రండి.. మనమే ముందుండి నడిపిద్దాం!

భరతమాత ముద్దు బిడ్డలుగా చరిత్రలో నిలిచిపోయిన స్వాతంత్య్ర సమర యోధులు, మహానుభావుల నుంచి నేటి యువత అలవరచుకోవాల్సిన ఆదర్శ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆ మహామహుల వ్యక్తిత్వాల్లోనే కాదు.. ఆలోచనాధోరణిలో కూడా వాళ్ల ఔన్నత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి మహానుభావుల నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయి..

Published : 14 Aug 2021 17:25 IST

భరతమాత ముద్దు బిడ్డలుగా చరిత్రలో నిలిచిపోయిన స్వాతంత్య్ర సమర యోధులు, మహానుభావుల నుంచి నేటి యువత అలవరచుకోవాల్సిన ఆదర్శ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆ మహామహుల వ్యక్తిత్వాల్లోనే కాదు.. ఆలోచనాధోరణిలో కూడా వాళ్ల ఔన్నత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి మహానుభావుల నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయి..

* తలపెట్టిన పని ఏదైనా విజయవంతంగా జరగాలంటే అందుకు మన మీద మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. 'నువ్వు నీలాగే ఉండు.. నీలానే ఆలోచించు.. ఇతరుల ఆలోచనలకు, మాటలకు ప్రభావితం కావద్దు' అంటూ భారతీయులకు పిలుపునిచ్చిన నాయకులు ఎందరో. తనపై నమ్మకం అనేది ఉన్నప్పుడే ఎవరి ఆలోచనా తీరైనా సక్రమంగా సాగుతుంది.

* వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందాలన్నా, దేశం పురోగతి సాధించాలన్నా భూత, భవిష్యత్తు కాలాల మీద కంటే వర్తమానం పైనే దృష్టి పెట్టాలి. సకాలంలో క్రమశిక్షణతో మన బాధ్యతలను నిర్వర్తించాలి. ఈ విషయంలో బద్ధకానికి పూర్తిగా స్వస్తి పలకాలి. సమయపాలనకు ప్రాముఖ్యం ఇవ్వాలి. అప్పుడే మన లక్ష్యాలు సాధించగలుగుతాం. దేశాభివృద్ధిలోనూ పాలుపంచుకోగలుగుతాం.

* 'ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు..' అని ఎదురుచూడటం కాదు.. మనమే ఎందుకు ముందడుగు వేయకూడదు?? మనమే ముందుండి అందరినీ ఎందుకు నడిపించకూడదు?? అనే ధోరణితో ఆలోచించిన రోజున మన జీవితంలోనూ, సమాజంలోనూ మార్పొస్తుంది.. కాదంటారా? 

* చేపట్టిన పనిని పూర్తి చేయాలంటే కృషి, పట్టుదల రెండూ తప్పనిసరి. ఇవి మనలో ఉన్నప్పుడు ఏ పనినీ మధ్యలో విడిచిపెట్టే ప్రసక్తే రాదు. ఒప్పుకుంటారు కదూ!

* అసలు మనం ఎందుకు పుట్టాం? మన జీవిత లక్ష్యం ఏమిటి? దాన్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? మన వల్ల సమాజానికి, తద్వారా దేశానికి కలిగే ఉపయోగమేంటి?.. ఈవిధంగా ఎవరి మనస్సాక్షిని వాళ్లు స్వయంగా ప్రశ్నించుకుని చూడండి. ఆ తర్వాత మీరేం చేయాలన్నది మీ మనసే హితబోధ చేస్తుంది.

* మనిషికి ఎన్ని సుగుణాలు ఉన్నా.. భయం మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అదే మనల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొన్న నాడే మన సంకల్పం మరింత దృఢపడుతుంది.

* చేసిన తప్పుల్ని, వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి. మనం సన్మార్గంలో నడవడానికి కూడా అవి ఉపకరిస్తాయి.

వీటితో పాటు సమయపాలన, సమయస్ఫూర్తి, కచ్చితత్వం, నిరాడంబరత.. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగతంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడే లక్షణాలు ఎన్నో. వీటన్నిటినీ జాగ్రత్తగా అలవర్చుకోగలిగితే మనం ఉన్నతిని సాధించడమే కాదు.. దేశాభివృద్ధిలోనూ భాగస్వాములం కాగలుగుతాం... బిందువు బిందువు కలిస్తేనే కదా సింధువయ్యేది... అలాగే వ్యక్తులుగా మనందరం కలిస్తేనే, వ్యక్తిగతంగా విజయం సాధిస్తేనే - దేశం కూడా ప్రగతిపథంలో నడుస్తుంది.. మరి అభివృద్ధి బాటలో పయనించేందుకు ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఏముంటుంది? కావాల్సిన ఆయుధాలన్నింటినీ సమకూర్చుకుని మీ కలల సాధనలో ముందుకు దూసుకుపోండి... విజయీభవ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్