జిడ్డు, చెమటకాయలు... పరిష్కారమిలా!

వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్.. ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి కారణంగానే వేసవిలో చెమటకాయలు ఎక్కువగా బాధిస్తుంటాయి. వాటితో పాటు ట్యాన్, సన్‌బర్న్.. వంటి సమస్యలు కూడా తోడవడంతో సౌందర్యపరంగా ఇబ్బందులు....

Published : 31 Mar 2023 21:18 IST

వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్.. ఈ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి కారణంగానే వేసవిలో చెమటకాయలు ఎక్కువగా బాధిస్తుంటాయి. వాటితో పాటు ట్యాన్, సన్‌బర్న్.. వంటి సమస్యలు కూడా తోడవడంతో సౌందర్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ముఖం, మెడ, వీపు వెనుకభాగం, చేతులు.. మొదలైన ప్రాంతాల్లో ఈ సమస్యలు తలెత్తితే ఇబ్బంది ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వాటి నుంచి విముక్తి పొందేందుకు చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే రసాయనాలు కలిగిన రకరకాల ఉత్పత్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. వాటికి బదులుగా కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు అనుసరించడం ద్వారా కూడా సులభంగా ఉపశమనం పొందచ్చు.

ఓట్‌మీల్స్‌తో..

స్నానం చేసే నీటిలో ఓట్స్ కలుపుకోవడం ద్వారా వేసవిలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా మూసుకుపోయిన స్వేదగ్రంధులు తెరచుకునేలా చేస్తాయి. తద్వారా చెమటకాయలు తగ్గడంతో పాటు వాటివల్ల కలిగే దురద, మంట.. వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. ఈ ఫలితం పొందడానికి స్నానం చేయడానికి కాసేపటి ముందు గోరువెచ్చని నీటిలో రెండు లేదా మూడు కప్పుల ఓట్స్ వేసి కాసేపు నాననివ్వాలి. బాత్‌టబ్‌లో స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాను అనుసరిస్తే మరింత మెరుగైన ఫలితం పొందచ్చు.

ఐస్‌క్యూబ్స్‌తో..

చెమటకాయలు, వాటి వల్ల వచ్చే దురద, మంట.. వీటి నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభ్యమయ్యే ఐస్‌క్యూబ్స్‌ని ఉపయోగిస్తే చాలు.. కాటన్ లేదా మెత్తని వస్త్రంలో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేయాలి. దానిని మూటలా కట్టి దాంతో సమస్య ఉన్న ప్రదేశంలో మృదువుగా అద్దుకోవాలి. తరచూ ఇలా చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ముల్తానీమట్టితో..

సూర్యరశ్మి కారణంగా సన్‌బర్న్, ట్యాన్.. వంటి సమస్యలు తలెత్తడం సహజం. వాటి నుంచి విముక్తి పొందేందుకు ముల్తానీ మట్టి చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం రెండు చెంచాల ముల్తానీమట్టిలో సరిపడా రోజ్‌వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. సమస్య ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్త్లె చేసి పూర్తిగా ఆరేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ముల్తానీమట్టికి బదులుగా చందనం లేదా గంధం కూడా ఉపయోగించవచ్చు.

కీరాదోసతో..

వేసవిలో మనకి ఇటు అందం పరంగా, అటు ఆరోగ్య పరంగా అధిక ప్రయోజనాలు అందించే వాటిలో కీరాదోస ఒకటి. దానిని ముక్కలుగా కోసి సమస్య ఉన్న ప్రాంతంలో వాటితో రుద్దడం.. లేదా కీరాదోసను మెత్తని గుజ్జులా చేసి సన్‌బర్న్, ట్యాన్, చెమటకాయలు.. మొదలైనవి ఉన్న ప్రాంతంలో దానిని అప్త్లె చేసుకోవాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సమస్య తగ్గుముఖం పట్టేలా చేయచ్చు. అలాగే దీనిని ఉపయోగించడం ద్వారా చర్మానికి సహజసిద్ధంగా చల్లదనం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్