ఆ బంధం.. నెటిజన్లను ఆకర్షిస్తోంది!

ప్రతి ఒక్కరి జీవితంలో నచ్చిన ఉపాధ్యాయులు ఉండటం సహజమే! ఎన్నేళ్ల తర్వాత వాళ్లని తలచుకున్నా ముఖంపై చిరునవ్వు, ఆనాటి జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి. వాళ్లూ మనల్ని గుర్తుంచుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా!

Updated : 21 Feb 2022 07:36 IST

ప్రతి ఒక్కరి జీవితంలో నచ్చిన ఉపాధ్యాయులు ఉండటం సహజమే! ఎన్నేళ్ల తర్వాత వాళ్లని తలచుకున్నా ముఖంపై చిరునవ్వు, ఆనాటి జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి. వాళ్లూ మనల్ని గుర్తుంచుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా! ఇలాంటి పరిస్థితి ఎదురైంది నివేదితా బాసిన్‌కి. అదిప్పుడు ఎంతోమంది మనసుల్నీ గెలుచుకుంటోంది. ఆ సంగతులేంటో.. చదివేయండి.

నివేదితా బాసిన్‌ పైలట్‌. ఈవిడది దిల్లీ. 1990లో కమర్షియల్‌ ఫ్లైట్‌ను నడిపి, ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. తాజాగా ఫేస్‌బుక్‌లో ఆమె చిన్ననాటి ఉపాధ్యాయురాలు లిండా నోరోన్హాని కలిశారు. ‘అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి విద్యార్థినిని. ఆవిడ నా పేరుతో సహా గుర్తుపట్టారు’ అని ఆనందంగా చెబుతున్నారు బాసిన్‌. వాళ్లిద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడి 50 ఏళ్లు అవుతోంది మరి! పేరే కాదు ఆమె చిన్ననాటి వివరాల్నీ చెప్పడంతో ఆవిడ ఆనందానికి అవధుల్లేవు. బాసిన్‌ చిన్నప్పటి నుంచీ పైలట్‌ కావాలని కలలు కనేవారు. ఓసారి తరగతిలో ‘పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు’ అన్న అంశంపై వ్యాసం రాయమన్నప్పుడు పైలట్‌ అవ్వాలనుకుంటున్నానని రాశారట. తన ఉపాధ్యాయురాలు ఈ విషయాన్ని ప్రస్తావించడమే కాక ‘ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సాధించిన విజయాల్లో నీ పేరు ప్రస్తావించినప్పుడు గర్వంగానూ భావించా’ అన్నారట. దేశీయంగా 1985 కోల్‌కతా-సిల్‌చర్‌, 1989లో ముంబయి-గోవా బోయింగ్‌ సహా పూర్తిగా మహిళా ఫ్లయింగ్‌ సిబ్బంది చేపట్టిన ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో నివేదిత కూడా భాగం. భర్త, కూతురు, కొడుకు కూడా పైలట్లే. ఈ ఛాట్‌ సంభాషణంతా నివేదిత ట్విటర్‌ వేదికగా ఉంచారు. దాన్ని చూసిన నెటిజన్లు వాళ్ల బంధానికి ఫిదా అవ్వడమే కాదు.. ప్రశంసలూ కురిపిస్తున్నారు. తమ చిన్నతనం, నచ్చిన ఉపాధ్యాయులను గుర్తుచేశారంటూ వాళ్ల అనుభవాలనూ పంచుకుంటున్నారు. మీ పరిస్థితేంటి? మీకూ మీ ఫేవరెట్‌ టీచర్‌ గుర్తొచ్చారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్