అప్పుడు రెండుసార్లు ఐవీఎఫ్ విఫలమైంది.. ఆ బాధను తట్టుకోలేకపోయా!

ఐవీఎఫ్‌.. ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానంతో సంతానం లేని జంటలకు వరంగా మారిందీ సంతాన చికిత్స. అయితే దీంతో సక్సెస్‌ రేటు అధికంగానే ఉన్నప్పటికీ.. కొంతమంది మహిళల్లో చికిత్స చేసే క్రమంలో వరుస వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కెరీర్‌ ధ్యాసలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, వివిధ కారణాల....

Updated : 10 Mar 2023 17:18 IST

(Photos: Instagram)

ఐవీఎఫ్‌.. ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానంతో సంతానం లేని జంటలకు వరంగా మారిందీ సంతాన చికిత్స. అయితే దీంతో సక్సెస్‌ రేటు అధికంగానే ఉన్నప్పటికీ.. కొంతమంది మహిళల్లో చికిత్స చేసే క్రమంలో వరుస వైఫల్యాలు ఎదురవుతుంటాయి. కెరీర్‌ ధ్యాసలో పడి ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, వివిధ కారణాల రీత్యా ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం, మహిళల వయసు పెరిగిపోవడం, అండాల సంఖ్య-నాణ్యత తగ్గిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలంటున్నారు నిపుణులు. అయితే తన విషయంలోనూ రెండుసార్లు ఈ చేదు అనుభవం ఎదురైందంటోంది ప్రముఖ వ్యాపారవేత్త నమితా థాపర్‌. ప్రస్తుతం ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె.. ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ బిజినెస్‌ రియాల్టీ షో జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఈ వేదికగానే ఐవీఎఫ్‌ విషయంలో తన జీవితంలో తనకెదురైన చేదు అనుభవాల్ని పంచుకుంది నమిత.

దేనికైనా ఓ సమయం, సందర్భం రావాలంటారు.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి పంచుకోవడానికి తగిన సందర్భం ఇప్పుడు వచ్చిందంటోంది నమిత. ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ సీజన్‌-2లో ఇటీవలే ముగ్గురు యువ వ్యాపారవేత్తలు తాము రూపొందించిన ‘ఐయూఐ హోమ్‌ కిట్‌’ను ప్రదర్శించారు. ఇక ఈ షో జడ్జిల్లో ఒకరైన నమిత.. ఈ కిట్‌ చూడగానే తన గత ఐవీఎఫ్‌ అనుభవాలు గుర్తొచ్చాయని, నిజానికి అదెంతో కఠినమైన సమయమంటూ ఎమోషనల్‌ అయింది.

అప్పుడు ఒక్క బిడ్డ చాలనిపించింది!

‘28 ఏళ్ల వయసులో నేను నా మొదటి కొడుక్కి జన్మనిచ్చా. అదీ నార్మల్‌ ప్రెగ్నెన్సీ! ఆపై మూడు నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకొని మరో బిడ్డ కోసం ప్రయత్నించాం. కానీ సహజంగా గర్భవతిని కాలేకపోయా. దీంతో రెండుసార్లు ఐవీఎఫ్‌ చికిత్స తీసుకున్నా.. ఈ క్రమంలో 25 ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఇది శారీరకంగానే కాదు.. మానసికంగానూ నన్నెంతో బాధపెట్టింది. ‘నిజానికి అప్పటికే నాకో కొడుకున్నాడు.. కానీ పూర్తిగా సంతానం లేని జంటల సంగతేంటి?’ అంటూ నా మనసుకు సర్దిచెప్పుకొని ఐవీఎఫ్‌ చికిత్సను విరమించుకున్నా.. ఒక్క బిడ్డ చాలనుకున్నా. అయితే అదృష్టవశాత్తూ కొన్ని నెలల తర్వాత సహజంగానే గర్భం ధరించా. రెండో కొడుకు పుట్టాడు. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని నాలోనే దాచుకున్నా. బయటికి చెప్పలేకపోయా.. దీని గురించి ఎవరితోనైనా పంచుకుందామన్న ఆలోచన కూడా ఇబ్బందిగా అనిపించేది.

నా మనసు మాట విన్నా!

అయితే ఈ మధ్యే నా యూట్యూబ్‌ ఛానల్‌లో సంతానలేమి గురించి ఓ డాక్టర్‌తో చిన్నపాటి చర్చ జరిగింది. ఇక ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. వివిధ కారణాల వల్ల పిల్లలు లేకపోవడం అనేది ఇప్పటికీ మన సమాజంలో ఒక లోపంగానే పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఒక దశలో నేను తీసుకున్న ఐవీఎఫ్‌ చికిత్సల గురించి నేను బయటికి చెప్పగలనా అన్న సందేహం నన్ను వెంటాడింది. ఇదే విషయం గురించి నా శ్రేయోభిలాషుల్ని అడిగితే.. ‘అది నీ వ్యక్తిగత విషయం.. బహిరంగంగా చర్చించడమెందుకు?’ అన్నారు. కానీ వాళ్లతో ఏకీభవించకుండా.. నా మనసు చెప్పిందే విన్నా. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నా. నేను రాసిన ఓ పుస్తకంలోనూ ఈ విషయాన్ని పొందుపరిచా..’ అంటూ చెప్పుకొచ్చింది నమిత. ఐవీఎఫ్‌ సక్సెసైనా, కాకపోయినా.. కొన్నిసార్లు సహజ పద్ధతుల్లోనూ గర్భం ధరించే అవకాశం ఉంటుందని, కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదంటూ తన అనుభవాలతో ఎన్నో జంటల్లో స్ఫూర్తి నింపిందీ బిజినెస్‌ మామ్‌. నమిత-వికాస్‌ థాపర్‌ జంటకు వీర్‌, జై అనే ఇద్దరు కొడుకులున్నారు.

ఆలస్యమే కారణమా?

ప్రస్తుతం సంతానలేమితో ఇబ్బందులు పడుతోన్న ఎన్నో జంటలకు ఐవీఎఫ్‌ వంటి ఆధునిక వైద్య చికిత్స వరంగా మారిందని చెప్పాలి. అయితే ఇందులో సక్సెస్‌ రేటు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కొన్ని జంటల్లో ఐవీఎఫ్‌ చికిత్స పలుమార్లు విఫలమవడం మనం చూస్తుంటాం. అందుకు వారి జీవనశైలి లోపాలతో పాటు మరికొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, లేటు వయసులో పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవడం, ఈ క్రమంలో అండాలు-శుక్రకణాల సంఖ్య-నాణ్యత తగ్గిపోవడం, ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేయడం.. వంటి వ్యక్తిగత కారణాలతో పాటు స్థూలకాయం, ఒత్తిడి.. వంటి అనారోగ్యాలు కూడా ఐవీఎఫ్‌ వైఫల్యానికి దారితీస్తున్నాయట. అందుకే పెళ్లయ్యాక ఆలస్యం చేయకుండా.. సరైన వయసులో పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటే సహజంగానే గర్భం ధరించే అవకాశాలెక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఒకవేళ పలు సమస్యల రీత్యా పిల్లల్ని కనలేకపోయినా.. ఆ వయసులో ఐవీఎఫ్‌ ప్రయత్నాలు ఫలించే అవకాశాలూ ఎక్కువే అంటున్నారు.


మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా..!

ఉత్తర కరోలినాలోని ‘డ్యూక్‌ యూనివర్సిటీ - ది ఫుఖా స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’లో ఎంబీఏ, ఐసీఏఐ నుంచి ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తిచేసిన నమిత.. ప్రస్తుతం తన తండ్రి స్థాపించిన ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌’ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతోంది. మరోవైపు తన సొంత వ్యాపారాల్లోనూ రాణిస్తోందామె. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కరోనా సమయంలో ‘అన్‌కండిషన్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ నమిత’ పేరుతో ఓ యూట్యూబ్‌ టాక్‌ షోను ప్రారంభించింది. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు దూరం చేసి.. ఆయా అంశాలపై ప్రామాణిక సమాచారాన్ని అందించడమే ముఖ్యోద్దేశంగా ఈ ఛానల్‌ను ప్రారంభించింది నమిత. అంతేకాదు.. ‘ఇంక్రెడిబుల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ అనే మరో సంస్థను స్థాపించిన ఈ బిజినెస్‌ లేడీ.. ఈ వేదికగా 11-18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాపార మెలకువలు నేర్పుతోంది. ఇలా తన వ్యాపార దక్షతతో దేశంలోనే పేరున్న నవతరం మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నమిత.. ‘వరల్డ్‌ విమెన్‌ లీడర్‌షిప్‌ కాంగ్రెస్‌ సూపర్‌ అఛీవర్‌ అవార్డు’తో పాటు పలు పురస్కారాలు అందుకుంది. మరికొన్ని స్ఫూర్తిదాయక మహిళల జాబితాల్లోనూ చోటు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్