నిండు నూరేళ్ల బంధం.. ఎందుకు వీగిపోతోంది?!

పెళ్లంటే నూరేళ్ల అనుబంధం అంటారు. కానీ ఈ శాశ్వతమైన అనుబంధమే ఈ రోజుల్లో తాత్కాలికమవుతోంది. నూరేళ్లు కలిసి జీవిస్తామని బాస చేసుకున్న జంటలు నెలలు/సంవత్సరాల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇక కరోనా కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగిందని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేనా.. గతేడాది కాలంగా మునుపెన్నడూ లేనంతగా విడాకులు కావాలంటూ జంటలు కోర్టు మెట్లెక్కారని మరోవైపు దర్శకుడు పూరీ తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో చెప్పుకొచ్చాడు.

Updated : 30 Jun 2021 20:45 IST

పెళ్లంటే నూరేళ్ల అనుబంధం అంటారు. కానీ ఈ శాశ్వతమైన అనుబంధమే ఈ రోజుల్లో తాత్కాలికమవుతోంది. నూరేళ్లు కలిసి జీవిస్తామని బాస చేసుకున్న జంటలు నెలలు/సంవత్సరాల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇక కరోనా కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగిందని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేనా.. గతేడాది కాలంగా మునుపెన్నడూ లేనంతగా విడాకులు కావాలంటూ జంటలు కోర్టు మెట్లెక్కారని మరోవైపు దర్శకుడు పూరీ తన ‘పూరీ మ్యూజింగ్స్‌’లో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ‘ఇకపై తనతో కలిసి బతకలేను..’ అని విడాకులు తీసుకునే క్రమంలో చాలామంది దంపతులు చెబుతోన్న కొన్ని కారణాలను ఇటీవలే రిలేషన్‌షిప్‌ నిపుణులు వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం రండి..

మూసధోరణుల్ని పట్టుకు వేలాడుతూ..!

‘అబ్బాయిలు సంపాదించి కుటుంబాన్ని పోషించాలి.. అమ్మాయిలు ఇంటి పట్టునే ఉంటూ బాధ్యతలు చక్కదిద్దాలి.. ఇంటి పనుల్లోనూ మగవారు పాలుపంచుకోకూడదు..’ అనే మూసధోరణి నాటి నుంచే మన సంప్రదాయంలో నాటుకుపోయింది. ఈ క్రమంలో అమ్మాయికి ఏది కావాలన్నా భర్త మీదే ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఫలితంగా ఒకరిపై మరొకరు ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది. అలాగే ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు కూడా ఇద్దరూ కలిసే పంచుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. పాతకాలపు సంప్రదాయాల ప్రభావం ఇప్పటికీ కొన్ని జంటలపై ఉందంటున్నారు నిపుణులు. దీంతో వారి ప్రవర్తన ప్రస్తుత పరిస్థితులకు ఇమడలేక.. ఇద్దరి మధ్యా గొడవలు మొదలవుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ సమానమే అన్న అంశాన్ని ఏకీభవించలేని వారు కలిసుండడం కంటే విడిపోవడానికే మొగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలాంటి ఆలోచనల్ని ఛేదించి బంధం నిలబెట్టుకోవాలంటే ఒకరితో ఒకరు రాజీ పడడం లేదంటే ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నప్పుడే అది సాధ్యమంటున్నారు.

నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు?

భార్యాభర్తలిద్దరూ సమానమే అయినా ఎవరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి ఉంటాయి. అయితే కొన్ని జంటల్లో ఈ అవగాహన కొరవడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో నా సంపాదనే ఎక్కువ.. కాబట్టి నేను చెప్పిందే నువ్వు వినాలి.. అన్న భావనతో ఉంటారు. ఇలాంటివారు తమ భాగస్వామి నిర్ణయాలతో పనిలేకుండా.. వారికి సంబంధించిన విషయాల్లోనూ వీరే నిర్ణయాలు తీసుకుంటుంటారు. దీంతో ‘నాకు తెలియకుండా నా విషయంలో నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు.. ఆ హక్కు నీకు లేదు..’ అంటూ గొడవలు మొదలు! ఇదిగో ఇలాంటి కలతలే చాలామందిని విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిస్తున్నాయని చెబుతున్నారు. అందుకే అవతలి వారు మీకు ఎంత విలువిస్తున్నారో.. మీరూ వారికి అంతే గౌరవం ఇవ్వడం, ఏ నిర్ణయమైనా కలిసి తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చంటున్నారు.

పంచుకునే వారే కరువవుతుంటే..!

ఈ రోజుల్లో చాలామంది తమ సొంత ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో చాలా జంటలు తమ ఊరిని, స్నేహితులు, కుటుంబ సభ్యులను మిస్‌ అవుతున్నాయని చెప్పాలి. అయితే ఏ సెలవులకో వెళ్లినప్పటికీ అందరినీ కలిసే హడావిడే కానీ.. తమ వారితో కలిసి ఓ నాలుగు రోజులు సంతోషంగా గడిపాం, సుఖదుఃఖాలు పంచుకున్నామన్న తృప్తే చాలా జంటలకు ఉండట్లేదు. దీంతో ఇక్కడ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు వారి మనసులోనే ఉండిపోతున్నాయి. వాటిని అప్పటికప్పుడు పంచుకొని పరిష్కరించుకునే మార్గమే లేకుండా పోతోంది. ఇక ఫోన్లో పెద్దవాళ్లతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు కదా అనుకుంటే.. ‘తప్పంతా నీ వైపు పెట్టుకొని నేనెందుకు ఫోన్‌ చేయాలి.. నువ్వే చేసి సమస్యను పరిష్కరించు’ అన్న ఈగో ఒకటి అడ్డుపడుతుంటుంది. ఎటు నుంచి చూసినా ఇది అనుబంధంలో చిచ్చుపెట్టేదే! అందుకే దీన్ని వదిలించుకున్నప్పుడే సంసారం చక్కబడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆ పరిచయాలతో పెడార్థాలు తీస్తూ..!

చదువుకునేటప్పుడైనా, ఉద్యోగాలు చేసేటప్పుడైనా ఆడ-మగ మాట్లాడుకోవడం ఈ రోజుల్లో కామన్‌. వృత్తి విషయంలో ఇలా మాట్లాడుకున్నా.. ఇద్దరి మధ్య అంతకుమించిన బంధమేదో ఉందని భావిస్తుంటారు కొంతమంది భాగస్వాములు.. వారి పరిచయాలపై అనుమానపడుతుంటారు. కొంతమందైతే ఇదే విషయాన్ని పట్టుకొని పెడార్థాలు తీస్తూ.. భాగస్వామిని నిందిస్తుంటారు.. మానసికంగా హింసిస్తుంటారు. ఈ రోజుల్లో చాలాజంటలు విడాకుల దాకా వెళ్తున్నాయంటే ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఎదుటివారిని నిందించే ముందు ఒకసారి నిజమేంటో తెలుసుకుంటే ఆదిలోనే తప్పును సరిదిద్దుకోవచ్చని.. తద్వారా పరిస్థితి విడిపోయేదాకా రాదని సలహా ఇస్తున్నారు.

ఏదైనా పారదర్శకంగానే..!

వివాహబంధమంటే దంపతులిద్దరి మధ్య ఉండే నమ్మకం. అయితే ఈ మధ్య చాలా జంటల్లో ఈ నమ్మకం కొరవడుతోందని చెబుతున్నారు నిపుణులు. పెళ్లికి ముందు ఉండే ప్రేమ వ్యవహారాలు, శారీరక లోపాలు.. వంటివి దాచిపెట్టి పెళ్లయ్యాక వాటి గురించి తెలిసినప్పుడు చూసుకుందాంలే అనుకుంటుంటారు కొంతమంది. దాంతో అవి కాస్తా గిట్టని వారి ద్వారా తెలిస్తే ఇక ఇద్దరి మధ్య గొడవలు షురూ! అందుకే పెళ్లికి ముందే ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలంటున్నారు నిపుణులు. అది ప్రేమ వ్యవహారమైనా, ఏవైనా అనారోగ్యాలున్నా.. పెళ్లి చూపుల్లోనే ఎదుటివారికి తెలియజేయాలి. అప్పుడు వారికి నచ్చితేనే ముందుకెళ్తారు. ఇక ఆపై ఏ గొడవా ఉండదు.

ఇక వీటితో పాటు వివాహేతర సంబంధాలు, లైంగికాసక్తి తగ్గిపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడం.. వంటివీ జంటల మధ్య చిచ్చు పెట్టి వారిని విడాకుల దాకా లాగుతున్నాయట! ఏదేమైనా, ఎన్ని సమస్యలొచ్చినా.. అహం, ఆధిపత్యం పక్కన పెట్టి.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం, భాగస్వామి పరిస్థితుల్ని అర్థం చేసుకొని మెలిగినప్పుడే ఇలాంటి గొడవలు విడాకుల దాకా పోకుండా ఉంటాయి.

మరి, ఈ విషయంలో మీరేమంటారు? దంపతుల మధ్య గొడవలు విడాకుల దాకా వెళ్లడానికి అసలు కారణం ఏమై ఉంటుందంటారు? మీ అభిప్రాయాల్ని, సలహాల్ని మాతో పంచుకోండి. మీరు చెప్పే రిలేషన్‌షిప్‌ పాఠాలు ఎన్నో జంటలకు ఉపయోగపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్