ఈమె పండించిన వరి సువాసనభరితం..

లాల్‌ బస్నా ధాన్‌... ఇదో రకం ధాన్యం. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇవి సువాసననిస్తాయి. దీనికున్న మరో విశిష్టతేంటంటే... దీన్ని ఓ మహిళా రైతు సృష్టించింది. వ్యవసాయంమీద ప్రేమతో సాగువైపు అడుగుపెట్టిన కాదంబిని... ఈ వంగడం రూపకర్త. అంతేకాదు, తోటి మహిళలకు సాగు నైపుణ్యాలూ నేర్పిస్తూ వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తోందీమె.  

Published : 19 May 2022 01:11 IST

లాల్‌ బస్నా ధాన్‌... ఇదో రకం ధాన్యం. దీనికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇవి సువాసననిస్తాయి. దీనికున్న మరో విశిష్టతేంటంటే... దీన్ని ఓ మహిళా రైతు సృష్టించింది. వ్యవసాయంమీద ప్రేమతో సాగువైపు అడుగుపెట్టిన కాదంబిని... ఈ వంగడం రూపకర్త. అంతేకాదు, తోటి మహిళలకు సాగు నైపుణ్యాలూ నేర్పిస్తూ వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తోందీమె.

రైతు కుటుంబంలో పుట్టిన కాదంబినికి చిన్నప్పటి నుంచి వ్యవసాయమన్నా, తోటపని అన్నా చెప్పలేనంత ఇష్టం. డిగ్రీ తర్వాత పెళ్లితో అత్తింట అడుగుపెట్టింది తను. వీళ్లది ఒడిశాలోని రెథువా గ్రామం. భర్తది కూడా రైతు కుటుంబమే. వాళ్లుండే రఘునాథ్‌పుర్‌లో అందరూ వరి పైనే ఆధారపడతారు. కొన్నాళ్లయ్యాక ఖాళీగా ఉండటం నచ్చలేదు తనకు. స్థానికంగా రైతులు స్థాపించిన ‘గోరఖ్‌నాథ్‌ కృషక్‌ మహాసంఘా అసోసియేషన్‌’లో సభ్యురాలిగా చేరింది. వారి వద్ద సాగులో నూతన పద్ధతులను తెలుసుకునేది. సొంతంగా ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టాలనుకుంది.

అవగాహన పెంచుకొని..

నేషనల్‌ రైస్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్నార్‌ఆర్‌ఐ), ఒడిశా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ అండ్‌ టెక్నాలజీకి వెళ్లి శాస్త్రవేత్తలను కలుసుకునేది కాదంబిని. కొత్త వరి వంగడాల గురించి తెలుసుకునేది. క్రమంగా వరి పంట, కొత్తరకాల విత్తనాల ఉత్పత్తి వంటి వాటిపై అవగాహన పెంచుకుంది. వారి చేయూతతో రెండు రకాల వరి వంగడాలను తక్కువ చోటులో పండించి చూపించింది. అవే కేటాకిజుహ, కుద్రత్‌-3. ఈ రెండురకాలను ఎన్నార్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల మేరకు పండించింది. ‘రెండు మూడు తరాలుగా ఒకే రకమైనవి పండిస్తున్నారు. ఇలా కాకుండా కొత్త ప్రయోగం చేయాలనిపించింది. అది కూడా మంచి సువాసన కలిగే వరిని పండిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఇది అయిదేళ్ల నాటి మాట. కుద్రత్‌-3, కేటకిజుహా రకాలు రెండింటినీ కలిపి కొత్త వంగడం చేయాలనిపించింది. శాస్త్రవేత్తల సలహాలను పాటిస్తూ ఆ రెండింటినీ కలిపి విత్తనంగా చేయగలిగా. దాన్ని పండించే ప్రయత్నంలో విజయం సాధించా. ఇదంతా ఒక రూపానికి రావడానికి దాదాపు అయిదేళ్లు పట్టింది. నేను పండించిన ఈ కొత్త రకానికి ‘లాల్‌ బాస్నా ధాన్‌’ అని పేరు పెట్టా. ఇప్పటివరకు ఈ రకాన్ని ఎవరూ పండించలేదు. ఈ ధాన్యాన్ని నా పేరుతో నమోదు చేయించుకోవడానికి దిల్లీ పంపా. అక్కడ వివరాలన్నీ అధ్యయనం చేసి ఈ వరిని ఈ మధ్యే నా పేరుతో రిజిస్టర్‌ చేశారు. దీన్ని పండించడానికి, విక్రయించడానికి నాకు మాత్రమే హక్కు ఉంది. ఈ కొత్తరకం వరి సాగులో రైతు మిగతాపంటల కన్నా ఎక్కువ లబ్ధి పొందుతాడు. ముఖ్యంగా దీనికి నీరు పెద్దగా అవసరం ఉండదు. అధిక దిగుబడినీ అందుకోవచ్చు. 130 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బియ్యం రుచిగానే కాదు, సువాసనగానూ ఉంటుంది. బియ్యంతో చేసే స్వీట్లు, ఖీర్‌, ముధి వంటి వంటకాలకు ఇది బ్రహ్మాండంగా సరిపోతుంది’ అని వివరించింది కాదంబిని. స్థానికంగా ఉండే స్వయం సహాయక బృందాల మహిళలకు చేయూతనివ్వాలనుకుంది. కొత్తరకాల పంటలను పండించడంలో వారికి శిక్షణనిస్తూ మహిళాసాధికారత కోసం కృషి చేస్తోంది. తన ఇద్దరు మగపిల్లలను వ్యవసాయానికి సంబంధించిన కోర్సులనే చదివిస్తోంది. అందరికీ అన్నం పెట్టే అమ్మ దాన్ని పండించడంలోనూ ఎవరికీ తీసిపోదని నిరూపించింది కాదంబిని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్