Published : 10/08/2022 20:18 IST

Payal Kothari: సెలబ్రిటీలకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది!

అవసరంలో నుంచి ఆలోచన పుడుతుందంటారు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రతికూల పరిస్థితులే ఆ అవసరాన్ని సృష్టిస్తాయి.. మన జీవిత లక్ష్యమేంటో మనకు తెలియజేస్తాయి. ఈ మాటలు సెలబ్రిటీ గట్‌ హెల్త్‌ కోచ్‌ పాయల్‌ కొఠారీకి అతికినట్లు సరిపోతాయి. చిన్న వయసు నుంచే పలు అనారోగ్యాల్ని ఎదుర్కొన్న ఆమె.. ఒకానొక దశలో జీవన్మరణ పోరాటం చేసింది. సమాజం నుంచీ ఎన్నో సూటిపోటి మాటలు భరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్యలే తన కెరీర్‌ని నిర్ణయిస్తాయని అప్పుడనుకోలేదామె. ఆ తర్వాత రియలైజ్‌ అయిన పాయల్‌ తన ఆరోగ్య సమస్య మూలాలెక్కడున్నాయో తెలుసుకొని.. దానిపై దృష్టి సారించింది. ఈ ప్రయత్నంలో తాను విజయం సాధించడమే కాదు.. అటు సెలబ్రిటీలకు, ఇటు సామాన్యులకు ఆరోగ్య పాఠాలూ చెబుతోంది. ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందం’టోన్న పాయల్‌ తన అనారోగ్యాల్ని ఎలా ఎదుర్కొందో, తన అనుభవాలనే వృత్తిగా మలచుకుని సెలబ్రిటీ కోచ్ గా ఎలా రాణిస్తోందో తెలుసుకుందాం రండి..

ఏ ఆరోగ్య సమస్యైనా జీర్ణ వ్యవస్థ నుంచే ప్రారంభమవుతుందని చెబుతుంటారు వైద్యులు. అంటే.. మనం తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉందని స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానంటోంది పాయల్‌ కొఠారీ. కోల్‌కతాలో పుట్టిన ఆమె.. ముంబయిలో పెరిగింది. రెండేళ్ల ప్రాయంలో ట్యూబర్‌క్యులోలిస్‌ (టీబీ) బారిన పడిన పాయల్‌.. సుమారు 9 నెలల పాటు మందులు వాడాల్సి వచ్చింది. సమస్య నుంచైతే బయటపడగలిగింది కానీ.. ఈ మందుల ప్రభావంతో జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని ‘లీకీ గట్‌ సిండ్రోమ్‌’ బారిన పడిందామె. ఈ పరిస్థితి ఆమెలో పోషకాహార లోపానికి దారితీసి.. తాను మరింత సన్నబడేలా చేసింది.

సూటిపోటి మాటలనేవారు!

పసి వయసులోనే పెద్ద గండం నుంచి బయటపడ్డ పాయల్‌.. టీనేజ్‌లో డిప్రెషన్‌ సమస్యను ఎదుర్కొంది. దీంతో అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు బానిసైంది. ఇది క్రమంగా అధిక బరువుకు దారితీసిందంటోందామె. ‘దెబ్బ మీద దెబ్బ పడినట్లు.. టీబీ నుంచి పూర్తిగా కోలుకొని కొన్నేళ్లు ప్రశాంతంగా ఉన్నానో లేదో.. మళ్లీ డిప్రెషన్‌ సమస్య ఎదురైంది. ఫలితంగా అనారోగ్యకరమైన జీవనశైలికి బానిసయ్యా. ఇది నా బరువును రెట్టింపు చేసింది. అప్పటిదాకా 30 కిలోలున్న నేను.. ఒక్కసారిగా 60 కిలోలకు చేరుకున్నా. ఇలా బొద్దుగా మారిన నన్ను చూసి చాలామంది హేళన చేసేవారు. స్కూల్లో తోటి పిల్లలైతే ‘బఫెలో’ అని పిలిచేవారు. ఇది నన్ను విపరీతంగా బాధించేది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే నేను.. ఈ సమస్య కారణంగా 9వ తరగతిలోనూ ఫెయిలయ్యా. అప్పుడు అమ్మే నాకు మద్దతుగా నిలిచింది. ‘ఎవరేమన్నా పట్టించుకోకు.. నీకు నచ్చిన దారిలో వెళ్లు!’ అని వెన్నుతట్టింది. దాంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

అన్నింటికీ అదే మూలమని తెలుసుకొని..!

ఒత్తిడి, ఆందోళనలోకి కూరుకుపోయిన పాయల్‌ని తన తల్లి ఓసారి నిపుణుల వద్దకు తీసుకెళ్లింది. అక్కడే మన శారీరక, మానసిక ఆరోగ్యం జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉందని తెలుసుకుందామె. ఆపై ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలు, పత్రికలు చదివి మరిన్ని విషయాలు తెలుసుకుంది. అంతేకాదు.. తన తల్లి సహకారంతో ఆరోగ్యకరమైన జీవనశైలినీ అలవాటు చేసుకున్నానంటోందామె.

‘డాక్టర్‌ని కలిశాక ఆరోగ్యం గురించి ఓ చిన్నపాటి పరిశోధనే చేశా. ఏ అనారోగ్యమైనా జీర్ణ వ్యవస్థ నుంచే ప్రారంభమవుతుందని తెలుసుకున్న నేను.. నా మనసును, ఆలోచనల్ని మార్చుకున్నా. బరువు తగ్గడం పైనే పూర్తి దృష్టి పెట్టా. ఈ క్రమంలో ఉదయాన్నే నిమ్మరసం, అల్లం వేసి మరిగించిన నీళ్లు తాగేదాన్ని. కిచిడీ, నెయ్యి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి కోరు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు.. వంటి వాటికి ప్రాధాన్యమిచ్చా. వీటితో పాటు రోజూ గంట సేపు పరిగెత్తడం అలవాటు చేసుకున్నా. ఇవన్నీ డిప్రెషన్‌ని దూరం చేసి నా ఆరోగ్యాన్ని పెంపొందించడంలో దోహదం చేశాయి..’ అంటోంది పాయల్‌.

వాళ్ల ప్రశ్నలతో వచ్చిన ఆలోచన ఇది!

స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణతో తిరిగి తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకున్న పాయల్‌.. తనలాగే బాధపడే మరెంతోమందిలో స్ఫూర్తి నింపాలనుకుంది. ఈ ఉద్దేశంతోనే అమెరికాలో క్లినికల్‌ న్యూట్రిషన్‌ విభాగంలో కోర్సులు పూర్తి చేసింది. ఆ లోపే వివాహం కావడంతో తన భర్త ఉద్యోగ రీత్యా హాంగ్‌కాంగ్‌లోనే 15 ఏళ్ల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయాన్ని తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనలోనే గడిపేసిందామె. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన పాయల్‌ను చూసి అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు.
‘ఇండియాకు తిరిగొచ్చాక అందరూ ‘నువ్వు ఇంత ఫిట్‌గా, అందంగా ఎలా మారావ్‌? నీ డైట్‌ సీక్రెట్‌ మాతో చెప్పొచ్చుగా?!’ అని అడిగేవారు. ఇలా వాళ్ల సందేహాలు తీర్చే క్రమంలోనే- జీర్ణ వ్యవస్థ పని తీరు, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి సరైన అవగాహన కలిగించడం కోసం ‘గట్‌ కోచ్‌’గా మారితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. 2016 నుంచి ఆ ప్రయాణం ప్రారంభమైంది. ఏదైనా కొత్త విషయం/ఉత్పత్తి గురించి ఇతరులకు చెప్పే ముందు నేను ప్రయత్నించి పరీక్షించడం నాకు అలవాటు. ఇతరులకు సలహాలిచ్చే క్రమంలోనూ ఇదే పద్ధతిని పాటిస్తున్నా..’ అంటోంది పాయల్‌.

సెలబ్రిటీల గురువు!

ప్రస్తుతం లక్షల మందికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం గురించిన సలహాలు అందిస్తోన్న పాయల్‌ క్లైంట్స్‌ జాబితాలో షమితా శెట్టి, నియా శర్మ, అమితాబ్‌ బచ్చన్‌.. వంటి తారలెందరో ఉన్నారు. అంతేకాదు.. మరోవైపు స్కూళ్లు, లేడీస్‌ క్లబ్స్‌, వివిధ స్వచ్ఛంద సంస్థల్లోనూ ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోందామె. ఇక గతేడాది నుంచి ‘ఆన్‌లైన్‌ న్యూట్రిషన్‌ స్కూల్‌’ ప్రారంభించి.. ఈ వేదికగానూ ఆరోగ్య పాఠాలు బోధిస్తోందామె. తన గత అనుభవాలు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం పాటించే చిట్కాల్ని రంగరించి ‘ది గట్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది పాయల్‌.

‘ఆహారం విషయంలో కొన్నిసార్లు మనకు తెలిసే పొరపాటు చేస్తుంటాం. ఫలానా ఆహారం ఆరోగ్యకరం కాదు అని తెలిసినా తీసుకుంటాం. అయితే అది మన శరీరానికి పడుతుందా, లేదా అన్నది పలు దుష్ప్రభావాలను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో, చేతల్లోనే ఉంది.. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో ఆరోగ్య స్పృహ పెంచుతోందీ సెలబ్రిటీ కోచ్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని