయి...

కొన్నాళ్లకు మామయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆ బాధ నుంచి కోలుకునేలోపు మావారూ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. మృత్యువు తననీ మా నుంచి దూరం చేసింది. ఆస్పత్రి ఖర్చులు, మిగతా అప్పులు... ఒకేసారి చుట్టుముట్టాయి. దగ్గరివాళ్లే ఆదరించకపోగా చాలా రకాల ఇబ్బందులకు గురిచేశారు. పిల్లల కోసం అన్నీ భరించా. అప్పులు తీర్చడానికి, ఖర్చుల కోసం మళ్లీ బ్యూటీపార్లర్‌ మొదలుపెట్టా. నృత్య శిక్షణ తరగతులు ప్రారంభించా. మెల్లగా నిలదొక్కుకున్నా. నాలాగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఉద్దేశంతో పేద మహిళలకు టైలరింగ్‌, బ్యూటీషియన్‌, పెయింటింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో ఉచితంగా శిక్షణనివ్వడం మొదలుపెట్టా. ఈ ఏడేళ్లలో ఐదు వేల మందికి పైగా శిక్షణ తీసుకున్నారు. కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడితే, ఇంకొందరు స్వయం ఉపాధి పొందుతున్నారు.          

- ఇమ్మడి ప్రసాద్‌, హనుమకొండ


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని