ఆ మరకలను ఇలా పోగొట్టేయచ్చు!

రక్తం మరకలు ప్రతి మహిళ జీవితంలోనూ భాగమే.. నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ దశ చేరేవరకూ కనీసం ఒక్కసారైనా రక్తం మరకలు దుస్తులకు అంటనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. ఇలాంటప్పుడే కాదు.. కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు తెగడం, ఏదైనా పదునైన వస్తువు గుచ్చుకున్నప్పుడు

Published : 12 Nov 2021 16:34 IST

రక్తం మరకలు ప్రతి మహిళ జీవితంలోనూ భాగమే.. నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి మెనోపాజ్ దశ చేరేవరకూ కనీసం ఒక్కసారైనా రక్తం మరకలు దుస్తులకు అంటనివారుండరంటే అతిశయోక్తి కాదేమో.. ఇలాంటప్పుడే కాదు.. కూరగాయలు తరుగుతున్నప్పుడు వేలు తెగడం, ఏదైనా పదునైన వస్తువు గుచ్చుకున్నప్పుడు, చిన్న చిన్న ప్రమాదాల సమయంలో రక్తం రావడం వాటివల్ల కూడా దుస్తులకు మరకలవడం సహజమే.. అయితే చిన్న మరకైంది కదా అని ఎంతో ఇష్టపడిన డ్రస్సును పక్కన పడేయలేం. అలాగని ఆ మరకలు అంత సులభంగా వదలవు. ఎన్నిసార్లు ఉతికినా.. పూర్తిగా పోవడానికి కొంతకాలం పడుతుంది. మరి, ఇలాంటి మరకల్ని తొలగించడానికి మార్గాలే లేవా? అంటే ఉన్నాయి.. కొన్ని సులువైన చిట్కాలతో రక్తపు మరకలను ఇట్టే తొలగించవచ్చు. అవేంటో చూద్దాం రండి..

చల్లని నీరే ముద్దు..

రక్తం మరకలు అంటగానే చాలామంది వేడి నీళ్లలో నానబెడుతుంటారు. దీనివల్ల మరక త్వరగా వదిలిపోతుందని వారి భావన. మిగిలిన అన్ని మరకల విషయంలోనూ ఇది నిజమే కావచ్చు. కానీ రక్తం మరకలు మాత్రం వేడి తగిలితే ఇంకాస్త గట్టిగా అతుక్కుంటాయి. అందుకే ఇలాంటి సందర్భాల్లో చల్లని నీటినే ఎక్కువగా ఉపయోగించాలి. దీనివల్ల మరక తొలగిపోవడం సులభమవుతుంది. వీలుంటే నీటిలో ఉప్పు వేసి అందులో దుస్తులను నానబెట్టడం ద్వారా మరక సులభంగా వదిలిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మరక పడినచోట కొన్ని నీళ్లు పోసి ఆ తర్వాత గళ్ల ఉప్పు తీసుకొని రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే మరక సులభంగా పోతుంది. ఒకవేళ మొదటిసారికే మరక పూర్తిగా పోకపోతే మరోసారి ఇలాగే ప్రయత్నించడం వల్ల దాన్ని తొలగించవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో..

ప్రస్తుతం హైడ్రోజన్ పెరాక్సైడ్ దాదాపు అన్ని ఇళ్లలోనూ కనిపిస్తోంది. దీన్ని రక్తం మరకలను తొలగించడానికి కూడా వాడవచ్చు. దీనికోసం ముందుగా కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకొని మరక పడినచోట పోయాలి. ఆ ప్రాంతమంతా నానేలా ఈ ద్రావణాన్ని పోసిన తర్వాత కాసేపు అలాగే ఉండనిచ్చి, ఉతికేస్తే సరిపోతుంది. లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో నానబెట్టిన దుస్తులను వేరే క్లాత్ లేదా టిష్యూ సాయంతో కొద్దిగా తుడిచి, ఆ తర్వాత ఓ శుభ్రమైన క్లాత్‌ని మరకపై వేసి, ఐరన్ చేసినా మరక తొలగిపోతుంది. వేడికి మరకతో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆవిరవడమే దీనికి కారణం.

కూల్‌డ్రింక్ ఉందిగా..

ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పద్ధతులైనా ఉపయోగించవచ్చు. బయట ఉన్నప్పుడు దుస్తులకు మరక అంటితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో వూహించలేం.. ఇలాంటప్పుడు వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి చల్లని నీటితో ఆ మరక ఉన్న ప్రదేశాన్ని వాష్ చేయాలి. అయినా మరక పూర్తిగా పోకపోతే ఆ ప్రదేశంలో కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్ కొద్దిగా వేసి కాసేపు ఉంచాలి.. ఆ తర్వాత బాగా రుద్ది చల్లని నీటితో కడిగేస్తే మరక మాయమైపోతుంది. ఆ తర్వాత నీటి తడి ఆరేవరకూ మీరు అక్కడే ఉంటే చాలు.. తిరిగి మామూలుగా బయటకు వచ్చేయవచ్చు.

వెనిగర్‌తోనూ..

మరక పడిన వస్త్రాన్ని వెనిగర్ ద్రావణంలో ఐదు నుంచి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత టిష్యూపేపర్‌తో తుడిచేయాలి. ఆపై దీన్ని చల్లని నీటితో కడిగేస్తే సరి.. ఇదే పద్ధతిని నిమ్మకాయతోనూ పాటించవచ్చు. నిమ్మరసంలో చాలా కొద్దిగా నీళ్లు కలిపి ఆ మిశ్రమంలో మరకపడిన వస్త్రాన్ని నానబెట్టాలి. అరగంట తర్వాత దీన్ని బయటకు తీసి కాస్త రుద్ది నీళ్లతో కడిగితే సరి. మరక మాయమైపోతుంది.

అమ్మోనియాతో ఇలా..

ఇవే కాదు.. అమ్మోనియాతోనూ మరకను తొలగించవచ్చు. దీనికోసం అమ్మోనియాను మరక పడిన చోట కొద్దిగా వేసి కాటన్‌తో తుడవాలి. ఆ తర్వాత దాన్ని బాగా రుద్ది చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. అయితే ఈ ప్రక్రియకు ముందు ఏ దుస్తులకైతే అమ్మోనియా పెట్టాలనుకుంటున్నామో దాని చివరను తీసుకొని ప్యాచ్ టెస్ట్ చేయాలి. అమ్మోనియా గాఢంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించినప్పుడు కొన్ని వస్త్రాలు రంగు వెలిసే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందు ప్రయత్నించి ఆ తర్వాతే ఉపయోగించాలి.

కార్న్‌ఫ్లోర్ కోటింగ్..

దుస్తులపై మరకలైతే నీటితో ఉతకగలుగుతాం. కానీ సోఫాలు, పరుపులపై పడిన మరకల్ని ఏం చేయగలుగుతాం.. అనుకుంటున్నారా? అయితే దానికోసం మొక్కజొన్న పిండిని ఉపయోగించండి. కార్న్‌ఫ్లోర్‌ని ఓ గిన్నెలో తీసుకొని అందులో చల్లని నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మరక ఉన్న చోట దట్టంగా పూయాలి. ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఆరనిచ్చి బ్రష్ సాయంతో నెమ్మదిగా తొలగిస్తే సరిపోతుంది. ఇందులో మొక్కజొన్న పిండికి బదులు టాల్కం పౌడర్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల మరక ఇట్టే తొలగిపోతుంది. ఒకవేళ ఇంకాస్త మిగిలిపోయిందనిపిస్తే మరోసారి ఇదే పద్ధతిని ఉపయోగిస్తే సరి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్