Money Tips: పోపుల పెట్టెలో కాదు.. ఇలా దాచుకుంటే లాభం!

నెల తిరిగే సరికి అకౌంట్లో పడే జీతాన్ని ఎలా పొదుపు చేయాలి, ఎందులో మదుపు చేయాలన్నది మనలో చాలామంది ఉద్యోగినులకు తెలిసిందే! మరి, పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యే గృహిణుల పరిస్థితేంటి? సొంత ఆదాయం లేక.. ఇంటి ఖర్చుల కోసం భర్త ఇచ్చిన డబ్బులోనే ఖర్చులు....

Updated : 19 May 2023 19:47 IST

నెల తిరిగే సరికి అకౌంట్లో పడే జీతాన్ని ఎలా పొదుపు చేయాలి, ఎందులో మదుపు చేయాలన్నది మనలో చాలామంది ఉద్యోగినులకు తెలిసిందే! మరి, పూర్తిగా ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యే గృహిణుల పరిస్థితేంటి? సొంత ఆదాయం లేక.. ఇంటి ఖర్చుల కోసం భర్త ఇచ్చిన డబ్బులోనే ఖర్చులు వెళ్లదీస్తూ కొంత మొత్తాన్ని మిగుల్చుకోవడం.. వాటిని ఏ పోపుల పెట్టెలోనో లేదంటే బీరువాలోనో దాచుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది మహిళలు. అలా పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బుతో తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. నిజానికి ఎదుగూ బొదుగూ లేని ఇలాంటి చోట డబ్బు దాచుకోవడం కంటే.. తక్కువ డబ్బుతోనే ఎక్కువ లాభాలు ఆర్జించే పెట్టుబడి మార్గాల్ని ఎంచుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇవి గృహిణులకు దీర్ఘకాలంలో ఆర్థిక భరోసాను అందిస్తాయంటున్నారు. మరి, అలాంటి కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలు/పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

గృహిణులకు స్థిరమైన ఆదాయం ఉండదు.. నెలనెలా ఖర్చులు పోను ఎంత మొత్తం మిగులుతుందో చెప్పలేరు.. పైగా ఇంత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం వీలవుతుందో, లేదోనన్న సందిగ్ధం.. ఈ సందేహాలతోనే డబ్బు పొదుపు చేసే మార్గాలకు దూరంగా ఉంటారు చాలామంది. కానీ ఇలాంటి వారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) చక్కటి పెట్టుబడి మార్గం అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా పోస్టాఫీస్‌లో కనీసం రూ. 1000లతో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఆపై నెలనెలా వంద గణాంకాలతో (అంటే.. 100, 200, 300) డబ్బు అందులో జమ చేయాల్సి ఉంటుంది. అంటే.. నెలనెలా కచ్చితంగా ఇంతే జమ చేయాలన్న నియమమేమీ లేదన్నమాట! అలాగే గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. ప్రస్తుతం ఈ పథకం కింద 7.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఏటికేడు ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పెట్టుబడి పథకంలో భాగంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందచ్చు. కేవలం సింగిల్‌గానే కాదు.. జాయింట్‌గా లేదా వయోజనులు కాని పిల్లల పేరు మీద కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి వీలుంది. ప్రభుత్వం అందించే ఈ పొదుపు పథకంలో రిస్క్‌ తక్కువ.. రాబడి ఎక్కువ అంటున్నారు నిపుణులు.

మహిళా సమ్మాన్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) లాంటిదే ఇది కూడా! అయితే దానికి, దీనికి కొన్ని విషయాల్లో తేడాలున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో భాగంగా మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకొచ్చింది. ఇందులో భాగంగా పోస్టాఫీసులో కనిష్టంగా రూ. 1000 లతో ఖాతా తెరవాలి. ఆపై నెలనెలా వంద గణాంకాలతో (అంటే.. 100, 200, 300) డబ్బు అందులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పథకానికి 7.5 శాతం స్థిర వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని త్వరలోనే బ్యాంకుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారట! ఇక జమయ్యే మొత్తాన్ని కాలపరిమితి పూర్తి కాకముందు మధ్యలోనూ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఈ పథకంలో ఉంది. ఈ క్రమంలో ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతాలో ఉన్న మొత్తంలో నుంచి 40 శాతం వరకు డ్రా చేసుకోవచ్చు. ఇదేవిధంగా ఈ పథకంపై ఆర్జించిన వడ్డీకి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ఉండదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఇటీవలే స్పష్టం చేసింది. వడ్డీ మొత్తం డిపాజిట్‌దారు చేతికి వచ్చాక, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.

బంగారంలో.. స్మార్ట్‌గా!

మహిళలకు బంగారం అతి ప్రియమైనది. అక్షయ తృతీయ, ధన్‌తేరస్‌.. వంటి పర్వదినాలతో పాటు పలు ప్రత్యేక సందర్భాల్లోనూ పసిడి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు చాలామంది. అయితే రోజురోజుకీ పెరుగుతోన్న బంగారం ధరలు ‘ఇక ఎప్పటికీ బంగారం కొనలేమేమో’ అన్న అభద్రతా భావానికి తెరతీస్తున్నాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అటు ఈ అభద్రతా భావానికి తెరదించడంతో పాటు ఇటు ఆర్థిక భరోసానూ సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చిన్న మొత్తాలతోనే పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం చాలా మార్గాలున్నాయంటున్నారు. అయితే ఇందులో భాగంగా ఆయా జ్యుయలరీ సంస్థలు అందించే నెలవారీ పొదుపు పథకాలకు బదులు.. గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌.. వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం అంటున్నారు. ఇక తక్కువ డబ్బుతో బంగారం కొనాలనుకునే వారికీ డిజిటల్‌ గోల్డ్‌ చక్కటి ఎంపిక అని చెప్పచ్చు. మన దగ్గర ఉన్న డబ్బును బట్టి ఎంత బంగారమైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయచ్చు.. మార్కెట్‌ ధరల్ని బట్టి ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు.. కావాలంటే ఈ తరహా బంగారాన్ని గోల్డ్‌ కాయిన్స్‌ రూపంలోనూ కొనుగోలు చేయచ్చు.. ఎలా చూసినా ఈ పెట్టుబడి మార్గాలు లాభదాయకమే అంటున్నారు నిపుణులు.

మ్యూచువల్‌ ఫండ్లు

తక్కువ మొత్తంలో, దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి మ్యూచువల్‌ ఫండ్లు చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ఆయా బ్యాంకులు, సంస్థలు అందించే సిప్‌ ద్వారా కనీసం రూ. 500 నుంచి పెట్టుబడి పెట్టే వీలుంది. మరికొన్ని సంస్థలు కనిష్టంగా రూ. 100 కూడా పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నాయి. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం నిర్ణీత వ్యవధుల్లో ఈ మొత్తాన్ని ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్‌ హెచ్చుతగ్గులతో పనిలేకుండా దీర్ఘకాలంలో చక్కటి ప్రయోజనాల్ని పొందచ్చు. అలాగే ఈ పథకాన్ని చిన్న వయసులో ప్రారంభించి.. నిర్ణీత వ్యవధుల్లో కచ్చితంగా పెట్టుబడి పెడుతూ ముందుకు సాగితే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలుంటాయంటున్నారు నిపుణులు.

ఇక వీటితో పాటు ‘పోస్టాఫీస్‌ ఆర్డీ’, ‘పీపీఎఫ్‌’, పెట్టుబడితో పాటు బీమా సౌకర్యాన్ని అందించే యులిప్‌ వంటి బీమా పథకాలు, కూతుళ్ల పేరు మీద పొదుపు చేయాలంటే ‘సుకన్య సమృద్ధి యోజన’.. వంటి పథకాలు తక్కువ పెట్టుబడితో ప్రారంభమై.. నిర్ణీత వ్యవధుల్లో ఎక్కువ రాబడిని అందిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్