యాభైయ్యేళ్లుగా బధిరులకు ఆశాదీపం

బధిర చిన్నారులకు సేవలందించే తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు డాక్టర్‌ శాండ్రా దెశా సౌజా. అదే ఆమెను ఈఎన్‌టీ సర్జన్‌గా చేసింది. దేశంలోనే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యురాలిగా నిలిచారు. డాక్టర్‌ శాండ్రా అసాధారణ కృషికి గానూ పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు.

Updated : 13 Jan 2022 06:31 IST

బధిర చిన్నారులకు సేవలందించే తల్లిదండ్రులను చూస్తూ పెరిగారు డాక్టర్‌ శాండ్రా దెశా సౌజా. అదే ఆమెను ఈఎన్‌టీ సర్జన్‌గా చేసింది. దేశంలోనే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స చేసిన తొలి వైద్యురాలిగా నిలిచారు. డాక్టర్‌ శాండ్రా అసాధారణ కృషికి గానూ పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు. వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సతో కొత్త జీవితాల్ని ఇచ్చారు. యాభైయ్యేళ్లుగా వైద్యసేవలను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారీమె.

డాక్టర్‌ జో, నాన్సీ దెశా.. శాండ్రా అమ్మానాన్నలు. ఈ దంపతులు ముంబయిలో బధిర చిన్నారుల కోసం స్టీఫెన్‌ హైస్కూల్‌ను ప్రారంభించి ఉచితంగా ప్రత్యేక విద్యను అందించే వారు. దెశా పేరుతో ఆసుపత్రిని కూడా నిర్వహిస్తూ వందల మంది పేద పిల్లలకు ఉచిత వైద్యాన్నీ అందించే వారు. వినికిడి లోపం, మాట్లాడ లేకపోవడంతో వారెదుర్కొనే ఇబ్బందులను శాండ్రా చిన్నప్పటి నుంచి చూసే వారు. అమ్మానాన్నల్లాగే తనూ సేవలందించాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈఎన్‌టీ సర్జన్‌గా పట్టా తీసుకున్నారు.

అమ్మానాన్నలే స్ఫూర్తి... అమ్మానాన్నలు ఆ పాఠశాల నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకుంటారు డాక్టర్‌ శాండ్రా. ‘నిధుల సేకరణ కోసం అమ్మ చాలా కష్టపడేది. నేను పిల్లలకు డ్యాన్స్‌ నేర్పి కార్యక్రమాలకు సిద్ధం చేసేదాన్ని. హియరింగ్‌ ఎయిడ్‌ వినియోగించినా మాట్లాడలేని అశక్తత వారిది. పెద్దపెద్ద శబ్దాలైతేనే వినిపిస్తాయి. వారి జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉండేవి పాపం. వినికిడి లోపాన్ని సరిచేసే శస్త్రచికిత్సలు అప్పట్లో లేవు. ఎలాగైనా వైద్యురాలినై ఇటువంటి వారందరికీ ఈ లోపాన్ని లేకుండా చేయాలని కలలు కనేదాన్ని. అందుకే ఈఎన్‌టీ విభాగంలోకి అడుగుపెట్టా. 1987లో మనదేశంలో తొలిసారిగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేశా. సమావేశాల్లో చికిత్సలపై ప్రసంగించేటప్పుడు, శస్త్రచికిత్సలు చేసేటప్పుడు నేను ఒక్కరినే మహిళను. అప్పట్లో ఈ రంగంలో మహిళలు అతి తక్కువ. అమెరికాలో ఓ సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడ కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ తయారీ సంస్థకు వెళ్లా. మన దేశానికీ ఈ సౌకర్యాన్ని తేవాలనిపించింది. వారితో చర్చించా. ఈ మిషన్‌పై అవగాహన కలిగించడానికి వర్క్‌షాపులు నిర్వహించే దాన్ని. మొదట నలుగురు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్సలను విదేశీ వైద్యుడు చేసి చూపించారు... అయిదో చిన్నారికి నేను ఇంప్లాంట్‌ చేశా. అప్పటి నుంచి ఇక సొంతంగా మొదలు పెట్టాను’ అని వివరించారు 80 ఏళ్ల డాక్టర్‌ సాంద్ర.

జీవితాన్ని ప్రసాదించి... కాక్లియర్‌ సర్జరీ గురించి దేశవ్యాప్తంగా తెలియడం మొదలై, ఇతర రాష్ట్రాల నుంచీ రోగులు తన వద్దకు వచ్చేవారు. నిరుపేద చిన్నారులకు ఒక ఉద్యమంలా ఆవిడ ఉచితంగా చేసిన చికిత్సలు ఎందరి జీవితాల్లోనో చీకట్లు తొలగించాయి. ఈ చికిత్సకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుంది. ఈ వ్యయాన్ని టాటా ట్రస్టు, తదితర సామాజిక సేవా సంస్థలు అందించేవి. రోగులకు పునరావాసమూ కల్పించేవి. ఈ చికిత్స వల్ల ఆ చిన్నారులు చదువుకోవడమే కాదు... మంచి ఉద్యోగాలనూ సంపాదించుకున్నారు. ఇలా మూడు వేలకు పైగా పేద చిన్నారులకు, మరెందరో బధిరులకు కొత్త జీవితాల్ని ప్రసాదించిన ఘనత డాక్టర్‌ శాండ్రా  దెశా సౌజాదే. తన సేవలకు గుర్తింపుగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానాన్ని పొందారు. కేంద్ర ప్రభుత్వమూ తనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ వయసులో కూడా అలుపెరగని ఉత్సాహంతో చికిత్సల్లో పాలుపంచుకునే స్ఫూర్తిప్రదాత డాక్టర్‌ శాండ్రా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్