Updated : 06/02/2022 05:15 IST

తన బిడ్డలాంటి వారికోసం..

కష్టం బిడ్డకే వచ్చినా... తల్లికే కదా బాధ! బుద్ధిమాంద్యంతో పుట్టిన తన కొడుకు గురించి ఆలోచిస్తూ... అలాంటి బిడ్డలందరికీ జీవితాంతం తోడుగా ఉండాలనుకున్నారు సులోచన. ఆ ప్రయత్నమే మహారాష్ట్రలోని ‘బెరు మతిమంద్‌ ప్రతిష్ఠాన్‌’ సంస్థకు ప్రాణం పోసింది..

లేకలేక పుట్టిన అబ్బాయికి బుద్ధిమాంద్యం ఉందని తెలిస్తే ఏ తల్లిదండ్రుల పరిస్థితి అయినా ఎలా ఉంటుంది? ప్రపంచం తలకిందులైనట్టుగా ఉంటుంది. జీవితాంతం ఆ బిడ్డకు ఎవరు తోడు ఉంటారనే ఆలోచన తొలిచేస్తుంది. సులోచన, నీరజ్‌ శంకర్‌ బెరుల పరిస్థితి కూడా అలానే ఉండేది. అందులోనూ ఇరవై ఏళ్ల క్రితం బుద్ధిమాంద్యం గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. దాంతో ఇటువంటి పిల్లలనే కాదు వాళ్ల తల్లిదండ్రులనీ చిన్నచూపు చూసేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి కొడుకులో ఆత్మవిశ్వాసం నింపేందుకు సులోచన దంపతులు పెద్ద యుద్ధమే చేశారు. ‘మా అబ్బాయి కోసం మేం చేయని ప్రయత్నం లేదు. ఆ క్రమంలో మాకు ఎన్నో విషయాలు తెలిశాయి. మాకుమల్లే చాలామంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారనీ, వారందరికీ ఈ విషయంలో మార్గదర్శకంతోపాటు సాయం కూడా అవసరం అనిపించింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఇటువంటి పిల్లలు భారంగా మారతారు. వారికి సరైన శిక్షణ ఉండదు. మందులు వేయరు. ఈ పిల్లలు మామూలు పిల్లలతో పోలిస్తే ఎక్కువగా హేళనలకు గురవుతుంటారు. కానీ బయటకు చెప్పుకోలేరు. జీవితాంతం ఉండే ఈ వైకల్యాన్ని ఎదిరించాలంటే ఎవరో ఒకరు వారికి తోడుగా ఉండాలి. తల్లిదండ్రులు పెద్దవాళ్లైపోతే.. మా తర్వాత వీళ్లని చూసెదెవరు? అనే భయం ప్రతి తల్లిదండ్రులకూ ఉంటుంది. అటువంటివారికి ఊరటనివ్వడం కోసమే బెరు మతిమంద్‌ ప్రతిష్ఠాన్‌ని ప్రారంభించా’నంటారు సులోచన బెరు. 1989లో పూణెలో ఈ సంస్థని స్థాపించారు. ఇక్కడ వయసు, కులం, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి చేరొచ్చు. ఉచిత వసతి. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ సంస్థని ఆశ్రయించడం మొదలుపెట్టడంతో ఈ సంస్థలో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో మహారాష్ట్రలోని బదలాపుర్‌కి ఈ సంస్థని మార్చారు సులోచన. ప్రస్తుతం వందమందికిపైగా ఇక్కడ ఇక్కడ సేవలు అందుకుంటున్నారు. ‘ఇక్కడ హాస్టల్‌ కమ్‌ హస్పిటల్‌ పద్ధతి ఉంటుంది. సొంతంగా పనులు చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తాం. మరికొందరు మంచానికే పరిమితం అయిపోతారు. వారికి కావాల్సిన సమయానికి ఆహారం, మందులు ఇవ్వడానికి 20 మంది సహాయకుల్నీ, డాక్టర్లనీ అందుబాటులో ఉంచాం. ఇక బుద్ధిమాంద్యం ఉన్న వృద్దులు కూడా ఉంటారు. వాళ్ల తల్లిదండ్రులు చనిపోయాక బంధువులు ఇటువంటి వాళ్లని వదిలించుకుందామని చూస్తుంటారు. అలాంటి వాళ్లు ఇక్కడే జీవితాంతం ఉండిపోవచ్చు. వాళ్లకోసం ఫిజియోథెరపిస్టులు, సైకియాట్రిస్టులు నిత్యం అందుబాటులో ఉంటారు’ అని అంటున్నారు సులోచన. . ప్రస్తుతం ఇది రెండు ఎకరాల స్థలంలో విస్తరించిన ఈ సంస్థకి కావాల్సిన నిధులు డొనేట్‌ కార్ట్‌తోపాటు ఇతర క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థల సాయంతో అందుతున్నాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని