విదేశీ వనిత... స్వదేశీ రుచులు

ఆమె పేరు.. లినెట్‌ అల్‌ఫ్రె ముష్రా. వయసు... 80. ఎక్కడివారు...  బ్రిటన్‌. భారత్‌లో స్థిరపడ్డారు. ఏం చేస్తారు... జామ్‌ వ్యాపారం! ప్రత్యేకత ఏంటి?... ఎలాంటి ప్రిజర్వేటివ్‌లను వాడకుండా 48

Published : 10 Feb 2022 00:12 IST

ఆమె పేరు.. లినెట్‌ అల్‌ఫ్రె ముష్రా. వయసు... 80. ఎక్కడివారు...  బ్రిటన్‌. భారత్‌లో స్థిరపడ్డారు. ఏం చేస్తారు... జామ్‌ వ్యాపారం! ప్రత్యేకత ఏంటి?... ఎలాంటి ప్రిజర్వేటివ్‌లను వాడకుండా 48 రకాల జామ్‌లను తయారు చేస్తూ ఏటా రెండు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేనా... వంద మందికిపైగా మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. మరో విశేషం... ఆ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆవిడ వయసు అరవైకి దగ్గర్లో!!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని భుయిరా గ్రామంలో నివసించే లినెట్‌ అల్‌ఫ్రె ఓ ఆహార పరిశ్రమను నడుపుతున్నారు. దాని వార్షిక ఆదాయం అక్షరాల రెండు కోట్లు. అమ్మ దగ్గర నేర్చుకున్న వంటకాలనే పెట్టుబడిగా లాభాలను ఆర్జిస్తున్నారు. దీనికంతటికీ ఓ చిన్న ఆలోచన మూలమైంది.

అలా మొదలైంది..

లినెట్‌ బ్రిటన్‌కు చెందిన మహిళ. ఆమె కశ్మీర్‌కు చెందిన వినయ్‌ ముష్రాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం బిహార్‌, దిల్లీ, ముంబయిలలో నివాసం ఉన్నారు. ఓ వేడుక కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన లినెట్‌కు ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. ఎంతగా అంటే అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకునేంతగా. పండ్లతోటల మధ్య ఉన్న ఓ ఇంటిని కొనుక్కున్నారు. ఆ ఇంటి చుట్టూ ఆప్రికాట్‌, పీచ్‌, యాపిల్‌, కివీ తోటలుండేవి. అకాల వర్షాలు, గాలులు, కొన్నిసార్లు కోతుల బెడద వల్ల ఈ తోటల్లోని పండ్లు పాడయ్యేవి. ఒక్కోసారి సరైన ధర రాక మిగిలిపోయేవి. ఇలా పండ్లు పాడవడం ఆమెకు నచ్చలేదు. అవి నిరుపయోగం కాకుండా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించింది. చిన్నప్పుడు అమ్మ నేర్పిన జామ్‌ గుర్తుకు వచ్చింది. ఈ పండ్లతో జామ్‌ను తయారు చేయడం మొదలుపెట్టింది. వాటిని చుట్టుపక్కల వారికి, స్థానికులకు అమ్మడం మొదలుపెట్టింది. అలా తన అరవయ్యేళ్ల వయసులో అంటే... 1999లో భుయిరా జామ్‌ పరిశ్రమను ప్రారంభించింది. ప్రస్తుతం అందులో వందకుపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు.

ప్రత్యేకమైన జామ్‌లు..

మొదలుపెట్టిన కొత్తల్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా జామ్‌లను నిల్వ చేయడం. ఆ చిన్న ఊళ్లో విద్యుత్‌ సరఫరా సరిగా ఉండేది కాదు. అయినా ఆమె అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంది. ప్రస్తుతం 48 రకాల జామ్‌లను తయారుచేస్తోంది. ఇందు కోసం దాదాపు 75 టన్నుల పండ్లను ఉపయోగిస్తోంది. వీటి తయారీలో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లనూ వాడదు. వాటి స్థానంలో నిమ్మరసం, యాపిల్‌ రసం, చక్కెరలను ఉపయోగిస్తుంది. రోజూ దాదాపు 850 సీసాల జామ్‌ తయారుచేస్తోంది. వీటిలో బ్లాక్‌బెర్రీ జామ్‌, టొమాటో చట్నీ, స్ట్రాబెర్రీ ప్రిజర్వ్‌, కశ్మీరీ బిఛువా, బ్లాక్‌బెర్రీ ప్రిజర్వ్‌ ఉన్నాయి. చక్కెర రహిత ఉత్పత్తులూ లభిస్తాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా దేశవిదేశాలకు ఎగుమతి చేస్తోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్