‘మోడలింగ్‌కు నువ్వేం పనికొస్తావ్’ అన్నారు!
‘నల్లగా ఉన్నావ్.. మోడలింగ్‌కు నువ్వేం పనికొస్తావ్?’ అన్నారు అందరూ ఆమెను చూసి! గిరిజన బాలిక అంటూ చిన్న చూపు చూసేవారు. అయినా వాళ్ల మాటలు పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుందామె. ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో ఆ కోర్సులో చేరింది. పెళ్లై, పిల్లలు పుట్టినా తన తపనను.....
(Photos: Instagram)
‘నల్లగా ఉన్నావ్.. మోడలింగ్‌కు నువ్వేం పనికొస్తావ్?’ అన్నారు అందరూ ఆమెను చూసి! గిరిజన బాలిక అంటూ చిన్న చూపు చూసేవారు. అయినా వాళ్ల మాటలు పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుందామె. ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో ఆ కోర్సులో చేరింది. పెళ్లై, పిల్లలు పుట్టినా తన తపనను కొనసాగించింది. అంతెందుకు.. నెలల చిన్నారితో ఓ ఫ్యాషన్ పరేడ్‌లో మోడల్‌గా ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలా చంటిబిడ్డను ఎత్తుకొని క్యాట్‌వాక్ చేసిన తొలి భారతీయ మోడల్‌గానూ నిలిచింది.. ఆమే రాంచీకి చెందిన అలీషా గౌతమ్ ఒరాన్. అయితే తన బిడ్డతో కలిసి తాను చేసిన క్యాట్వాక్ తాలూకు ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుందామె. దీంతో ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక మోడల్‌గానే కాకుండా.. క్రీడాకారిణిగా, పాకశాస్త్ర నిపుణురాలిగా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తోన్న అలీషా కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!
జార్ఖండ్ రాంచీలోని ఓ గిరిజన తెగకు చెందిన మహిళ అలీషా. ఆమెకు తన తెగ సంస్కృతీ సంప్రదాయాలన్నా, ఆచార వ్యవహారాలన్నా ఎంతో మక్కువ! కానీ చిన్నతనంలో వాటిని ప్రదర్శించే క్రమంలో, తన తెగ గురించి నలుగురితో చెప్పే క్రమంలో సమాజం నుంచి తీవ్ర వివక్ష ఎదుర్కొందామె.
స్కూల్లో చిన్నచూపు చూసేవారు!
‘స్కూల్లో నా తోటి విద్యార్థులు నన్ను దూరం పెట్టేవారు. ఎవరూ నాతో స్నేహం చేసేవారు కాదు. ఎందుకంటే నా చర్మ ఛాయ నలుపు, నేను గిరిజన తెగకు చెందిన అమ్మాయినని అంటరానిదానిగా చూసేవారు. పైగా నేను గిరిజనురాలినని బయట చెప్పొద్దని.. చెప్తే పలు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించేవారు. కానీ వాళ్ల మాటలు నాకు నచ్చలేదు. అయినా మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కులాలు/మతాలు/తెగలు ముఖ్యం కాదు.. ప్రతిభ ఉండాలి అనుకునేదాన్ని. చిన్నతనం నుంచీ నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఆ మక్కువతోనే గాంధీనగర్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశా. అక్కడ నాకు చాలామంది స్నేహితులయ్యారు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అమెరికన్ మోడల్ నవోమీ క్యాంప్‌బెల్‌లా ఉంటావనేవారు. అలా అన్నప్పుడల్లా నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేది. అప్పటిదాకా నేనూ.. తెల్లగా, అందంగా ఉండే వారే మోడల్స్ కావడానికి అర్హులేమో అనుకునేదాన్ని.. కానీ నిఫ్ట్‌లో చేరాక మోడలింగ్ పైనా మరింత అవగాహన పెరిగింది. ఆ తర్వాత పలు మోడలింగ్ అవకాశాల్నీ అందుకున్నా..’ అంది అలీషా.
‘ముఖంలో కళే లేద’న్నారు!
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన వెంటనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అలీషా.. ఆపైనా తన తపనను కొనసాగించింది. ఇద్దరు పిల్లల తల్లిగానూ ఎన్నో మోడలింగ్ అవకాశాల్ని అందుకుందామె.
‘ట్రైబల్ ఫ్యాషన్ షోలలో పాల్గొనడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతుంటా. అలా ఓసారి మిసెస్ బాహా పోటీలో పాల్గొన్నా. అందులో తొలి రన్నరప్‌గా నిలిచా. అయితే చాలామంది నా ప్రతిభను గుర్తించకుండా.. నా బాహ్య సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నానా మాటలూ అన్నారు. ‘నల్లగా ఉంది.. చూడ్డానికి అసలేం బాలేదు.. ఆ ముఖంలో కళే లేదు.. అలాంటిది ఈ అమ్మాయి ఎలా రన్నరప్‌గా నిలిచింది?’ అంటూ హేళన చేశారు. కానీ అలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే ముందుకు సాగలేననుకున్నా.. అందుకే వాటన్నింటినీ పక్కన పెట్టి మోడలింగ్ పైనే నా పూర్తి దృష్టి పెట్టాను. ఇక మరోసారి నా పది నెలల పాపను ఎత్తుకొని ర్యాంప్‌పై నడిచా. ఇలా పాపాయిని ఎత్తుకొని క్యాట్‌వాక్ చేసిన తొలి భారతీయ మోడల్‌గా నిలిచా. ఈ క్రమంలో మా గిరిజన తెగకు సంబంధించిన కట్టూ-బొట్టు, ఆభరణాల్నే ధరించా. పైగా మేకప్, హీల్స్.. వంటివి వేసుకోకుండానే ర్యాంప్ వాక్ చేశా. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఫ్యాషన్ షో వీడియో అప్పట్లో తెగ వైరలైంది. చాలామంది నా అంకితభావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు..’ అంటూ చెప్పుకొచ్చిందీ మోడల్ మామ్.
ఆ రుచుల్ని పరిచయం చేస్తూ..!
ప్రస్తుతం మోడలింగ్ వృత్తిలో కొనసాగుతోన్న అలీషా.. మరోవైపు తనలోని పాకశాస్త్ర నైపుణ్యాల్నీ చాటుకుంటోంది. జార్ఖండ్ రాష్ట్ర సంప్రదాయ వంటకాలు, తన గిరిజన తెగకు చెందిన వెరైటీ వంటకాల్ని తయారుచేస్తూ.. వాటిని వీడియో తీసి ‘Tamyra's Kitchen’ పేరుతో నిర్వహిస్తోన్న ఇన్‌స్టా పేజీలో అప్‌లోడ్ చేస్తోంది. ఇక ఆటలన్నా అలీషాకు చాలా ఇష్టమట. స్కూల్లో చదువుకునేటప్పుడు వాలీబాల్, ఫుట్‌బాల్.. వంటి ఆటలాడిన ఆమె.. జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లోనూ పాల్గొంది. ‘కులం, మతం, తెగ, కుటుంబ నేపథ్యం, చర్మ ఛాయ, అందం, గుణగణాలు.. ప్రతిభకు ఇవేవీ కొలమానం కావు. మోడలింగ్ రంగంలో ఇప్పటికే చాలామంది మహిళలు ఈ విషయం నిరూపించారు. అలాగే పెళ్లి, పిల్లలు మన కెరీర్‌కు అడ్డు కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా, ఏ దశలోనైనా రాణించచ్చు..’ అంటూ తన మాటలతోనూ నేటి తరం మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది అలీషా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.