Updated : 05/02/2022 03:54 IST

వాళ్ల కష్టం చూశాకే... ఈ పని చేస్తున్నా!

రెండు నెలల క్రితం అనకాపల్లి దగ్గర ఓ యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ ప్రమాదంలో గాయపడిన అబ్బాయిది అరుదైన బ్లడ్‌గ్రూప్‌. రక్తసంబంధీకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో దూరం పెట్టారు. ఇక చావే దిక్కు అనుకున్న సమయంలో అతనికి రక్తం అందించి ప్రాణం పోసింది ‘విశాఖ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌’. 2500 మంది సభ్యులున్న ఈ రక్తదాతల బృందానికి సారథి విశాఖ మహిళ రాజకుమారి...

కష్టమైనా మన వరకూ వస్తేకానీ అర్థం కాదు. అలా నా జీవితంలో జరిగిన ఓ సంఘటనే ‘విశాఖ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌’కి ప్రాణం పోసింది. నాన్న రామకృష్ణ. అమ్మ లక్ష్మి. మావారు కెప్టెన్‌ ఎస్‌వీ ప్రసాద్‌ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదివి, ఫ్యాషన్‌ టెక్నాలజీ పూర్తిచేశా. చిన్నతనం నుంచీ సేవా కార్యక్రమాలంటే ఆసక్తి. ఇంటర్‌ నుంచే వాటిల్లో పాల్గొనేదాన్ని. గ్రామీణ ప్రాంత వైద్య శిబిరాలకు వెళ్లినప్పుడు గర్భిణులు రక్తం లేక ఇబ్బంది పడటం, ప్రసవ సమయంలో రక్తం కోసం పరుగులు పెట్టడం చూశా. ఓసారి మా బంధువొకరికి.. అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ‘ఇంతమంది ఉన్నారు. రక్తం ఇవ్వడానికి ఒక్కరూ ముందుకు రారే?’ అనిపించింది. దీంతో 2019లో నలుగురు సభ్యులతో ఈ క్లబ్‌ను ప్రారంభించా. ఇప్పుడా సంఖ్య 2500 మందికి చేరుకుంది. రక్తం దొరక్క ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదన్నదే మా సంస్థ లక్ష్యం.

సామాజిక మాధ్యమాలతో.... మొదట్లో నేనూ, మరికొందరం స్వయంగా వెళ్లి రక్తం ఇచ్చేవాళ్లం. కొన్ని సమయాల్లో వీలయ్యేది కాదు. అప్పుడే సామాజిక మాధ్యమాల్ని వేదిక చేసుకున్నా. ఫేస్‌బుక్‌, వాట్సపుల్లో గ్రూపులు ప్రారంభించాం. రక్తం అవసరమని తెలిస్తే.. నిజానిజాలు నిర్ధారించుకుని వివరాల్ని గ్రూపుల్లో పోస్టు చేస్తాం. క్లబ్‌ సభ్యులు వారి వీలుని బట్టి ముందుకు వస్తారు. సాయమందుకున్న వాళ్లనీ ఇతరులకు అవసరమైనప్పుడు రక్తదానం చేయమని కోరేవాళ్లం. అలా ఇప్పుడు ఎంతోమంది కొత్త సభ్యులు మా బృందంలోకి చేరి వేలమంది ప్రాణాలు కాపాడుతున్నారు. అలా తిరుపతి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో మా సభ్యులున్నారు. ప్రతినెలా యువత ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తాం. విశాఖలో రోజూ అత్యవసర కేసుల కోసం కనీసం పది మంది వరకు దాతల అవసరముంటుంది. రాత్రుళ్లూ మా దాతలు సిద్ధంగా ఉంటారు.

పొరుగు ప్రాంతాల వారికి... విశాఖకి... చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైద్య అవసరాలకు వస్తుంటారు. స్థానికులు కాకపోవడంతో వీళ్లకి ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ వంటివి తేలిగ్గా దొరకవు. అలాంటి వారికోసం విశాఖలోని కేజీహెచ్‌తో పాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది వద్ద నా ఫోన్‌  నంబరు ఉంచాను. వారి సమాచారంతో మేం వాళ్లకి సాయం చేస్తాం. ఒడిశా నుంచి వచ్చిన ఎంతోమందికి అత్యవసర చికిత్సల్లో లైవ్‌ డోనర్లను అందిస్తున్నాం. ఇతర వైద్య సాయానికి ‘హెల్పింగ్‌ హార్ట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాను. అలాగే చాలామంది మహిళలు, విద్యార్థినులకు రక్తదానం చేసేందుకు వస్తున్నా పోషక లోపం కారణంగా హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉండడంతో ఇవ్వలేకపోతున్నారు. అటువంటి వారికి పోషక విలువల్ని పెంచుకోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. కొవిడ్‌ సమయంలో విశాఖలోని అన్ని రక్త నిధి కేంద్రాల్లోనూ దాదాపుగా రక్త నిల్వలు నిండుకున్నాయి. ఆ సమయంలోనూ మా సభ్యులు చాలా చురుగ్గా వ్యవహరించారు. కొవిడ్‌ రెండో దశలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో వృద్ధురాలికి కిడ్ని సంబంధ సమస్య ఏర్పడి రక్తం అవసరమైంది. అంబులెన్స్‌ కూడా మేమే ఏర్పాటు చేసుకుని ఏలూరులో ఆమెకి చికిత్స అందేలా చేశాం.

సురేష్‌ రావివలస, విశాఖపట్నం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని