మా శంకరి బంగారం అంటున్నారు!

ఆభరణాల తయారీలో మగవారే ఎక్కువగా కనిపిస్తారు. అటువంటి ఈ రంగంలో... నేను సైతం అంటూ కాలు మోపడమే కాదు... రికార్డులు సృష్టిస్తోంది శంకరి. తనదైన శైలిలో నగలను రూపొందించి ప్రత్యేకతను చాటుకుంటోంది. తన మనసుకు నచ్చిన ఈ కళలో శిక్షణ పొంది మరీ స్వర్ణకారిగా రాణిస్తోంది...

Updated : 12 Jun 2022 02:38 IST

ఆభరణాల తయారీలో మగవారే ఎక్కువగా కనిపిస్తారు. అటువంటి ఈ రంగంలో... నేను సైతం అంటూ కాలు మోపడమే కాదు... రికార్డులు సృష్టిస్తోంది శంకరి. తనదైన శైలిలో నగలను రూపొందించి ప్రత్యేకతను చాటుకుంటోంది. తన మనసుకు నచ్చిన ఈ కళలో శిక్షణ పొంది మరీ స్వర్ణకారిగా రాణిస్తోంది...

మిళనాడు రాష్ట్రంలో విల్లుపురం ప్రాంతానికి చెందిన ఓ పేద కుటుంబంలో పుట్టింది శంకరి. పదోతరగతి ఫెయిల్‌ కావడంతో స్వర్ణకారుల కుటుంబానికి చెందిన శివకిచ్చి పెళ్లి చేశారు. ఆభరణాలను తయారు చేసే భర్తను చూస్తూ, స్ఫూర్తి పొందింది శంకరి. తాను కూడా ఆ రంగంలోకి అడుగుపెట్టాలనుకుంది. ఇంట్లో చెబితే ముందు ఆశ్చర్య పోయారంతా. మహిళలు ఈ తరహా పని చేయకూడదంటూ నిరుత్సాహ పరిచారు. భర్త ఒక్కడే తనను ప్రోత్సహించాడు. అంతే కాదు... స్థానికంగా ఎక్కువగా ఆభరణాలు తయారు చేసే ప్రాంతం పట్టరాయా. అక్కడ తనని శిక్షణ సంస్థలో చేర్చాడు. అక్కడేమో శంకరి తప్ప అందరూ మగవారే! ఎంత శ్రమపడ్డా తనను ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉండే వారు. అయినా నేర్చుకోవాలనే తన తపన ముందు ఆ విమర్శలు, హేళనలు పనిచెయ్యలేదు.

ఎముకలు బలహీనం

నగల తయారీ ఆషామాషీ వ్యవహారం కాదు అంటుంది శంకరి. ‘టాటూగన్‌లా ఉండే ప్రత్యేక మెషిన్‌తో ఆభరణాలు తయారుచేస్తాం. ఎక్కువ సమయం దాంతో పనిచేసేటప్పుడు దాన్నుంచి వచ్చే వైబ్రేషన్స్‌ కారణంగా భుజం వద్ద ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. అందులోంచి వచ్చే పొడివల్ల నేత్ర సమస్యలొస్తాయి. అయితే ఇంటి పని ఎంత కష్టంగా ఉన్నా చేయగలిగే మహిళలం మనం. స్వర్ణకారి కావడం నా మనసుకు నచ్చినపని. అందువల్ల మిగిలిన వన్నీ సమస్యలుగా అనిపించలేదు. ఇప్పుడు రోజుకి 300 నుంచి 400 ఉంగరాలు రకరకాల డిజైన్లలో తయారు చేయగలుగుతున్నా. నెలకు రూ.25 వేల పైచిలుకు సంపాదిస్తున్నా. పండగల సమయాల్లో ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయి. తగ్గట్లే ఆదాయమూ పెరుగుతుంది. ఈ మధ్య ఒక ఆర్డరొచ్చింది. గడువేమో చాలా తక్కువ ఉంది. దాంతో రోజంతా కూర్చుని 1000 ఉంగరాలు చేసి అందించగలిగా. ఇది రికార్డని అందరూ మెచ్చుకున్నారు. మగవారితో పోటీగా పనిచేస్తున్న నేను మా జిల్లాలో తొలి స్వర్ణకారిని కావడం గర్వంగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ఆలోచించి డిజైన్‌ చేస్తుంటా. మొదట్లో బంధువులు, తెలిసిన వారు మగరాయుడిలా ఈ పని చేస్తున్నావని ఎద్దేవా చేశారు. నేను పట్టించుకోలేదు. నా అభిరుచి, ఆసక్తితో నా కుటుంబానికి ఆసరాగా మారడం చూసి అందరూ మా శంకరి బంగారం అని ప్రశంసిస్తున్నారు. నన్ను విమర్శించిన వాళ్లూ ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా కొందరికి స్ఫూర్తి అవుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటోంది శంకరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్