Behishta Khairuddin: ఇంటినే ల్యాబుగా మార్చేసింది!
కఠినమైన ఆంక్షలు తన కలల్ని నిలువునా కాల్చేస్తున్నా ఆమె బెదరలేదు. ప్రభుత్వ నిబంధనలకి భయపడకుండా ఇంట్లోనే ఉంటూ.. ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది 26 ఏళ్ల బెహిస్తా ఖైరుద్దీన్..
కఠినమైన ఆంక్షలు తన కలల్ని నిలువునా కాల్చేస్తున్నా ఆమె బెదరలేదు. ప్రభుత్వ నిబంధనలకి భయపడకుండా ఇంట్లోనే ఉంటూ.. ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది 26 ఏళ్ల బెహిస్తా ఖైరుద్దీన్.. అఫ్గానిస్థాన్‌లాంటి కర్కశ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిందామె..
అమ్మ.. అక్కయ్యలు ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్లు. తను మాత్రం ఎందుకు చదువుకోకూడదు? అనుకుంది బెహిస్తా. కానీ ఆ కల నిజం కావడం అంత తేలిక్కాదని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తల్లి వైద్యురాలు, తండ్రి గ్రాడ్యుయేట్. ఇద్దరూ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నారు. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. తను ఐదో సంతానం. అఫ్గానిస్థాన్‌లోని జౌజ్జన్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసింది. భారత్‌లో ఎంటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేయాలన్నది కల. ఇందుకోసం కాబూల్ వెళ్లి అక్కడ టోఫెల్‌లో శిక్షణ తీసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. దాంతో భారతదేశంలోని ఏ యూనివర్సిటీ నుంచైనా మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా కోటి కలలతో ఇండియాకు సిద్ధమయ్యింది.
తాలిబన్ల గుప్పిట చిక్కి...
ఐఐటీ మద్రాస్‌లో తరగతులు మొదలయ్యాయి. మరోపక్క.. తాలిబన్ బలగాలు అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో ప్రావిన్స్‌ను ఆక్రమిస్తూ మొత్తం దేశాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. వేలాది మంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేసిందా దేశం. వీసాలూ చెల్లకుండాపోయాయి. ఐసీసీఆర్ స్కాలర్‌షిప్ కూడా రద్దైంది అని తెలిసి బెహిస్తాకి గుండె ఆగినట్టైంది. తనలా భారత్ వెళ్లాలనుకున్న మరో 650మంది విద్యార్థుల పరిస్థితీ ఇదే. దారులన్నీ మూసుకుపోయాయి. చివరి ప్రయత్నంగా ఐఐటీ మద్రాస్‌లో విదేశీ విద్యార్థుల వ్యవహారాలు చూసే గ్లోబల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి ఫోన్ చేసి తన దుస్థితిని వివరించింది. తన పరిస్థితి విని చలించిపోయిన ఐఐటీ మద్రాస్ ఆమె స్కాలర్‌షిప్‌ను తిరిగి ఇప్పించడంతో పాటు అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో కోర్సుచేసే అవకాశాన్ని ఇచ్చింది.
అవెన్‌లో కెమికల్స్ వేడిచేసి..
మద్రాస్ ఐఐటీ కనికరించినా అఫ్గాన్‌లో ఆన్‌లైన్ సేవలు సక్రమంగా ఉండేవి కావు. దాంతో పాఠాలు అర్థమయ్యేవికావు. అదే విషయం చెబితే ప్రొఫెసర్లు తమ తరగతుల వీడియో రికార్డింగ్‌లను పంపించేవారు. ఇలా రెండు సెమిస్టర్లు పూర్తయ్యాయి. మూడో సెమ్ నాటికి మరో చేదు వార్త. యూనివర్సిటీ విద్యకు యువతుల్ని నిరాకరిస్తూ తాలిబన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆడపిల్లలపై నిబంధనల్ని కఠినతరం చేసింది. దాంతో ఎన్జీవోల్లో పనిచేసే అక్కలూ ఉద్యోగాలు వదులుకోవాల్సి వచ్చింది.
బెహిస్తా మాత్రం చదువుని కొనసాగించినా ప్రాక్టికల్స్ విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తానేమో ‘ఎమల్షన్ ఫ్యూయల్స్’ను ప్రాజెక్టుగా తీసుకుంది. ఆ ప్రయోగాలన్నీ ల్యాబుల్లో చేయాలి. ఇంట్లో చేయాలంటే కనీస పరికరాలు అవసరమని ప్రొఫెసర్లు చెప్పారు. దాంతో తన ఇంటినే ల్యాబొరేటరీలా మార్చుకుంది. రసాయనాల్ని వేడి చేయడానికి తెలిసిన వాళ్ల అవెన్ తెచ్చుకుంది. పదార్థాల బరువు తూచడానికి నగల దుకాణం నుంచి యంత్రాన్ని అరువు తెచ్చుకుంది. ఇలా నానా కష్టాలుపడుతూ చివరి సెమ్‌లో 10కి 8.83 సీజీపీఏ గ్రేడ్ సాధించింది. ఈ జులైలో తన కోర్సు పూర్తికానుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ చదువుపట్ల నిబద్ధత కనబరుస్తూ ఆన్‌లైన్‌లో కోర్సు పూర్తి చేసినందుకు ఐఐటీ మద్రాస్ యజమాన్యం బెహిస్తాను పొగడ్తలతో ముంచెత్తింది.
‘ఐఐటీ మద్రాస్‌లోనే మా అక్క పీహెచ్‌డీ చేసేది. కొవిడ్ సమయంలో మా దేశానికి వచ్చి తిరిగి వెళ్లలేకపోయింది. అలా తన పీహెచ్‌డీ ఆగింది. ఇప్పుడు నాకు చాలా సంస్థల ఆఫర్లు వస్తున్నాయి. నేను భారత్‌లో ఉండుంటే మంచి ఉద్యోగం వచ్చేది. కానీ మా దేశంలోనే పనిచేసి విద్యావ్యవస్థలో మార్పులు తేవాలనుకుంటున్నా’ అంటోంది బెహిస్తా ఖైరుద్దీన్.
- హిదాయతుల్లాహ్.బి, చెన్నై
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.