Pregnancy Tips: అవే ఇప్పుడు నన్ను ఫిట్‌గా ఉంచుతున్నాయి!

కాబోయే అమ్మలు తమ కడుపులో పెరుగుతున్న బుజ్జాయి కోసం తీసుకోని జాగ్రత్తంటూ ఉండదు. తినే ఆహారం, చేసే వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. తానూ ప్రస్తుతం అదే పనిలో ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. మరో మూడు నెలల్లో తన కలల పంటకు జన్మనివ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ....

Published : 02 Mar 2022 21:29 IST

కాబోయే అమ్మలు తమ కడుపులో పెరుగుతున్న బుజ్జాయి కోసం తీసుకోని జాగ్రత్తంటూ ఉండదు. తినే ఆహారం, చేసే వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. తానూ ప్రస్తుతం అదే పనిలో ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. మరో మూడు నెలల్లో తన కలల పంటకు జన్మనివ్వబోతోన్న ఈ ముద్దుగుమ్మ.. గర్భిణిగా తాను పాటిస్తోన్న చిట్కాలన్నీ కాబోయే అమ్మలతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన వర్కవుట్‌ రొటీన్‌ వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ చందమామ. దీంతో పాటు గర్భిణులు వ్యాయామాలు చేయడం ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చింది.

గర్భిణిగా ఉన్న సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే వీటన్నింటినీ అధిగమించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే అందులో వ్యాయామం పాత్ర కీలకమంటోంది కాజల్‌. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను చేస్తోన్న వర్కవుట్ల గురించి పంచుకుందీ బ్యూటీ.

రోజూ ఈ వ్యాయామాలు చేస్తా!

నిపుణుల సమక్షంలో విభిన్న వ్యాయామాలు చేస్తూ రూపొందించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ చక్కనమ్మ.. ‘నేను ముందు నుంచీ చాలా చురుగ్గా ఉంటాను. ఏదేమైనా రోజూ వ్యాయామాలు చేయడం మాత్రం మానను. అయితే ప్రెగ్నెన్సీ ఇందుకు భిన్నం. ఈ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేని గర్భిణులు రోజూ తమ వర్కవుట్‌ రొటీన్‌ని కొనసాగించచ్చు. ముఖ్యంగా ఏరోబిక్స్‌, చిన్న చిన్న బరువులెత్తే వ్యాయామాలు, స్క్వాట్స్‌, పిలాటిస్‌.. వంటివి ఈ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తాయి. నా విషయంలోనైతే పిలాటిస్‌, బ్యారే వ్యాయామాలు నన్ను దృఢంగా, బలంగా, నాజూగ్గా ఉంచుతున్నాయి. ముందు నుంచీ ఇవి చేయడం నాకు అలవాటు. అయితే ఈ సమయంలో మనం చేసే వ్యాయామాలు గరిష్ట ఫిట్‌నెస్‌ స్థాయుల్ని చేరుకోవాలన్న లక్ష్యంతో కాకుండా.. శరీరానికి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం..’ అంటోంది కాజల్‌. అంతేకాదు.. గర్భిణులు తమ డాక్టర్‌ సూచనల మేరకు, ఫిట్‌నెస్‌ నిపుణుల సమక్షంలో మాత్రమే వ్యాయామాలు సాధన చేయాలంటూ తన వీడియోతో చెప్పకనే చెప్పిందీ టాలీవుడ్‌ అందం.

మెరుపుకి కారణమదే!

* ఇక గర్భం ధరించినప్పట్నుంచి ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తోంది కాజల్‌. తన బేబీ బంప్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మురిసిపోతోంది. ఇటీవలే సీమంతం వేడుకను ఘనంగా జరుపుకొన్న ఈ ముద్దుగుమ్మ మోములో ప్రెగ్నెన్సీ కళ ఉట్టిపడుతోంది. అయితే గర్భిణిగా ఉన్న సమయంలో ఎలాంటి మానసిక సంఘర్షణలకు తావివ్వకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే ఈ మెరుపుకి కారణమంటూ తన లుక్స్‌తో చెప్పకనే చెబుతోందీ చందమామ.

* మరోవైపు గర్భిణిగా తన ఆహారపు కోరికల గురించి కూడా పలు ఇన్‌స్టా పోస్టుల రూపంలో వెల్లడిస్తోంది కాజల్‌. ఈ నేపథ్యంలోనే.. ‘బక్లావా, కప్‌ కేక్స్‌, croquembouche (ఇదొక ఫ్రెంచ్‌ వంటకం)..’ వంటి వంటకాలను ముందు పెట్టుకొని.. తన ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చిందీ క్యూటీ.

* గర్భిణిగా కాస్త బరువు పెరిగిన ఈ అందాల తార.. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలకు కూడా ఘాటుగానే సమాధానమిస్తోంది. అమ్మయ్యే క్రమంలో ఇలాంటి శారీరక మార్పులన్నీ సహజమేనని, అయితే ఇతరుల మాటలు పట్టించుకోకుండా తమను తాము అంగీకరించినప్పుడే ప్రెగ్నెన్సీని పూర్తిగా ఆస్వాదించగలమని చెబుతోందీ కాబోయే అమ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్