అమృతాన్ని పంచుతున్నారు!

బిడ్డ ఆకలితో అల్లాడుతుంటేనే తల్లి మనసు తల్లడిల్లుతుంది. మరి వివిధ కారణాలతో చనుబాలకు దూరమైన నవజాత శిశువుల రోదన చూస్తే హృదయం కరగకుండా ఉంటుందా? ప్రత్యామ్నాయ పోషకాలేవీ ఈ అమృతానికి సాటి రాదు కాబట్టే... ఆ పసిబిడ్డల ప్రాణం నిలబెట్టడానికి ముందుకొచ్చారీ మాతృమూర్తులు.

Updated : 10 Aug 2023 07:07 IST

బిడ్డ ఆకలితో అల్లాడుతుంటేనే తల్లి మనసు తల్లడిల్లుతుంది. మరి వివిధ కారణాలతో చనుబాలకు దూరమైన నవజాత శిశువుల రోదన చూస్తే హృదయం కరగకుండా ఉంటుందా? ప్రత్యామ్నాయ పోషకాలేవీ ఈ అమృతానికి సాటి రాదు కాబట్టే... ఆ పసిబిడ్డల ప్రాణం నిలబెట్టడానికి ముందుకొచ్చారీ మాతృమూర్తులు. కన్నపేగుల కడుపు నింపుతూనే ఈ పని చేస్తూ.. మరికొందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వారే విజయవాడకు చెందిన మల్లాది రచన, మన్నెం హరితలు.


కానిస్టేబుల్‌ చేసిన పని చూసి..

చన ఇద్దరు పిల్లలకు తల్లి. ‘తమిళనాడులో తల్లిదండ్రులకు దూరమైన ఓ చిన్నారికి..అక్కడి మహిళా కానిస్టేబుల్‌ చనుబాలుపట్టి ఆకలి తీర్చిన సంఘటన తనని కదిలించిందంటారు’ ఆమె. తాను కూడా పాలను దానం చేయాలనుకున్నారు. గూగుల్‌లో వెతికి కొంత అవగాహన తెచ్చుకున్నారు. అయితే, అప్పటికి మొదటి బిడ్డకు జన్మనిచ్చి తొమ్మిది నెలలు దాటడంతో ఆ అవకాశం కలగలేదు. రెండోసారి ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడే.. పాల సేకరణకు కావాల్సిన పరికరాలను సమకూర్చుకున్నారామె. అయితే, తాముండే నగరంలో హ్యూమన్‌ మిల్క్‌ సెంటర్లు లేవు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో సేకరిస్తున్నట్లు తెలుసుకుని వారిని సంప్రదించారు. వారు విజయవాడలోని తమ శాఖలో సంప్రదించమని సూచించడంతో ఆ పని చేశారు. అక్కడ వారు తగు జాగ్రత్తలతో పాలను సేకరించే విధానాన్ని విశదీకరించారు. ఆపై రచన.. గత 9 నెలలుగా దాదాపు 27 లీటర్ల పాలు దానం చేశారు. ఇందుకోసం ఆహారం, జీవనశైలి వంటి విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అలారం పెట్టుకుని మరీ ప్రతి రెండు గంటలకు ఒకసారి పాలు సేకరించారు. ‘పాల దానం గురించి మొదట మావారికి మాత్రమే చెప్పా. తల్లిదండ్రులు, అత్తమామలకు చెబితే ఒప్పుకోరనుకున్నా. ఇప్పుడు అంతా గొప్ప పనిచేశానని అభినందిస్తున్నారు. నేను దానం చేసిన పాలు ఎన్‌ఐసీయూలో ఉన్న ఎంతో మంది నవజాత శిశువుల ప్రాణాలు నిలుపుతున్నాయన్న ఊహే ఎంతో సంతోషాన్నిస్తోందని’ చెబుతున్నారు రచన.


స్నేహితుల ద్వారా తెలుసుకుని...

మ్మపాలు అమృతంతో సమానం. ఏ కారణంతోనైనా అవి చిన్నారికి సరిగా అందకపోతే తల్లీబిడ్డలు పడే యాతన వర్ణనాతీతం. ఈ విషయం ఇద్దరు పిల్లల తల్లైన హరితకు బాగా తెలుసు. తొలిసారి కాన్పు అయ్యాక... తగినన్ని పాలు పడక, అవి బిడ్డకు సరిపోక ఆమెకూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలోనే తల్లిపాలను దానం చేస్తారన్న విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్నారు. మరో కాన్పు సమయంలో పాలు పడితే తానూ దానం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారామె. ఈ ఏడాది రెండో సంతానానికి జన్మనిచ్చారు హరిత. తనకు ప్రసవం చేసిన రెయిన్‌బో ఆసుపత్రి వైద్యుల సలహాతో మూడో రోజు నుంచే పాలను దానం చేయడం ప్రారంభించారు హరిత. అలా అప్పటి నుంచి ఇప్పటివరకూ 70 లీటర్ల పాలను అందించారు. జెల్‌ ప్యాక్‌లో పట్టి వాటిని ఆసుపత్రికి అందిస్తారు. ఇలా రోజూ ఏడు నుంచి ఎనిమిది సార్లు సేకరించారామె. ‘అమ్మగా బిడ్డల ఆకలి నాకు బాగా తెలుసు. తల్లిపాల ఆవశ్యకత గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక దేశంలో ఏటా 5 మిలియన్ల నవజాత శిశువులకు పాలు అందడం లేదని తెలిసి షాకయ్యా. దీనిపై మరింత అవగాహన పెరగాలి. కుటుంబ సభ్యుల సహకారంతోనే నేనీ పని చేస్తున్నా. దీనివల్ల కొంతమంది చిన్నారులకైనా మేలు కలుగుతుండటం సంతోషంగా ఉంది’ అంటారు హరిత.

- నాగరాజు కొల్లూరి, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని