సాగు లాభం కొంత మానుకుని

ఒకరేమో.. అప్పుడే చదువు పూర్తిచేసుకున్న యువతరంగం. ఇంకొకరేమో.. కొత్త బాధ్యతల్ని భుజాన వేసుకున్న అనుభవశాలి. ఇద్దరి ఉద్దేశమూ ఒకటే! రసాయనాలు లేని పంట ఉత్పత్తుల్ని సామాన్యులకు చవగ్గా అందించడం. అందుకోసం అంబటి విష్ణుప్రియ... ఉన్నతవిద్య, నాన్న వారసత్వాన్నీ పక్కనపెడితే.

Published : 19 Mar 2022 06:16 IST

ఒకరేమో.. అప్పుడే చదువు పూర్తిచేసుకున్న యువతరంగం. ఇంకొకరేమో.. కొత్త బాధ్యతల్ని భుజాన వేసుకున్న అనుభవశాలి. ఇద్దరి ఉద్దేశమూ ఒకటే! రసాయనాలు లేని పంట ఉత్పత్తుల్ని సామాన్యులకు చవగ్గా అందించడం. అందుకోసం అంబటి విష్ణుప్రియ... ఉన్నతవిద్య, నాన్న వారసత్వాన్నీ పక్కనపెడితే.. శవన హైమావతి సొంతంగా సాగు చేస్తూ, ఆ ఉత్పత్తులతో స్వయంగా దుకాణాన్నీ నిర్వహిస్తున్నారు. వీళ్ల వ్యవ‘సాయ’మేంటో.. చదివేయండి.


అగ్రిప్రెన్యూర్‌నీ!

విష్ణుప్రియ

నాన్నకు వ్యాపారంలో సాయపడొచ్చని ఇంజినీరింగ్‌ చదివా. మాది హైదరాబాద్‌. నాన్న వెంకటేశ్వరరావు, బయోమెడికల్‌ ఇంజినీర్‌. ఈసీజీ, పేషెంట్‌ మానిటర్స్‌ వంటి పరికరాల తయారీ సంస్థ- వివేక్‌ ఎలక్ట్రానిక్స్‌ని నిర్వహిస్తున్నారు. అమ్మ వాణిశ్రీ, చెల్లి కృష్ణప్రియ. లండన్‌లో ఎంబీఏ చేశా. లాక్‌డౌన్‌లో ఎంతోమంది ఆహారం కోసం ఇబ్బందులు పడటం చూశా. ఆ సమయంలో ఆకుకూరల కోసమని మొదటిసారి మార్కెట్‌కెళ్లా. ధర పెట్టినా.. తృప్తి లేదు. ఇంకా రసాయనాల భయం. ఆధునిక రీతుల్లో పెంచినవేమో ఖరీదు. ఇలాగైతే సామాన్యులకి మంచి ఆహారం దొరకడం కష్టం కదా అనిపించింది. మాకు కడ్తాల్‌లో తొమ్మిదెకరాలుంది. రైతులకు ఉచితంగానే సాగు చేసుకోవడానికి ఇచ్చాం. గత ఏడాది వరి వేసి వాళ్లు నష్టపోయారు. ఇద్దరికీ ఉపయోగపడేలా చేద్దామనుకున్నా. ఫలితమే ‘ప్రియా ఆగ్రోస్‌’.
నాన్నదీ సాయం చేసే మనసు. నా నిర్ణయం విని సంతోషంగా ఒప్పుకొన్నారు. నిపుణుల నుంచి సాగు జాగ్రత్తలను తెలుసుకున్నా. చౌటుప్పల్‌లో పాలీహౌజ్‌ లీజు తీసుకుని గత నవంబరులో ప్రారంభించా. రూ.10లక్షలు పెట్టుబడి. హైడ్రోపోనిక్స్‌ విధానంలోలాగే న్యూట్రియంట్లను అందిస్తాం.. కాకపోతే డ్రిప్‌ పద్ధతిలో. అన్ని రకాల ఆకుకూరల్నీ పెంచుతున్నాం. కడ్తాల్‌లో కూరగాయల్నీ మొదలుపెట్టాం. మొదట ఆకుకూరల్ని పేదలు, అనాథాశ్రమాలకే ఇచ్చేసేదాన్ని. వేరే వాళ్లు కూడా ఇస్తున్నారు, వృథా అవుతున్నాయంటే, వాళ్లు కోరిన రోజుల్లో పంపిస్తున్నా. తర్వాతి నుంచి మార్కెట్లకీ! అక్కడ మారుబేరం చేసే చిరు వ్యాపారులు తీసుకెళతారు. అందుకే నామమాత్ర ధరకే ఇస్తున్నా. మావల్ల ఇతర రైతులకు నష్టం కలగకుండా ధరలపరంగా జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం మూసాపేట, శంషాబాద్‌, బోయిన్‌పల్లి, ఎర్రగడ్డ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. నా దగ్గర 40 మంది వరకూ పనిచేస్తున్నారు. వాళ్లకి నెల జీతాలు ఇస్తున్నా. ఉండటానికి గదులు కట్టించా. పర్యావరణ కాలుష్యం కొంతైనా తగ్గించొచ్చని ఎలక్ట్రిక్‌ వాహనాలను కొన్నాం. ఈ సాగును ఇంకా విస్తరిస్తా. నాన్న స్నేహితులూ వాళ్ల పొలాల్ని ‘ఉచితంగానే ఇస్తాం.. సాగు చేసుకో’మంటున్నారు. మా పద్ధతుల్లో పండించడానికి ముందుకొచ్చే రైతులనీ చేర్చుకుంటా. ఎకరానికి ఒకటి చొప్పున అనాథాశ్రమాల్ని ఎంచుకొని సాయమందించాలన్న ఆలోచనా ఉంది. ‘ఆడపిల్లవు, పైగా ఇంత చదివి వ్యవసాయమేంటి? హాయిగా వ్యాపారం చూసుకోక!’ అన్నవాళ్లకి నేను మహిళా అగ్రిప్రెన్యూర్‌నని గర్వంగా చెబుతుంటా.

- సూరపల్లి రఘుపతి, చౌటుప్పల్‌


సమాజ సేవలో భాగంగా..


హైమావతి

ముగ్గురు పిల్లలు.. పెద్ద బాబు ఆస్ట్రేలియాలో, చిన్నబాబు సీఏగా చెన్నైలో, అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశా. మాది కడప జిల్లా రాజంపేట దగ్గరి కోల్లావారి పల్లి. మావారు వెంకట సుబ్బానాయుడు కాలం చేశారు. బాధ్యతలు తీరాయి. ఆర్థికంగా ఇబ్బందీ లేదు. ఇన్నాళ్లూ మాకోసం బతికాం. ఇప్పుడు పదిమందికీ ఉపయోగపడే పని చేద్దామనిపించింది. ఆరోగ్యకరమైన పంటలను ప్రజలకు అందించాలన్నది నా కోరిక. రెండు విధాలా సాయపడుతుందని ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నా. మాకు 34 ఎకరాలున్నాయి. వాటిల్లో 24 ఎకరాల్లో సొంతంగా వ్యవసాయం చేస్తున్నా. కూర గాయలు, నిమ్మ, మామిడి, జామ ఇంకా చాలా రకాల పండ్ల మొక్కలనూ పెంచుతున్నా. సుభాష్‌ పాలేకర్‌ పుస్తకాల్ని చదివి ప్రకృతి వ్యవసాయం మెలకువలను తెలుసుకున్నా. ఎరువుల నుంచి పురుగుల మందుల వరకూ అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటా. రసాయనాలను అస్సలు వాడను. జీవామృతం, కుళ్లిన కూరగాయలు వంటి సహజ సిద్ధమైనవే ఉపయోగిస్తా. సేంద్రియ ఎరువుల కోసం ప్రత్యేకంగా ఆవులనూ పెంచుతున్నా. ఈ పోషకాలను డ్రిప్‌ విధానంలో మొక్కలకు అందిస్తా. దిగుబడి చాలా బాగుంటోంది.

సేంద్రియ ఆహారమంటే ధర ఎక్కువే. కానీ తక్కువ ధరకే అందించాలన్నది కదా నా తాపత్రయం. మధ్యలో ఎవరైనా ఉంటే రేటు పెంచుతారని సొంతగా మార్కెటింగ్‌ చేస్తున్నా. దీని కోసం రాజంపేట పాత బస్టాండ్‌ దగ్గర దుకాణాన్నీ ఏర్పాటు చేశా. లాభాలు నా ఉద్దేశం కాదు. కాబట్టి, మార్కెట్‌ కంటే తక్కువకే ఇస్తా. నాకు ఓపిక ఉన్నంత కాలం దీన్ని కొనసాగిస్తా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నా. ఇది జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకం.

- సుభాష్‌, రాజంపేట గ్రామీణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్