మేకప్‌ లేకుండానే అందాల పోటీల్లో మెరిసింది!

మేకప్‌ వేసుకుంటేనే అందమొస్తుంది కానీ.. లేకపోతే అమ్మాయిలు అందంగా ఉండరా?అంటే.. ఎందుకుండరు? అని ఎదురు ప్రశ్నిస్తోంది లండన్‌కు చెందిన మెలిసా రౌఫ్‌. కేవలం మాట వరసకు ఇలా అనడమే కాదు.. మేకప్‌ వేసుకోకుండా ఏకంగా ‘మిస్‌ ఇంగ్లండ్‌’ అందాల పోటీల్లో......

Updated : 26 Aug 2022 19:21 IST

(Photo: Instagram)

మేకప్‌ వేసుకుంటేనే అందమొస్తుంది కానీ.. లేకపోతే అమ్మాయిలు అందంగా ఉండరా?అంటే.. ఎందుకుండరు? అని ఎదురు ప్రశ్నిస్తోంది లండన్‌కు చెందిన మెలిసా రౌఫ్‌. కేవలం మాట వరసకు ఇలా అనడమే కాదు.. మేకప్‌ వేసుకోకుండా ఏకంగా ‘మిస్‌ ఇంగ్లండ్‌’ అందాల పోటీల్లో పాల్గొంది. 94 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పోటీల్లో ఒక పోటీదారు మేకప్‌ వేసుకోకుండా పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇలా తన సహజసిద్ధమైన అందంతో న్యాయనిర్ణేతల్ని మెప్పించడమే కాదు.. దీని వెనకున్న అసలు కారణం చెబుతూ ఎంతోమంది అమ్మాయిల మనసు కొల్లగొడుతోందీ న్యాచురల్‌ బ్యూటీ. ఇలా తన సాహసోపేతమైన నిర్ణయంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన మెలిసా.. అసలు మేకప్‌ లేకుండా ఈ పోటీల్లో ఎందుకు పాల్గొందో తెలుసుకుందాం రండి..

సందర్భం ఉన్నా, లేకపోయినా మేకప్‌తో మరింత అందంగా కనిపించాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. అలాంటిది తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలు మేకప్‌ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తుంటారు. కానీ దక్షిణ ఇంగ్లండ్‌లోని Battersea అనే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మెలిసా రౌఫ్‌ ఇందుకు భిన్నంగా ఆలోచించింది. మేకప్‌ వేసుకోకుండానే ప్రస్తుతం జరుగుతోన్న ‘మిస్‌ ఇంగ్లండ్‌’ పోటీల్లో మెరిసింది. తద్వారా 94 ఏళ్ల ఈ అందాల పోటీల చరిత్రలో మేకప్‌ వేసుకోకుండా పాల్గొన్న తొలి పోటీదారుగా చరిత్ర సృష్టించింది.

మేకప్‌.. నాకు నచ్చదు!

ప్రస్తుతం లండన్‌లోని కింగ్స్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో డిగ్రీ చదువుతోన్న మెలిసాకు ఇప్పుడే కాదు.. చిన్న వయసు నుంచే మేకప్ అంటే ఇష్టం లేదట! ‘పెరిగి పెద్దయ్యే క్రమంలోనే మేకప్‌ నాకు పరిచయమైంది. అయితే అది వేసుకున్నప్పుడు నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. సహజసిద్ధమైన అందానికి ఆమడ దూరంలో ఉన్నట్లనిపించేది. అందుకే మేకప్‌ను చాలా వరకు దూరం పెడుతుంటా..’ అని చెప్పే మెలిసా.. తాజా మిస్‌ ఇంగ్లండ్‌ అందాల పోటీల్లో ‘బేర్‌ ఫేస్‌ టాప్‌ మోడల్‌’ అవార్డునూ సొంతం చేసుకుంది. అంతేకాదు.. సెమీఫైనల్‌ రౌండ్‌లో మేకప్‌ వేసుకోకుండా పాల్గొని.. తన సహజసిద్ధమైన అందంతోనే కాదు.. దీని వెనకున్న అసలు కారణమేంటో వివరించి న్యాయనిర్ణేతల్ని సైతం ఆకట్టుకుందీ చిన్నది. ఫలితంగా ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికైంది. ఇక్కడ 40 మంది సుందరాంగిణులతో పోటీ పడనుందీ బ్రిటిష్‌ బ్యూటీ.

ఆ లోపాలే మన ప్రత్యేకతలు!

‘అందం కోసం మేకప్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదు.. దాని కంటే సహజసిద్ధంగానే అమ్మాయిలు మరింత అందంగా మెరిసిపోగలరు..’ అని చాటిచెప్పడానికే తానింత ధైర్యం చేశానంటోంది మెలిసా. ‘చాలామంది మహిళలు వయసుతో సంబంధం లేకుండా మేకప్‌ను ఆశ్రయిస్తుంటారు. దీనివల్లనే మరింత అందంగా కనిపించగలుగుతామని అనుకుంటారు. కానీ నిజానికి మేకప్‌ వేసుకోకుండా సహజంగా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తామన్నది నా భావన. ఒక్కసారి మనల్ని మనంగా ప్రేమించడం మొదలుపెడితే.. ఇక ఏ మేకప్‌తోనూ అవసరం ఉండదు. నిజానికి మనలో మనం లోపాలుగా భావించే అంశాలన్నీ మనల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. చాలామంది అనుకునే సౌందర్య ప్రమాణాల్ని పొందాలన్న ఆరాటం నాకు లేదు. అందుకే ఈ పోటీలో మేకప్‌ లేకుండానే పాల్గొనాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నాపై నాకు నమ్మకం, ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యాయి. సహజంగా ఉండడంలోనే అసలైన అందం దాగుంది.. ఈ విషయం చెప్పడానికే నేనింత ధైర్యం చేశా. చాలామంది అమ్మాయిలు నా నిర్ణయాన్ని గౌరవిస్తూ సందేశాలు పంపుతున్నారు. నా నుంచి స్ఫూర్తి పొందామని చెబుతున్నారు. మేకప్‌ను పక్కన పెడితే ప్రతి ఒక్కరూ అందగత్తెలే! ఇదే ఆత్మవిశ్వాసంతో ఫైనల్స్‌లోనూ మేకప్‌ లేకుండానే పాల్గొనాలనుకుంటున్నా..’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది మెలిసా.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాటలు, మేకప్‌ వేసుకోకుండా కంటెస్ట్‌లో పాల్గొన్న ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మెలిసా మాటలు తమలో ప్రేరణ కలిగించాయంటూ చాలామంది అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్