సుఖనిద్రకు ఈ పానీయాలు!

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రశాంతంగా నిద్ర పోవడం ముఖ్యం. కానీ ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. అందుకే రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పానీయాలు తాగితే సుఖంగా నిద్ర పడుతుందంటున్నారు నిపుణులు.

Published : 22 Feb 2024 13:13 IST

అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రశాంతంగా నిద్ర పోవడం ముఖ్యం. కానీ ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. అందుకే రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పానీయాలు తాగితే సుఖంగా నిద్ర పడుతుందంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

అరటిపండు స్మూతీ..

సాధారణంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మెగ్నీషియం లోపం కూడా ఓ కారణమే! కాబట్టి నిద్రకు ఉపక్రమించడానికి ముందు అరటిపండు స్మూతీ తీసుకోవడం వల్ల సుఖంగా నిద్ర పడుతుందట!

దీనికోసం ఒక అరటిపండు, రెండు చెంచాల ఆల్మండ్ బటర్, కప్పు పాలు బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకొని నేరుగా తాగేయచ్చు. ఇంకాస్త తియ్యదనం కోరుకునే వారు ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు. అరటిపండు, ఆల్మండ్ బటర్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కేవలం ప్రశాంతమైన నిద్రకే కాదు.. కండర, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.

పాలు, తేనెతో..

వేడి పాలలో కొద్దిగా వెనీలా ఎసెన్స్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు కొద్దికొద్దిగా సిప్‌ చేయాలి. పాలల్లో ఉండే అమైనో ఆమ్లాలు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయి. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది. అలాగే వెనీలా ఎసెన్స్ మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక తేనె కూడా నిద్రకు ఉపకరించే హార్మోన్లు విడుదలయ్యేందుకు దోహదం చేస్తుంది.

చామొమైల్ టీ..

ఒక కప్పులో మరిగించిన నీళ్లు తీసుకొని అందులో చామంతి ఆకులు లేదా పువ్వులు వేసి మూడు నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె, పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. అంతే.. చామొమైల్ టీ రడీ అయిపోతుంది. దీనికి బదులుగా మార్కెట్లో దొరికే చామొమైల్ టీ బ్యాగ్స్‌ని వేడి నీటిలో వేసుకోవడం ద్వారా కూడా చామొమైల్ టీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని నిద్ర పోవడానికి ముందు తాగడం వల్ల చక్కని నిద్ర మన సొంతం చేసుకోవచ్చు.

బాదం పాలతో..

ఒక కప్పు బాదం పాలు తీసుకొని అందులో చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా అల్లం వేసి మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక అందులో కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.

చెర్రీ జ్యూస్..

రోజూ ఉదయం, రాత్రి వేళల్లో గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందంటున్నారు నిపుణులు. చెర్రీల్లో ఉండే మెలటోనిన్ అనే పదార్థమే ఇందుకు కారణమట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్