ఆమె బతికేది నాలుగు నెలలే అన్నారు!

ఎయిడ్స్‌ మహమ్మారి సోకిన కారణంగా ఆ దంపతులకు మరో నాలుగైదు నెలలే జీవితకాలమని చెప్పారు వైద్యులు. భర్త మరణంతో ఒంటరిగా మిగిలిన ఆమె, తనలాంటి అభాగ్యుల కోసం...

Updated : 06 Dec 2021 05:18 IST

ఎయిడ్స్‌ మహమ్మారి సోకిన కారణంగా ఆ దంపతులకు మరో నాలుగైదు నెలలే జీవితకాలమని చెప్పారు వైద్యులు. భర్త మరణంతో ఒంటరిగా మిగిలిన ఆమె, తనలాంటి అభాగ్యుల కోసం ఓ ఎన్జీవో స్థాపించింది. ఈ వ్యాధి బారిన పడినవారికి కొత్త జీవితాన్ని అందించడానికి కృషి చేస్తున్న నాగరత్న రామగౌడ స్ఫూర్తి కథనం.

బెంగళూరు, బెల్గాంకు చెందిన 40 ఏళ్ల  నాగరత్నది సాధారణ మధ్యతరగతి కుటుంబం.  ఆమెకు 17 ఏళ్ల వయసులో సునీల్‌తో వివాహమైంది. ఆ తర్వాత ఐదు నెలలకే ఊహించని సమస్య ఎదురైంది. స్నేహితుడికి రక్తదానం చేయడానికి వెళ్లిన సునీల్‌కు ఎయిడ్స్‌ ఉందని పరీక్షల్లో తేలింది. నాగరత్నకు రక్త పరీక్షలు చేయించగా ఆమెకూ ఎయిడ్స్‌ ఉంది.  గతంలో ఓ చికిత్స నిమిత్తం భర్తకు జరిగిన రక్త మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ వైరస్‌ సోకడం, అతడి నుంచి నాగరత్నకు రావడం జరిగింది. వారికేం చేయాలో అర్థంకాలేదు. అంతేకాదు.. మరో నాలుగైదు నెలలు మాత్రమే జీవితకాలమని డాక్టర్లు చెప్పేసరికి ఈ విషయాన్ని కుటుంబీకులతో చెప్పడానికి భయపడ్డారు. పెళ్లై ఏడాది నిండినా సంతానం లేదంటూ అవమానంగా మాట్లాడే పెద్దవాళ్లకు ఎలా చెప్పాలో తెలియలేదు. ఆసుపత్రిలో సంప్రదిస్తే, వైద్యుల పర్యవేక్షణలో ఉంటే పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి సోకదని తెలిసింది. అలా కొన్నిరోజులకు నాగరత్న గర్భం దాల్చింది.

ఒంటరిగానే...
ఈ వ్యాధిపట్ల కనీస అవగాహన లేకపోవడంతో తీవ్ర కుంగుబాటుకు గురయ్యాం అంటోంది నాగరత్న. ‘డాక్టర్‌ శివరాం అందించిన వైద్య సాయంతో ఆరోగ్యవంతమైన బాబును కనగలిగా. అంతేకాదు, మేమిద్దరం చికిత్స తీసుకుంటే ఎక్కువరోజులు బతికే అవకాశం ఉందని చెప్పడంతో ఆ ఆశే...మమ్మల్ని బతికించింది. ఈ వ్యాధి గురించి తెలియక మేమెంత మానసికంగా వేదనకు గురయ్యామో... అలాగే మాలాంటివారు చాలామంది ఉంటారనిపించింది. అలాంటివారి కోసం ఏదైనా చేయాలనుకున్నాం. దాంతో ఈ దిశగా కృషి చేస్తున్న సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాం. సొంతంగా చేయాలనే ఆలోచనతో ‘ఆశ్రయ ఫౌండేషన్‌’ను స్థాపించాం. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ సోకినవారికి నీడ, చికిత్సతోపాటు ఉపాధిమార్గాలు చూపించడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇది ప్రారంభించిన మూడేళ్లకే సునీల్‌ 2014లో చనిపోయారు. అప్పటికి మాబాబుకి తొమ్మిదేళ్లు. ఒంటరిగానే ఈ ఫౌండేషన్‌ ద్వారా నావంతు సేవలు అందిస్తున్నా’ అని చెబుతోంది నాగరత్న.

అవగాహన కలిగిస్తూ..
కాలేజీలు, కర్మాగారాలు, ప్రైవేటు సంస్థల సిబ్బందికే కాకుండా, బెంగళూరులోని ఓ సివిల్‌ ఆసుపత్రిలో హెచ్‌ఐవీ బాధితులకు ఈ వ్యాధిపై దశాబ్దకాలం నుంచి అవగాహన అందిస్తోందీమె. తగిన చికిత్స తీసుకుంటే ఎక్కువకాలం జీవించొచ్చంటూ అవగాహన కలిగిస్తోంది. తాను స్థాపించిన ఎన్జీవో ద్వారా అవగాహనతోపాటు ‘యూత్‌ ఫర్‌ సేవా’ పేరుతో వాలంటీర్ల బృందాన్ని రూపొందించి వీరి ద్వారా స్థానిక కళాశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎయిడ్స్‌కు గురైన మహిళలు, చిన్నారులకు కౌన్సెలింగ్‌ అందించి నీడను కల్పిస్తోంది. పలురకాల హస్తకళలు, టైలరింగ్‌లో శిక్షణనిప్పించి ఒంటరి మహిళలతో పేపర్‌ బ్యాగులు, గ్రీటింగ్‌ కార్డులు, చీరలతో షాపింగ్‌ బ్యాగులు తయారుచేయించి, స్వయంఉపాధి మార్గాలను చూపిస్తోంది. చిన్నారులకు విద్య అందేలా కృషి చేస్తోంది. ‘ఫోన్‌ ఇన్‌ కౌన్సెలింగ్‌’ పేరుతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 30 వేలమందికిపైగా ఇప్పటివరకు ఈమె కౌన్సెలింగ్‌ అందించింది. ఈ సేవలను అభినందిస్తూ గతేడాది ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ బుక్‌లో ఈమెపేరును నమోదుచేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్