విదేశాలకు కొబ్బరిపాలు ఎగుమతి చేస్తున్నా..

సాధించగలమా అంటూ  కూర్చోక.. వచ్చిన అవకాశాలను అందుకుంటే ఏదైనా సాధించొచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారామె. అదే ఆమెను ఉద్యోగిని నుంచి వ్యాపారవేత్తగా మార్చింది.

Updated : 11 Aug 2023 13:04 IST

సాధించగలమా అంటూ  కూర్చోక.. వచ్చిన అవకాశాలను అందుకుంటే ఏదైనా సాధించొచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారామె. అదే ఆమెను ఉద్యోగిని నుంచి వ్యాపారవేత్తగా మార్చింది. విదేశాలకూ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సుమీలా జయరాజ్‌ మనోగతమిది.

మాది కేరళలోని చావక్కడ్‌. లిటరేచర్‌లో పీజీ చేశాక వివాహమైంది. మావారు ముంబయిలో ఉద్యోగం చేస్తుండటంతో అక్కడికెళ్లా. కవలపిల్లలకు తల్లినయ్యా. ఆరేళ్లకు మావారు ఉద్యోగరీత్యా విదేశాలకెళ్లడంతో పిల్లలతో కేరళ వచ్చా. ఖాళీగా ఉండలేక ఎక్స్‌ట్రా వర్జిన్‌ కొబ్బరి నూనె తయారుచేసే ఓ ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా చేరా. కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సహకారంతో ఈ సంస్థ పనిచేసేది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొనే బాధ్యత నాదే. ప్రపంచ నలుమూలల నుంచి ఆర్డర్లు వచ్చేవి. ఓసారి లండన్‌, అమెరికా నుంచి పెద్ద ఆర్డరు రావడం చూసి ఆశ్చర్యపోయా. మూడేళ్ల అనుభవంతో దేశవిదేశాల్లో ఈ నూనెకు ఉన్న డిమాండ్‌ అర్థమై, సొంతంగా తయారు చేయాలనుకున్నా.

ఔషధంలా...

శుద్ధ కొబ్బరినూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై మరింత అధ్యయనం చేశా. దీనిలో భాగంగా తిరువనంతపురం క్యాన్సర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఆంకాలజిస్ట్‌ను కలిశా. అక్కడి 72 మంది క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు కీమోథెరపీ చేసినప్పుడు కలిగే నోటి అల్సర్‌కు ఔషధంలా దీన్ని వాడుతున్నట్లు తెలిసింది. ఇలా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలిశాక ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో ‘గ్రీన్‌ నట్‌ ఇంటర్నేషనల్‌’ ప్రారంభించా. మైసూరులోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ)లో శిక్షణ తీసుకొని, ఇంటి ఆవరణలో ఇద్దరు మహిళల సాయంతో తయారీ మొదలుపెట్టా.  స్థానికంగా చిన్నచిన్న డెలివరీలు ఇచ్చేదాన్ని. ఒక కో ఆపరేటివ్‌ సంస్థ అధికారి మా యూనిట్‌కొచ్చి వారి బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తామని అడిగితే సరేనన్నా. ఏడాదికల్లా ఆర్డర్లు పెరిగాయి. దీంతో ఒక పెద్ద యూనిట్‌ అద్దెకు తీసుకొని 2021లో సొంతంగా ‘గ్రీనౌరా’ బ్రాండ్‌ ప్రారంభించా. శిక్షణ తీసుకొని రెండేళ్లలోనే కొబ్బరి నూనె, పాలు, పొడి, చట్నీ, కోకోనట్‌ వాటర్‌ వెనిగర్‌, హెయిర్‌ క్రీం, ఊరగాయ వంటి పదికిపైగా ఉత్పత్తులు తయారు చేస్తున్నా. ఇది రూ.1.8 కోట్ల ప్రాజెక్టు. వ్యాపారాభివృద్ధిలో సవాళ్లూ ఉన్నాయి. పెట్టుబడి, మెషినరీ కొనుగోళ్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగా. చివరకు రూ.70 లక్షల రుణం దొరికింది. కొవిడ్‌లో పూర్తిగా యూనిట్‌ను మూసేయాల్సి వచ్చింది. అయినా సిబ్బందికి జీతాలిచ్చా. ఏడాది తర్వాత తిరిగి ప్రారంభించా. ఫుడ్‌ సేఫ్టీతోపాటు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ పొందాం. ఉత్పత్తులకు కావాల్సిన కొబ్బరి కాయలను స్థానిక రైతుల నుంచి తీసుకుంటాం. మా ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సూపర్‌ మార్కెట్లలో, ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తున్నాం. లండన్‌, న్యూజీలాండ్‌, మలేసియా, సింగపూర్‌కూ ఎగుమతి చేస్తున్నాం. 50 కుటుంబాలకు ఉపాధినిస్తున్నా. కేరళ ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ వ్యాపారవేత్త’, ‘బెస్ట్‌ ఎంటర్‌ప్రైజ్‌’, ‘బెస్ట్‌ ఉమన్‌ మేనేజ్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌’ వంటి పురస్కారాలు అందుకున్నా. ఇవన్నీ భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేయాలనే స్ఫూర్తినిచ్చేవే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్