Published : 28/01/2022 00:47 IST

బస్తర్‌ అడవుల్లో... లేడీ సింగం!

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని నాలుగులక్షలమందికి పైగా అనుసరిస్తున్నారు.. అయితే ఏ మోడలో అయిఉంటుందిలే అనుకుంటున్నారు కదా? కాదు! ‘లేడీ సింగం’ అని అంతా పిలుచుకునే ఐపీఎస్‌ అధికారిణి అంకిత శర్మ. బస్తర్‌ అడవుల్లో నక్సల్స్‌ని అదుపు చేసే బృహత్తర కార్యక్రమంతో పాటు... మరో బాధ్యతనీ భుజానకెత్తుకున్నారామె...

‘ఆపరేషన్‌ బస్తర్‌’... దట్టమైన బస్తర్‌ అడవులని జల్లెడ పట్టి నక్సల్స్‌ని ఏరివేసే కీలక బాధ్యతని ప్రభుత్వం అంకితశర్మకి అప్పగించడానికి కారణం ఆమె శక్తిసామర్థ్యాలపైన నమ్మకమే. అదే చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ అనే కుగ్రామంలో పుట్టిపెరిగారు అంకిత. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎస్‌ అయి... హోంకేడర్‌ని సాధించిన మొదటి మహిళ కూడా ఆమే. ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబంలో పుట్టిన ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుంచీ ఐపీఎస్‌ కావాలని కలలు కన్నారు. భిలాయ్‌లో ఎంఏ, ఎంబీయే పూర్తిచేసిన తర్వాత సొంతంగా సివిల్స్‌కి సిద్ధమయి ఐపీఎస్‌ సాధించారు. రాయ్‌పూర్‌లో సిటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా అడుగుపెట్టింది మొదలు నేరాలని అదుపు చేయడంలో చొరవ చూపించారు. గత సంవత్సరం గణతంత్ర దినోత్సవాల్లో రాయ్‌పూర్‌లో జరిగిన పోలీస్‌ పరేడ్‌ని ముందుండీ నడిపించారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళా అధికారి పోలీస్‌ బృందాన్ని నడిపించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఆపరేషన్‌ బస్తర్‌లో భాగంగా స్వయంగా ఆమె అడవుల్లో అన్వేషిస్తూ తోటి పోలీసుల్లో స్ఫూర్తినింపుతూ లేడీ సింగం అనిపించుకున్నారు. రవీనాటాండన్‌ వంటివారూ ‘నిజమైన హీరోయిన్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

టీచరమ్మగానూ... పోలీస్‌ విధులతో వారమంతా క్షణం తీరికలేకుండా విధులు నిర్వహించే అంకిత ఆదివారం మాత్రం అంతకన్నా పెద్ద బాధ్యతనే భుజాన వేసుకుంటారు. అదే స్థానిక  యువతలో వివిధ సామాజికాంశాలపై అవగాహన తీసుకొచ్చే పని. యూపీఎస్సీ పరీక్షలకు హాజరవ్వాలనుకునేవారికి ఆమె ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తుంటారు. ఖర్చు పెట్టి కోచింగ్‌కి వెళ్లలేని పాతికమంది విద్యార్థులకు ఆమె సివిల్స్‌ పాఠాలు చెబుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. డిగ్రీ తర్వాత సివిల్స్‌ శిక్షణ కోసమని దిల్లీ వెళ్లినప్పుడు ఆమెకి సరైన మార్గనిర్దేశం దొరకలేదు. దాంతో ఆరునెలలకే వెనుతిరిగి వచ్చారు. అక్కడి నుంచి సొంతంగా చదవడం మొదలుపెట్టారు. అప్పుడే మేజర్‌ వివేకానంద శుక్లాని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆయన ఉద్యోగరీత్యా జమ్మూకశ్మీర్‌, ఝాన్సీ, హైదరాబాద్‌ వంటి నగరాల్లోనూ కొంత కాలం ఉన్నారు. రెండుసార్లు విఫలమై మూడోసారి విజయం సాధించారు. తనలా మార్గనిర్దేశం కోసం మరెవ్వరూ కష్టపడకూడదని, పేదవిద్యార్థుల కోసం ప్రతి ఆదివారం క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టారు. గుర్రపుస్వారీని, బ్యాడ్మింటన్‌ క్రీడను అమితంగా ప్రేమించే అంకిత ఆ పోస్టులని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతారు. వాటితోపాటు సామాజిక స్ఫూర్తిని నింపే ఎన్నో పోస్టులనూ పెడుతుంటారు. వాటిని అనుసరించేవారి సంఖ్య   నాలుగు లక్షలకు పైగానే.


Advertisement

మరిన్ని