Nara Brahmani Bike Riding: సవాళ్లను ఎదుర్కొంటేనే రాణిస్తాం!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునేవారు చాలా అరుదుగా ఉంటారు.. కుటుంబ నేపథ్యం, పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటారు.. ఎంత పాపులారిటీ ఉన్నా.. పబ్లిసిటీకి దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. హెరిటేజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఇందుకు....

Updated : 03 Dec 2022 18:03 IST

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనుకునేవారు చాలా అరుదుగా ఉంటారు.. కుటుంబ నేపథ్యం, పేరు ప్రఖ్యాతులతో పని లేకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటారు.. ఎంత పాపులారిటీ ఉన్నా.. పబ్లిసిటీకి దూరంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. హెరిటేజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఇందుకు మినహాయింపు కాదు. ఓ వ్యాపారవేత్తగా, గృహిణిగా, అమ్మగానే.. ఆమె మనందరికీ సుపరిచితం! కానీ తనలో అంతకుమించిన నైపుణ్యాలున్నాయని, తాను తలచుకుంటే సాహసాలూ చేయగలనని ఇటీవలే నిరూపించిందామె. లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేసి.. బైక్‌ రైడింగ్‌, ప్రయాణాలపై తనకున్న మక్కువను చాటుకుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిజినెస్‌ లేడీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

అదో ఆధ్యాత్మిక అనుభూతి!

టాలీవుడ్‌ లెజెండ్‌ బాలకృష్ణ కూతురిగా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలిగా, ఇలా ఉన్నత స్థాయి కుటుంబ నేపథ్యం ఉన్నా.. నిరాడంబరంగా ఉండడానికే ఆసక్తి చూపుతుంది నారా బ్రాహ్మణి. ఓవైపు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సంస్థను ముందుకు నడిపిస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతల్నీ సమర్థంగా నిర్వర్తిస్తోంది.. అమ్మతనాన్నీ ఆస్వాదిస్తోంది. ఇలా తానెంత బిజీగా ఉన్నా సరే.. తన అభిరుచులకూ ప్రాధాన్యమిస్తుంటుంది బ్రాహ్మణి. ఈ విషయాన్నీ ఇటీవలే నిరూపించిందామె. యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలు సభ్యులుగా ఉన్న యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ) ఇటీవల ‘ది లద్దాఖ్‌ క్వెస్ట్‌’ పేరుతో నిర్వహించిన ఓ సాహస యాత్రలో పాల్గొంది బ్రాహ్మణి. ఈ క్రమంలో లద్దాఖ్‌లోని పర్వత సానువుల్లో బైక్‌పై రయ్‌మంటూ దూసుకుపోయింది. ఈ యాత్రలో పాల్గొన్న వారు తమ అనుభవాల్ని ‘జావా యజ్డీ మోటార్‌ సైకిల్స్‌’ పేరుతో రూపొందించిన ఓ లఘుచిత్రంలో పంచుకున్నారు.

‘లద్దాఖ్‌ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేం థక్‌సే ఆరామానికి బయల్దేరుతున్నాం.. అసలు సిసలైన ఆధ్యాత్మిక అనుభవం కోసం మేం ఎదురు చూస్తున్నాం.. అక్కడ ధ్యానం చేస్తాం..’ అంటూ తన అనుభవాలను ఆ వీడియోలో గుదిగుచ్చిందీ బిజినెస్‌ ఉమన్‌. ప్రస్తుతం ఈ వీడియో, ఆ బృందం బైక్‌ రైడింగ్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బ్రాహ్మణిలో దాగున్న బైక్‌ రైడింగ్‌ నైపుణ్యాల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.


బిజినెస్‌ ఉమన్‌.. వక్త!

⚜ ‘స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ నుంచి ఎంబీఏ డిగ్రీ పూర్తిచేసిన బ్రాహ్మణి.. ఈ క్రమంలో అక్కడి మార్కెటింగ్‌, ఫార్మ్‌ క్లబ్స్‌.. వంటి నాయకత్వ బృందాల్లో కీలక పాత్ర పోషించింది.

⚜ చదువు పూర్తయ్యాక పలు సంస్థల్లో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతోంది. సంస్థ అభివృద్ధిలో భాగంగా విలీనాలు, కొనుగోళ్లు, వ్యాపార అభివృద్ధి, మార్కెటింగ్‌ కార్యకలాపాలపై ఆమె ఎక్కువగా దృష్టి సారించింది.

⚜ వేల కోట్ల ఆదాయంతో దూసుకుపోతోన్న తమ సంస్థను.. ఆరోగ్యకరమైన, తాజా ఉత్పత్తుల విభాగంలో జాతీయంగా గుర్తింపు పొందే సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుందామె.

⚜ ఇలా వ్యాపారంలోనే కాదు.. సమాజ సేవ చేయడంలోనూ ముందుంటుంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్’ వేదికగా ఆరోగ్యం, విద్య, యువత సాధికారత, విపత్తు నిర్వహణ.. వంటి అంశాలపై దృష్టి సారించింది. తద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా తన ప్రయత్నాలు సాగిస్తోంది.

⚜ ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ స్పీకర్‌గా ఉన్న బ్రాహ్మణి మంచి వక్త కూడా! దేశ, విదేశాల్లో జరిగే పలు సదస్సులు, కార్యక్రమాల్లో ప్రసంగిస్తుంటుందామె. తన స్ఫూర్తిదాయక మాటలతో ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల్లో స్ఫూర్తి నింపుతుంటుంది.

⚜ ప్రస్తుతం ‘యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ ఛాప్టర్’ సంస్థలో ఆమె సభ్యురాలు.

⚜ బ్రాహ్మణికి ప్రయాణాలన్నా ఎంతో మక్కువ. ఈ క్రమంలో లద్దాఖ్‌ యాత్ర వంటి సాహసాలే కాదు.. తన కుటుంబం, కొడుకు దేవాన్ష్‌తో కలిసి వివిధ పర్యటక ప్రదేశాల్నీ సందర్శిస్తుంటుంది. ఇక అక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని తెలుసుకోకుండా, అక్కడి ప్రత్యేక వంటకాల్ని రుచి చూడకుండా వెనుదిరగనంటోంది.


వ్యాపారంలో అవే కీలకం!

‘ఎవరూ వ్యాపారవేత్తలుగా జన్మించరు. తపన, సవాళ్లను ఎదుర్కొనే నైజమే ఈ రంగంలో మనం రాణించేలా చేస్తుంది. ఇక వృత్తిఉద్యోగాల్ని, ఇంటిని బ్యాలన్స్‌ చేయడం ఓ సవాలే! అయితే ఈ క్రమంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం ఏ విషయంలోనూ సంపూర్ణత సాధించలేం. నేనూ కొన్నిసార్లు నా కొడుకును, కుటుంబాన్ని మిస్సవుతున్నందుకు బాధపడతా.. గిల్టీగా ఫీలవుతా. మహిళలకే కాదు.. పురుషులకూ వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ ఓ సవాలే! కాకపోతే.. పనులకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే వెనకడుగు వేయాల్సిన పరిస్థితి రాదు..’ అంటూ తన మాటలతోనూ ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలో స్ఫూర్తి నింపుతోంది బ్రాహ్మణి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్