మా అమ్మాయిని కాపాడుకోలేమా!

మాకు ఒక్కతే కూతురు. బ్యాంకు మేనేజర్‌నిచ్చి పెళ్లి చేశాం. వారికి ఆరేళ్ల పాప. మా అల్లుడు ప్రతి చిన్న విషయానికీ తన భార్యని కొట్టడం, పాపని వదిలేసి ఇంటినుంచి పొమ్మనడం చేస్తున్నాడు.

Updated : 31 Oct 2023 12:55 IST

మాకు ఒక్కతే కూతురు. బ్యాంకు మేనేజర్‌నిచ్చి పెళ్లి చేశాం. వారికి ఆరేళ్ల పాప. మా అల్లుడు ప్రతి చిన్న విషయానికీ తన భార్యని కొట్టడం, పాపని వదిలేసి ఇంటినుంచి పొమ్మనడం చేస్తున్నాడు. మనవరాలిని చూడాలనిపించి ఈ మధ్య వాళ్లింటికి వెళ్లాం. అప్పుడు అకారణంగా మా ముందే మా అమ్మాయి మీద దాడి చేశాడు. సర్దిచెప్పాలని చూసిన మమ్మల్ని తక్షణం ఇంటి నుంచి బయటకి వెళ్లిపొమ్మన్నాడు. మేం వచ్చేస్తూ మా బిడ్డను కాస్త ఓర్చుకొమ్మని, అంతా సర్దుకుంటుందని చెప్పి వచ్చామే కానీ, తన జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఇప్పుడు మేం తనకి రక్షణగా ఎలా నిలబడగలం చెప్పగలరు.

- ఓ తండ్రి

బిడ్డ మీద చేయి చేసుకోవడం చూసి మీరెంత బాధపడ్డారో ఊహించగలను. మీ ముందే అతడు అంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడంటే వెనుక ఏదైనా కారణం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేకపోవడానికి పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు... వంటివేవైనా ప్రభావం చూపిస్తున్నాయేమో గమనించారా? వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ అమ్మాయిని ఓర్చుకో అని చెప్పడం కరెక్టు కాదు. పరిష్కార మార్గాలు ఆలోచించాలి. ముందుగా అతడి తరఫున వారిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడండి. ఇంట్లోంచి వెళ్లిపోమనడానికీ, పాపని వదిలేసి వెళ్లమనడానికీ అతనికి ఏ హక్కూ లేదు. ఆర్థికంగా ఏమైనా ఒత్తిళ్లు ఉంటే అందరూ కలిసి కూర్చుని పరిష్కారం చూపించండి. సాధారణంగా మహిళలను హింసించే ప్రవృత్తిని అరికట్టడానికి గృహహింస చట్టం తెచ్చారు. కానీ, అది భార్యాభర్తల మధ్య సంబంధాలు పునరుద్ధరించడానికి ఉపయోగపడటం లేదు. ఆడవారు మౌనంగా భరిస్తున్నంత కాలం భర్తలు తమదే పై చేయి అనుకుంటారు. ఒకసారి కోర్టు గుమ్మం ఎక్కితే పరువు పోయిందని విడాకుల కోసం ప్రయత్నిస్తారు. అలాగని హింసను భరించమని చెప్పడం తప్పు. ఏ కారణంగా అయినా అతడు మీ అమ్మాయిని వేధిస్తుంటే మాత్రం తప్పక గృహహింస చట్టాన్ని ఆశ్రయించి ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ దగ్గర ఫిర్యాదు చేయండి. వాళ్లు పిలిచి కౌన్సెలింగ్‌ చేస్తారు. బ్యాంకు ఆఫీసర్‌ కాబట్టి ఉద్యోగ భద్రత కోసం తగ్గొచ్చు. లేదంటే ఏదైనా ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌కి వెళ్లండి. తను విడాకులు తీసుకోవాల్సిన పనిలేదు. గృహహింస చట్టంలో విడాకుల ప్రసక్తి లేకుండానే అండగా నిలబడే సెక్షన్లు తెచ్చారు. వాటిల్లో రక్షణ హక్కు, ఆ ఇంట్లోనే నివసించే హక్కుతో పాటు తనకీ, తన బిడ్డ పోషణకు అయ్యే ఖర్చులు, పరిహారం వంటివన్నీ అడిగి తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా త్వరగా నిర్ణయించుకుని ఆమెకో దారి చూపించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్