Updated : 06/01/2022 17:17 IST

ఆమె స్ఫూర్తితోనే ఈ అందాల కిరీటం గెలిచా!

(Photo: Instagram)

జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. మన మనసులోని తపనేంటో తెలుసుకుంటాం.. అలా తనకూ ఓ మార్గదర్శి ఉందంటోంది తాజాగా ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా’ కిరీటం గెలిచిన 16 ఏళ్ల మన్నత్‌ సివాచ్‌. 2017లో ‘ప్రపంచ సుందరి’గా అవతరించిన మానుషీ ఛిల్లర్‌ని చూశాకే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన కలిగిందంటోంది.  మనపై మనకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదంటోన్న ఈ జైపూర్‌ చిన్నది తన బ్యూటీ జర్నీ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

మన్నత్‌ సివాచ్‌.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో పుట్టింది. ఆమె తండ్రి సందీప్‌ సివాచ్‌.. మాజీ ఆర్మీ ఆఫీసర్‌. సైనిక కుటుంబంలో పుట్టి పెరిగిన మన్నత్‌.. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, చేసే పనిపై శ్రద్ధ-పట్టుదల.. వంటి సద్గుణాలను పుణికిపుచ్చుకుంది. ప్రస్తుతం అక్కడి జయశ్రీ పరివాల్‌ హైస్కూల్‌లో కామర్స్‌-మ్యాథ్స్‌ విభాగంలో 11వ తరగతి చదువుతోన్న ఆమె.. చదువులోనూ చురుకే. అందుకే చుట్టూ ఉన్న వాళ్లంతా ఆమెను ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’ అని పిలుస్తుంటారట!

అది నా రెండో ఇల్లు!

చిన్న వయసు నుంచే మోడల్‌ కావాలన్న మక్కువను తన మనసులో నింపుకొన్న మన్నత్‌కు ఇటు ఇంట్లోను, అటు స్కూల్‌ నుంచి చక్కటి ప్రోత్సాహం అందింది. అందుకే తాను ఇంటిని ఎంతగా ఇష్టపడతానో.. స్కూల్‌నూ తన కుటుంబంలాగే భావిస్తానని చెబుతోంది మన్నత్.

‘గ్లామర్‌ ప్రపంచమంటే నాకు చిన్నప్పట్నుంచీ ఎంతో ఆసక్తి. అయితే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన మాత్రం మానుషిని చూశాకే వచ్చింది. 2017లో ప్రపంచ సుందరిగా అవతరించిన ఆమెను చూసి.. నేనూ ఇలా దేశం గర్వపడేలా చేయాలని బలంగా అనుకున్నా. ఇందుకు అమ్మానాన్నలతో పాటు మా స్కూల్ టీచర్లు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. ఇదనే కాదు.. స్కూల్లో చేరినప్పట్నుంచి ఆసక్తి ఉన్న అంశాల్లో ఎంతో మద్దతుగా నిలిచారు. అందుకే స్కూల్‌ని నా రెండో ఇల్లుగా భావిస్తా..’ అంటోందీ అందాల తార.

తపనేంటో తెలిశాక..!

మానుషిని చూసి అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్న మన్నత్‌.. ఆ తర్వాత ఏడాది కాలంగా ఈ పోటీల కోసమే సిద్ధమయ్యానని చెబుతోంది. ‘అనుకున్న పనిలో విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల, సాధన.. ఈ మూడూ ఉండాలి. ఇక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పలకరించే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. నా బ్యూటీ జర్నీలో నేను నేర్చుకున్న పాఠాలివే! ఏడాది కాలంగా గంటల కొద్దీ నేను చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఈ ఆత్మవిశ్వాసంతోనే ఈ ఏడాది జరగబోయే మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో పాల్గొనబోతున్నా..’ అంటూ తన విజయ రహస్యాలను బయటపెట్టిందీ టీన్‌ బ్యూటీ.

ఆ నమ్మకమే ముఖ్యం!

* అటు చదువులో రాణిస్తూ అంతర్‌ పాఠశాల పోటీల్లో పలు బహుమతులు గెలుచుకున్న ఈ అందాల రాశి.. బాస్కెట్‌ బాల్, బ్యాడ్మింటన్‌.. వంటి క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. ఇందుకు ప్రతిగా జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పలు బహుమతులు కూడా అందుకుంది మన్నత్.

* ‘ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రత్యేకతలు, బలాలు ఉంటాయి. వాటిని నమ్మినప్పుడు ఈ ప్రపంచంలో మనకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.. నా విజయ సూత్రం కూడా ఇదే!’ అని చెబుతోంది మన్నత్.

* ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది.. ఆ ట్యాలెంట్‌ని పంచుకోవడానికే కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తన స్నేహితుల సహకారంతో ‘Junoon’ పేరుతో ఇన్‌స్టా పేజీని ప్రారంభించిందీ జైపూర్‌ చిన్నది. నలుగురి ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇదో చిన్న ప్రయత్నమని చెబుతోంది.

* సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని పరితపించే ఈ టీన్‌ బ్యూటీ.. పిల్లలపై జరిగే హింసకు తానెప్పుడూ వ్యతిరేకినేనని.. భవిష్యత్తులో ఇలాంటి హింసకు వ్యతిరేకంగా పనిచేయాలని ఉందంటూ తన మనసులోని మాటను ఓ సందర్భంలో పంచుకుంది.

ఇక ఈ పోటీల్లో బెంగళూరుకు చెందిన బృందా ఎర్రబలి ‘మిస్‌ టీన్‌ యూనివర్స్‌ ఇండియా’, గురుగ్రామ్‌కు చెందిన రబియా హోరా ‘మిస్‌ టీన్‌ ఎర్త్‌ ఇండియా’, కోల్‌కతా అమ్మాయి బహికా బియానీ ‘మిస్‌ టీన్‌ మల్టీనేషనల్‌ ఇండియా’.. కిరీటాలు అందుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని