సాక్స్‌ని ఇలా కూడా వాడచ్చు..!

'అబ్బబ్బా.. ఈ సాక్సు మళ్లీ కనిపించట్లేదు. ఈ నెలలో ఇది రెండోది. ప్రతిసారీ కొత్తది కొనడం, అసలేమాత్రం పాడవని ఈ సాక్స్‌లను చూస్తూ చూస్తూ పడేయడం.. ఇదో పెద్ద గోలగా మారింది..' అంటోంది ప్రియ.. ఇది కేవలం ప్రియకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. మనలో చాలామంది ఎదుర్కొనేదే. సాక్సులు కొన్న తర్వాత కొన్నాళ్లకే అవి బోర్‌ కొట్టేయడం.. లేదా ఒకటి బాగుండి..

Published : 22 Feb 2022 20:46 IST

'అబ్బబ్బా.. ఈ సాక్సు మళ్లీ కనిపించట్లేదు. ఈ నెలలో ఇది రెండోది. ప్రతిసారీ కొత్తది కొనడం, అసలేమాత్రం పాడవని ఈ సాక్స్‌లను చూస్తూ చూస్తూ పడేయడం.. ఇదో పెద్ద గోలగా మారింది..' అంటోంది ప్రియ.. ఇది కేవలం ప్రియకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. మనలో చాలామంది ఎదుర్కొనేదే. సాక్సులు కొన్న తర్వాత కొన్నాళ్లకే అవి బోర్‌ కొట్టేయడం.. లేదా ఒకటి బాగుండి.. మరొకటి పాడవడం.. ఒకటి పోవడం వంటివి ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని పారేయడం మినహా మరే మార్గం లేదనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే.. ఈ సాక్సులను మరెన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..

వాడేసిన సాక్సులను చాలామంది బయట పడేస్తుంటారు. అయితే బాగున్న వాటిని వృథాగా పడేయాలంటే మనసొప్పదు. ఇలాంటప్పుడు వాటిని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తే ఇంటికీ ఉపయోగపడతాయి.

* పాత సాక్సులను ఒంటి నొప్పులు తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అవును.. సాక్సులతో కూల్ ప్యాక్, హాట్ ప్యాక్‌లను కూడా తయారుచేసుకోవచ్చు. సాక్సును బియ్యంతో నింపి దాని మూతిని కుట్టేయాలి. ఇప్పుడు కూల్ ప్యాక్ కోసం దీన్ని ఫ్రిజ్లో అరగంట పాటు ఉంచాలి. హాట్ ప్యాక్ కోసం నీళ్ల గ్లాసులో పెట్టిన ఈ సాక్సును ఒవెన్‌లో నిమిషం పాటు ఉంచి తీయాలి. ఆపై సాక్సును నొప్పి ఉన్న దగ్గర ఉంచడం ద్వారా ఉపశమనం పొందచ్చు.

* షూలను పాలిష్ చేయడానికి కూడా సాక్సులను ఉపయోగించవచ్చు. పాలిష్ రుద్దిన తర్వాత సాక్సుతో ఒకసారి రుద్దితే షూస్ తళతళా మెరిసిపోతాయి.

* ఇంటిని వీలున్నప్పుడల్లా తడిగుడ్డ పెట్టి తుడవడం చాలామందికి అలవాటు. ఫ్లోర్‌నైతే ఇలా శుభ్రం చేస్తారు. మరి, కిటీకీ అద్దాల పైన పడిన మరకలను తడిగుడ్డతోనే తుడుస్తారు కదూ.. దీనికి కూడా సాక్సును ఉపయోగించవచ్చు. ఒకవేళ కిటీకీ పైభాగం మీకు అందకపోయినా దీన్ని కర్రకు తగిలించి, తుడుచుకోవచ్చు.

* వస్తువులను జాగ్రత్తగా అటక మీద భద్రపర్చాలనుకుంటున్నారా? అయితే వాటిలో చిన్న చిన్న వస్తువులకు సాక్సులను తొడిగి పైన పెట్టండి. దుమ్ము పట్టకుండా సాక్సు వాటిని కాపాడుతుంది. అలాగే ఇల్లు మారేటప్పుడు గాజు సామాను మధ్యలో సాక్సులను ఉంచి ప్యాక్ చేయడం వల్ల అవి ఒకదానికి మరొకటి తగిలి పగలకుండా ఉంటాయి.

* పెంపుడు జంతువులకు చలికాలం సాక్సులు వేయడం వల్ల అవి చలి బారిన పడకుండా కాపాడవచ్చు.

* కారు అద్దం ఆటోమేటిక్‌గా శుభ్రమైపోవాలా? కారు అద్దానికి ఉండే విండ్ స్క్రీన్ వైపర్‌కి సాక్సును తగిలించండి. అంతే నిమిషాల్లో కారు శుభ్రం. అది చేరని కొన్ని మూలలు మాత్రం మీరు చేత్తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

* ఇంట్లో ఖరీదైన ఫ్లోర్ కుర్చీల వల్ల పాడవకుండా ఉండాలంటే.. కుర్చీల కాళ్లకు సాక్సులు తొడగండి. ఇలా చేయడం వల్ల ఛైర్స్ జరిపినప్పుడు ఫ్లోర్‌పై గీతలు పడకుండా ఉంటుంది.

* చిన్న చిన్న కుండీలను కవర్ చేయడానికి సాక్సులను ఉపయోగిస్తే ఎంతో అందంగా ఉంటుంది.

* ఒక సాక్సు తీసుకొని అందులో మార్బుల్స్ లేదా గోల్ఫ్ బాల్స్ వేసి మూతి కుట్టేయాలి. ఇప్పుడు దీన్ని నేల మీద ఉంచి, దానిపై పాదాన్ని పెట్టి అటూ ఇటూ కదపడం వల్ల అది ఒక ఫుట్ మసాజర్‌లా పని చేస్తుంది.

* సాక్సును ఒకవైపు కట్ చేసి ఫ్రిజ్ డోర్ హ్యాండిల్ చుట్టూ కుట్టడం వల్ల హ్యాండిల్‌కి మురికి అంటకుండా జాగ్రత్తపడచ్చు.

* చిన్న చిన్న వస్తువులను సాక్సుల్లో భద్రపర్చుకోవడం వల్ల అవి ఎక్కడో పడిపోతాయన్న కంగారుండదు.

* ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న సాక్సు కట్ చేసి అందులో గుండ్రని రాయి ఉంచి కుట్టేస్తే అందమైన పేపర్ వెయిట్ రడీ..

* సాక్సులతో పిల్లలకు రకరకాల బొమ్మలు తయారుచేసి ఇవ్వచ్చు. బొమ్మలకు దుస్తులు కూడా కుట్టచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్