నా ముఖం కాలిపోవడం తెలుస్తూనే ఉంది...!

‘అమ్మాయివి నీకెందుకీ రంగం’ అని అందరూ వద్దంటున్నా.. ఫైర్‌ ఫైటర్‌గా కెరియర్‌ని ప్రారంభించి... తాజాగా ఐఏఎస్‌ హోదాకి ఎదిగిన ఈ ఫైర్‌ బ్రాండ్‌ ప్రియా రవిచంద్రన్‌ కథ ఎక్కడ మొదలైందంటే..

Updated : 27 Jan 2024 17:54 IST

ఎటువైపు చూసినా మంటలే! అగ్నికీలలు నాలుకలు చాచి బెదిరిస్తున్నట్టుగా ఉంది. తన ముఖం సగం కాలిపోతున్నప్పుడు అవే చివరి క్షణాలు అనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకి తెలియదు! ‘అమ్మాయివి నీకెందుకీ రంగం’ అని అందరూ వద్దంటున్నా.. ఫైర్‌ ఫైటర్‌గా కెరియర్‌ని ప్రారంభించి... తాజాగా ఐఏఎస్‌ హోదాకి ఎదిగిన ఈ ఫైర్‌ బ్రాండ్‌ ప్రియా రవిచంద్రన్‌ కథ ఎక్కడ మొదలైందంటే...

‘అమ్మాయిలైతే సాహసాలు చేయకూడదా? నన్ను నేను నిరూపించుకోవడానికి ఏదైనా చేయాలి!’ ఇలా ఉండేవి కాలేజీ రోజుల్లో నా ఆలోచనలు. దానికితోడు నాన్న నేనేం చేస్తానన్నా ‘నీకు నమ్మకముందా సరే’ అనేవారు. ఆయనిచ్చిన భరోసాతో ఎన్‌సీసీ, క్రీడల్లో దూసుకెళ్లా. చెన్నైలోని ఎతిరాజ్‌ మహిళా కళాశాలలో కార్పొరేట్‌ సెక్రటేరియట్‌షిప్‌లో డిగ్రీ చేశా. ఆ తర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి పీజీ, సోషియాలజీలో ఎంఫిల్‌ చేశా. మరోపక్క సివిల్స్‌కూ సిద్ధమవుతుండేదాన్ని. అప్పుడే తమిళనాడులో టీఎన్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షలు రాసి, ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీసెస్‌కు ఎంపికయ్యా. ఈ ఉద్యోగానికి ఎంపికైన తొలి మహిళను నేనే అని తెలిసినప్పుడు నా సంబరం చూడాలి! కానీ అసలు పరీక్ష అప్పట్నుంచే మొదలైంది. ఉద్యోగం వచ్చేనాటికి ఐఆర్‌ఎస్‌ అధికారి రవిచంద్రన్‌తో వివాహమై.. రెండునెలల పసిపాప ఉంది. 

పసిబిడ్డతో పరీక్షలకు...

ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్లో ఉద్యోగం రావాలంటే... ఫిజికల్‌ ట్రైనింగ్‌ పాసవ్వాలి. మనుషుల్ని మోస్తూ నిచ్చెన ఎక్కడం, వేగంగా పరుగులు పెట్టడం లాంటివన్నీ చేయాలి. ‘ఒళ్లో రెండునెలల పసిపాప.. పైగా సిజేరియన్‌. ఈ పరిస్థితుల్లో ట్రైనింగా? ఉద్యోగం వదులుకో!’ అన్నవాళ్లే ఎక్కువ. కానీ నన్ను నేను నిరూపించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను. నా పరిస్థితి వివరిస్తే అధికారులు.. మా అమ్మ, అమ్మమ్మని తోడుగా ఉండనిచ్చారు. అలా నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌ నుంచీ, ఇంగ్లండ్‌లోని మోర్టోన్‌ ఇన్‌ మార్ష్‌ కాలేజీ నుంచీ కోర్సు పూర్తిచేసి ఫైర్‌ ఫైటర్‌గా ప్రత్యేకత సాధించుకున్నా. ఓసారి కోయంబత్తూర్‌లో నిర్మాణంలో ఉన్న మండపం కూలిపోయింది. ఒకతను సిమెంటులో కూరుకుపోయాడు. గట్టిగా లాగితే.. మిగిలిన గోడలు కూలిపోయే పరిస్థితి. ఓపిగ్గా ప్రయత్నించి... అతనితో సహా, ఐదుగురిని కాపాడా. దాంతో ప్రభుత్వం నాకు మరిన్ని బాధ్యతలు అప్పగించి, 2008లో ఇండస్ట్రియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్ శిక్షణ కోసం జర్మనీ పంపింది. ఎలాంటి మంటల నుంచైనా కాపాడే మెలకువల్ని అక్కడే నేర్చుకున్నా.

బతుకుతానని అనుకోలేదు

2012.. సంక్రాంతి పండగరోజు. అప్పుడు సెంట్రల్‌ చెన్నై అగ్నిమాపక అధికారిణిగా ఉన్నా. అర్ధరాత్రి ఒంటి గంటకు కంట్రోల్‌రూమ్‌ నుంచి ఫోన్‌. కలశ్‌మహల్‌లో పెద్దఎత్తున మంటలు వ్యాపించి.. చాలామంది ఆపదలో ఉన్నారని. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో హెల్మెట్, ఫైర్‌సూట్తో స్వయంగా మంటల్లోకి వెళ్లా. మంటలు అంతకంతకూ ఎక్కువై పైకప్పు నా మీద కూలింది. భరించలేనంత వేడి. పొగతో ఊపిరి పీల్చుకోలేకపోతున్నా. ఎవరూ ముందుకురాలేని పరిస్థితి. అప్పటికే నా శరీరం సగం కాలిపోయింది. ముఖం కాలిపోవడం తెలుస్తూనే ఉంది. ఆ మగతలో నా పిల్లలు.. ఇన్నేళ్ల నా కల, ఆశయం అన్నీ కళ్ల ముందు రీళ్లలా కదిలాయి. నా సంకల్పమే నన్ను బతికించిందేమో! ఆసుపత్రిలో 3 నెలలున్నా... ప్లాస్టిక్‌ సర్జరీ అయ్యింది. నాటి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రికొచ్చి పలకరించారు. డిశ్చార్జి అయ్యాక సాహస అవార్డు అందించారు. ఆ అవార్డు ప్రదానం నాతోనే మొదలైంది. తర్వాత ప్రెసిడెంట్‌ అవార్డునీ అందుకున్నా. ప్రస్తుతం తమిళనాడు ఉత్తర ప్రాంత సంయుక్త సంచాలకురాలిగా ఉంటూ ఐఏఎస్‌ హోదా అందుకోవడం సంతోషంగా ఉంది. తొలిరోజు ఎంత తపనతో ఉద్యోగంలో చేరానో, ఇప్పటికీ అదే తపన నాలో ఉంది. సవాళ్లకు ఎదురెళ్లే తత్వం ఉంటే ఏ ఆడపిల్లకైనా ఇలాంటి విజయాలు సాధ్యమే. టీఎన్‌పీఎస్‌సీ వంటి ప్రభుత్వ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంటూ ఆడపిల్లల ఎదుగుదలకి నా వంతు సహకారం అందిస్తున్నా. 

 హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్