అమ్మా, అక్కా బూతులాపండి నాయనా!

బస్సుల్లో, ఆఫీసుల్లో... బహిరంగ స్థలాల్లో మగవాళ్లకి కోపం వస్తే ఒకరినొకరు తిట్టుకోరు. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని అమ్మని, అక్కని దూషిస్తారు. మనకీ ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఎదురై ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని ఖండించే ప్రయత్నం చేశామా? ‘గాలీ బంద్‌ కర్‌ అభియాన్‌’ ఉద్యమం ఆ ప్రయత్నం చేస్తోంది.. 

Updated : 24 Jun 2022 07:49 IST

బస్సుల్లో, ఆఫీసుల్లో... బహిరంగ స్థలాల్లో మగవాళ్లకి కోపం వస్తే ఒకరినొకరు తిట్టుకోరు. ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని అమ్మని, అక్కని దూషిస్తారు. మనకీ ఇలాంటి సందర్భాలు లెక్కలేనన్ని ఎదురై ఉంటాయి. కానీ ఎప్పుడైనా వాటిని ఖండించే ప్రయత్నం చేశామా? ‘గాలీ బంద్‌ కర్‌ అభియాన్‌’ ఉద్యమం ఆ ప్రయత్నం చేస్తోంది.. 

రియాణా, రాజస్థాన్‌, కశ్మీర్‌, నేపాల్‌, యూపీల్లోని వేలాది మహిళలు ‘గాలీ బంద్‌ కర్‌’.. ఆడవాళ్లని కించపరిచే ‘బూతులు ఆపండి!’ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వెయ్యిమంది ఆడవాళ్లు, వందమంది మగవాళ్లు కౌన్సెలర్లుగా... 300 మంది స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ ఉద్యమం విస్తరించడం విశేషం. పదేళ్ల క్రితం హరియాణాలోని బీబీపూర్‌లో ఈ ఉద్యమం పురుడుపోసుకుంది. సునీల్‌ జగ్లాన్‌ బీబీపూర్‌ గ్రామ సర్పంచ్‌. ఆ పదవిలోకి వచ్చిన తర్వాత అతనికి ఇద్దరమ్మాయిలు పుట్టారు. ఆ తర్వాత సునీల్‌ ఆలోచనాధోరణి పూర్తిగా మారిపోయింది. ఆడపిల్లల హక్కుల కోసం, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నడిపేవాడు. ఆ సమయంలో గ్రామ సభల్లో మగవాళ్లు అవలీలగా ఆడవాళ్లని ఉద్దేశించి బూతులు మాట్లాడేవారు. పక్కనే ఉన్న మహిళలు అవి విని తలెత్తుకోలేకపోయేవారు. ‘ఆ మాటలు’ సాధారణమే అనుకుని ఊరుకుంటే అవే క్రమంగా ఆడవాళ్లపై హింసని ప్రేరేపిస్తాయని నమ్మిన సునీల్‌ ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. 2014లో ‘గాలీ బంద్‌ కర్‌’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. దీనికోసం ఒక గ్రామ కమిటీని నియమించుకున్నారు ఊళ్లోని మహిళలు. ఎవరైనా మగవాళ్లు ఆడవాళ్లని కించపరిచేలా బూతులు మాట్లాడితే వాళ్లకి కఠినమైన జరిమానాలు ఉంటాయి. పాటలరూపంలో, అసభ్య చేష్టలతో వ్యక్తం చేసినా జరిమానా తప్పదు. అప్పటికీ వినకపోతే పోలీసులకే అప్పగిస్తారు. దాంతో గ్రామంలో నెమ్మదిగా మార్పు మొదలైంది. ఈ గ్రామం గురించి తెలుసుకున్న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాలకూ దీన్ని నమూనాగా చూపించి వారిలో స్ఫూర్తిని రగిలించారు. అంతకు ముందు నుంచీ ఈ గ్రామ ప్రజలు నడుపుతున్న ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ ఉద్యమానికిగానూ అనేక పురస్కారాలు వరించాయి. ఆ తర్వాత ప్రణబ్‌ ఫౌండేషన్‌కి సలహాదారుగా మారారు సునీల్‌. ‘సెల్ఫీవిత్‌ డాటర్‌’ సునీల్‌ ప్రారంభించిన ఈ ఉద్యమం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ దాన్ని తన మన్‌కీ బాత్‌ రేడియో కార్యక్రమాల్లో ప్రశంసించారు. దాంతో దేశం మొత్తానికి ఈ గ్రామం గురించి, గాలి బంద్‌ కర్‌ అభియాన్‌ గురించి  తెలిసింది. ఆ స్ఫూర్తితో బీబీపూర్‌ చుట్టుపక్కల 320 గ్రామాలు, వాటిలోని విద్యాసంస్థలు అసభ్యపదజాలంపై ఉద్యమించాయి. యూపీ, రాజస్థాన్‌లతోపాటు పక్కనున్న నేపాల్‌లోనూ ఈ మార్పు మొదలైంది. వందల మంది మహిళలు, మగవాళ్లు ఈ ఉద్యమంలో చేరి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. కొత్తతరం వాళ్లకన్నా వృద్ధులకి ఈ బూతుభాషని మార్చుకొమ్మని చెప్పడం కష్టమౌవుతోందని అంటారు వీళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్