మితంగా తింటే ఈ పిండివంటల్లో ఆరోగ్య ప్రయోజనాలూ ఎన్నో!

'సంబరాల సంకురాత్రి.. వూరంతా పిలిచింది..' అన్నట్లుగా సంక్రాంతి పండగ సంబరాలనే కాదు.. ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా మోసుకొస్తుంది. ఈ పండక్కి ఏ ఇంటి ముంగిలి చూసినా రంగురంగుల రంగవల్లికలతో ఎలాగైతే కళకళలాడుతుంటుందో.. అలాగే ప్రతి ఇల్లూ వివిధ రకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతుంటుంది.

Published : 15 Jan 2022 15:36 IST

'సంబరాల సంకురాత్రి.. వూరంతా పిలిచింది..' అన్నట్లుగా సంక్రాంతి పండగ సంబరాలనే కాదు.. ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా మోసుకొస్తుంది. ఈ పండక్కి ఏ ఇంటి ముంగిలి చూసినా రంగురంగుల రంగవల్లికలతో ఎలాగైతే కళకళలాడుతుంటుందో.. అలాగే ప్రతి ఇల్లూ వివిధ రకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. పండక్కి వారం ముందు నుంచే వీటిని తయారు చేయడంలో నిమగ్నమైపోతారు గృహిణులు. వీటిలో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పొంగలి. దీంతో పాటు సకినాలు, అరిసెలు, జంతికలు.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. దేని ప్రత్యేకత దానిదే. అయితే ఈ వంటకాలన్నీ రుచికరంగా ఉంటూ నోరూరించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు చేసుకునే కొన్ని పిండి వంటలు, వాటి వల్ల ఆరోగ్య పరంగా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

పొంగలి

కావాల్సినవి

* పాలు - 2 లీటర్లు

* కొత్త బియ్యం - 1 కప్పు (అరగంట సేపు నానబెట్టాలి)

* బెల్లం తురుము - 4 కప్పులు

* యాలకులు - 5

* పెసరపప్పు - అర కప్పు

తయారీ విధానం

ఒక పెద్ద బాణలిలో పాలు పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు పెసరపప్పు, బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అవి ఉడికేంత వరకు స్టౌ సిమ్‌లోనే ఉంచాలి. ఈ మిశ్రమం మరీ గట్టిపడక ముందే దింపేయాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసి దాన్ని కరిగేంత వరకు కలుపుతుండాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి కలుపుకోవాలి. ఈ క్రమంలో మిశ్రమం కాస్త గట్టిగా తయారవుతుంది. చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. అంతే సంక్రాంతి పొంగలి వడ్డించడానికి సిద్ధం!

ఆరోగ్య ప్రయోజనాలు..

* పాలలో అధికంగా ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం.. మొదలైన ఖనిజాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే పాలు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఉడికించిన అన్నంలో జింక్, మాంగనీస్.. వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లు తొలగిపోయి జీవక్రియల పనితీరు మెరుగవుతుంది.

* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో ఆరోగ్యానికి కావలసిన ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

* పెసరపప్పులో ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, పొటాషియం.. వంటి ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది రక్తంలో కొవ్వుల్ని కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి నాజుగ్గా తయారవ్వాలనుకునే వారికి ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

* యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.


సకినాలు

కావాల్సినవి

* బియ్యం - 8 కప్పులు

* వాము - 6 చెంచాలు

* నువ్వులు - 1 కప్పు

* ఉప్పు - తగినంత

* నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం

బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి ఒక శుభ్రమైన గుడ్డ మీద వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. నీరంతా పోయి కాస్త తడిగా ఉన్నప్పుడు పిండి పట్టించాలి. కడాయి వేడి చేసి నువ్వులను దోరగా వేయించి పిండిలో వేయాలి. వాము, తగినంత ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా తడిపి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండిని చేత్తో తీసుకుని వేళ్లతో పొడవుగా తిప్పుతూ ఒక కాటన్ గుడ్డపై మూడు లేదా నాలుగు చుట్లుగా చుట్టాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి వీటిని కొద్దికొద్దిగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసి భద్రపరచుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

* బియ్యప్పిండిలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

* ఉప్పులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు కండరాల, నాడీవ్యవస్థకు కూడా చాలా మంచివి. అలాగే దీనివల్ల శరీరం నీటి స్థాయుల్ని కోల్పోకుండా కూడా ఉంటుంది.

* వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు, గొంతు పట్టేయడం.. వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.

* నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి డయాబెటిస్ రాకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఎక్కువగా ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.


అరిసెలు

కావాల్సినవి

* బియ్యం - 2 కిలోలు

* బెల్లం - 1 కిలో

* నువ్వులు - వంద గ్రాములు

* నీరు - పావు లీటరు

* నూనె - వేయించడానికి సరిపడా

* అరిసెల చెక్కలు (అరిసెల నుంచి నూనె పిండడానికి)

తయారీ విధానం

బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రెండు రోజుల పాటు నానబెట్టాలి. ఈ క్రమంలో రోజుకు రెండుసార్లు ఆ నీటిని పారబోసి మళ్లీ నీళ్లు పోస్తుండాలి. ఇలా చేస్తే బియ్యం వాసన రాకుండా ఉంటాయి. ఇలా రెండు రోజుల పాటు నానిన బియ్యాన్ని వడకట్టి ఒక శుభ్రమైన గుడ్డలో వేసి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గిర్నీ పట్టించుకోవాలి. ఒక పెద్ద పాత్రలో తురిమిన బెల్లాన్ని వేసి అందులో పావు లీటర్ నీరు పోసి పెద్ద మంటపై ఉంచాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడకట్టాలి. దీన్ని మరో పాత్రలో తీసుకుని స్టవ్‌పై చిన్న మంటపై ఉంచి ఉండ పాకం వచ్చేంత వరకు అలాగే ఉంచి దించేయాలి. ఇప్పుడు చిన్న మంటపై నువ్వుల్ని కొద్దిగా వేయించుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పాకంలో రెండు చెంచాల నెయ్యి, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా బియ్యప్పిండి వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని పూరీల సైజులో గుండ్రంగా ఒత్తుకుంటూ వేడిచేసిన నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుని తీసేయాలి. ఇలా తీసిన అరిసెను అరిసెల చెక్కపై ఉంచి ఒత్తాలి. దీనివల్ల అరిసెలకు అదనంగా అంటుకున్న నూనె తొలగిపోతుంది. సో.. తియ్యతియ్యటి అరిసెలు తినడానికి తయార్.

ఆరోగ్య ప్రయోజనాలు..

* ఉడికించిన అన్నంలో జింక్, మాంగనీస్.. వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లు తొలగిపోయి జీవక్రియల పనితీరు మెరుగవుతుంది.

* నువ్వుల్లో మెగ్నీషియం, ఇతర పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి డయాబెటిస్ రాకుండా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఎక్కువగా ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.


బియ్యప్పిండి జంతికలు

కావాల్సినవి

* బియ్యప్పిండి - 3 కప్పులు

* పుట్నాలపప్పు పొడి - 1 కప్పు

* కారం - 2 చెంచాలు

* ఉప్పు - తగినంత

* వాము - 1 చెంచా

* నీళ్లు - 2 కప్పులు

* నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం

బియ్యప్పిండి, పుట్నాల పొడి.. రెండింటినీ ఒక పాత్రలో వేసి కలుపుకోవాలి. దీనిలో కారం, వాము కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో నీరు తీసుకుని అందులో రెండు చెంచాల నూనె వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న బియ్యప్పిండిలో పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పిండి గట్టిగా అయినట్లనిపిస్తే కొద్దిగా చల్లటి నీరు పోసి మృదువుగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు తయారు చేసుకునే మిషన్ లోపలి వైపు కొద్దిగా నూనె పూసి కాస్త పిండిని అందులో పెట్టి రెండుమూడు వరుసలు వచ్చేలా జంతిక ఆకారంలో ఒక శుభ్రమైన గుడ్డపై ఒత్తుకోవాలి. తర్వాత నూనె వేడిచేసి అందులో నెమ్మదిగా వీటిని వేస్తూ బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా పిండినంతా తయారు చేసుకోవాలి. అంతే కరకరలాడుతూ నోరూరించే జంతికలు రడీ.. చల్లారాక వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు..

* కారప్పొడిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

* ఉప్పులో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు కండరాల, నాడీవ్యవస్థకు కూడా చాలా మంచివి. అలాగే దీనివల్ల శరీరం నీటి స్థాయుల్ని కోల్పోకుండా కూడా ఉంటుంది.

* బియ్యప్పిండిలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

* వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు, గొంతు పట్టేయడం.. వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.


పాకుండలు

కావాల్సినవి

* ఇంట్లో తయారు చేసుకున్న బియ్యప్పిండి - 2 కప్పులు

* బెల్లం తురుము - 1 కప్పు

* యాలకుల పొడి - అర చెంచా

* కొబ్బరి తురుము - 1 చెంచా

* నెయ్యి - చెంచా

* నూనె - వేయించడానికి సరిపడా

బియ్యప్పిండి తయారీ

బియ్యాన్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడకట్టి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలి.

తయారీ విధానం

పెద్ద బాణలిలో బెల్లం తురుము వేసి అందులో కొన్ని నీళ్లు పోసి చిన్న మంటపై బెల్లం కరిగే వరకు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి తిరిగి అదే పాత్రలో తీసుకొని చిన్న మంటపై పాకం వచ్చే వరకూ వేడి చేయాలి. తర్వాత స్టవ్ కట్టేసి.. బెల్లం పాకంలో యాలకుల పొడి, కొబ్బరి తురుము, చెంచా నెయ్యి.. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకోవాలి. తర్వాత డీప్‌ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో ఈ ముద్దల్ని వేసి స్టవ్ సిమ్‌లో పెట్టి బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకుని చల్లారనివ్వాలి. అంతే చూడగానే నోరూరిపోయే పాకుండలు రడీ..

ఆరోగ్య ప్రయోజనాలు..

* బియ్యప్పిండిలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలోని వ్యర్థపదార్థాలను తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇందులో ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.

* యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్టపరుస్తాయి.

* నెయ్యి వల్ల లావవుతామేమోనన్న భయం అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి శరీరంలోని అనవసర కొవ్వులను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ, రోగనిరోధక వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

* కొబ్బరిలో ఉండే ఫైబర్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలవడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి డయాబెటిస్ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే శరీర అలసటను తగ్గించి తక్షణ శక్తినివ్వడంలో సహాయపడుతుంది.


మినప సున్నుండలు

కావాల్సినవి

* మినప్పప్పు - 1 కప్పు

* బెల్లం - 1 కప్పు

* పుట్నాలు - అర కప్పు

* యాలకుల పొడి - చెంచా

* నెయ్యి - అర కప్పు

తయారీ విధానం

ముందుగా స్టౌ మీద ప్యాన్ పెట్టి అందులో మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మినప్పప్పు చల్లారిన తర్వాత పుట్నాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరోవైపు బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం పొడి, మినప్పప్పు-పుట్నాల పొడి.. ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరచేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని ఉండలుగా కట్టుకోవాలి. అంతే మినప సున్నుండలు రడీ..

ఆరోగ్య ప్రయోజనాలు..

* మినప్పప్పులో శరీరానికి కావలసిన ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియల రేటును మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అలాగే దీనివల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇందులో ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.

* యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. అంతేకాదు.. ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.

* ఇక ఇందులో ఉపయోగించిన నెయ్యి వల్ల లావవుతామేమోనన్న భయం అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి శరీరంలోని అనవసర కొవ్వులను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ, రోగనిరోధక వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్