రాజీనామా చేసింది.. మళ్లీ గెలిచింది..!

లింగ సమానత్వంలో స్వీడన్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశం మహిళలకు అత్యధికంగా 480 రోజుల మాతృత్వపు సెలవులు ఇస్తోంది.. ఈ దేశ చట్టసభలో 47 శాతం మంది మహిళలే.. లింగ సమానత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వీడన్‌ మహిళలకు స్వర్గధామం అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Updated : 30 Nov 2021 20:08 IST

లింగ సమానత్వంలో స్వీడన్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ దేశం మహిళలకు అత్యధికంగా 480 రోజుల మాతృత్వపు సెలవులు ఇస్తోంది.. ఈ దేశ చట్టసభలో 47 శాతం మంది మహిళలే.. లింగ సమానత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే పదో స్థానంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వీడన్‌ మహిళలకు స్వర్గధామం అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మహిళలకు ఇన్ని అనుకూలతలు ఉన్న ఈ దేశంలో మొన్నమొన్నటి వరకు ఒక్క మహిళ కూడా ప్రధానమంత్రి కాలేకపోవడం గమనార్హం. దానిని పటాపంచలు చేస్తూ వారం రోజుల క్రితం స్వీడన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా మగ్దలీనా అండర్సన్ (54) ఎంపికయ్యారు. అయితే కొన్ని నాటకీయ పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఎంపికైన కొన్ని గంటల్లోనే తన బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. అయితే తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ ఆమెను మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకొంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం...

రోజుల వ్యవధిలోనే రెండోసారి..!

స్వీడన్ మాజీ ప్రధాని స్టీఫన్ లోవియాన్ కొన్ని కారణాల వల్ల ఇటీవలే రాజీనామా చేశారు. దాంతో ఆర్థికమంత్రిగా ఉన్న అండర్సన్ నవంబర్‌ 4న సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. ఆ తర్వాత కొన్ని పార్టీలతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నవంబర్‌ 24న మొదటిసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ పార్టీ బడ్జెట్‌ నచ్చకపోవడంతో బిల్లుని వ్యతిరేకించింది. దాంతో ఆ బిల్లు వీగిపోయి ప్రతిపక్షాలు పెట్టిన బడ్జెట్‌ బిల్లుకి ఆమోదం లభించింది. దాంతో అండర్సన్ ప్రధానిగా ఎన్నికైన కొన్ని గంటల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి పార్లమెంట్‌లో ఎన్నిక జరగ్గా ఆమె ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో అండర్సన్కు 101 మంది (మొత్తం 349) అనుకూలంగా ఓటు వేయగా 173 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఆ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 175 కంటే ఎక్కువ వ్యతిరేక ఓట్లు రాకూడదు. దాంతో రోజుల వ్యవధిలోనే ఆమె తిరిగి ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు.

అండర్సన్ కెరీర్:

* అండర్సన్ పూర్తి పేరు ఇవా మగ్దలీనా అండర్సన్. ఆమె 1967లో జనవరి 23న ఉప్సల అనే ప్రాంతంలో జన్మించారు.

* స్టాక్‌హోమ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించారు. తర్వాత కొంతకాలం స్టాక్‌హోమ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పార్ట్‌టైం లెక్చరర్‌గా పని చేశారు.

* అండర్సన్ యుక్త వయసులో ఉప్సల స్విమ్మింగ్‌ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఆమె ‘బ్రెస్ట్ స్ట్రోక్‌’ ఈవెంట్లో రెండుసార్లు యూత్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు.

* అండర్సన్ 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ప్రధానమంత్రి కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పని చేశారు. ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగారు.

* 1997లో ఆమె ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ అయిన రిచర్డ్ ఫ్రిబర్గ్‌ని వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

* ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్లానింగ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు.

* 2004 నుంచి 2006 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా పని చేశారు.

* ఆ తర్వాత 2007 నుంచి 2014 వరకు సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీలో వివిధ పదవులను చేపట్టారు.

* ఇక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తను ప్రాతినిథ్యం వహిస్తోన్న సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థికశాఖపై ఆమెకు అవగాహన ఉండడంతో అప్పటి ప్రధాని స్టీఫన్‌ లోవియాన్ ఆమెకు ఆర్థికశాఖను అప్పగించారు. అప్పటినుంచి ఆమె దేశ ఆర్థికమంత్రిగా సేవలు అందిస్తున్నారు.

* 2021లో ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్ (IMF) సలహా సంఘానికి నాయకత్వం వహించి.. ఈ ఘనత దక్కించుకున్న మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.

* అండర్సన్ తను ప్రాతినిథ్యం వహిస్తోన్న సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీకి నవంబర్ 4న అధ్యక్షురాలయ్యారు. అంతకుముందు మోనా సాహ్లిన్ మొదటిసారి ఆ పార్టీకి అధ్యక్షురాలైంది.

* అండర్సన్ కంటే ముందు ఆ దేశానికి 33 మంది ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయితే వారంతా పురుషులే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అండర్సన్ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్