‘యోగా’లో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అలసిన శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవాలనుకుంటున్నారా? వీటిని ఏకకాలంలో పొందాలంటే యోగా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు....

Updated : 21 Jun 2023 16:32 IST

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అలసిన శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవాలనుకుంటున్నారా? వీటిని ఏకకాలంలో పొందాలంటే యోగా చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడడమూ ముఖ్యమే అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతోనో లేదంటే నిర్లక్ష్యంతోనో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. తద్వారా యోగా చేసిన ఫలితం దక్కకుండా పోతుంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా యోగా చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం రండి..

ఇలా చేస్తే నిరుపయోగమే!

యోగాసనాల్లో ధ్యానం కూడా ఓ భాగమే. ఈ క్రమంలో కొన్ని యోగాసనాలు వేసేటప్పుడు గట్టిగా గాలి పీల్చి వదలాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం యోగాసనాలపైనే దృష్టి పెడుతుంటారు. ‘ఏదో చేశాంలే’ అన్నట్లుగా యోగా పూర్తి చేస్తుంటారు. అలాగే ఒకేసారి గట్టిగా గాలి పీల్చడం, వదలడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల చేసిన ఫలితం దక్కకుండా పోతుందంటున్నారు నిపుణులు. అందుకే ఆసనాలు వేసేటప్పుడు దానికి తగిన రీతిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఇందుకు నిపుణులు చెప్పిన చిట్కాల్ని తు.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అప్పుడే అటు శరీరానికి ఆరోగ్యం, ఇటు మనసుకు ప్రశాంతత లభిస్తాయి.

సొంత ప్రయత్నాలొద్దు...

కొన్ని యోగాసనాలు చేయడానికి ఒకే విధంగా అనిపించచ్చు.. కానీ వాటిలోని భంగిమలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆసనాలు వేయడం ఉత్తమం. అలాకాకుండా కొంతమంది మాత్రం ఆసనాలు ఒకే రకంగా ఉన్నాయని అన్నింటికీ అవే భంగిమలు వేస్తే వాటి ద్వారా ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి నిపుణులు చెప్పినట్లుగా ఆసనాలు సాధన చేయడం ఉత్తమం. మరికొంతమంది ఇంట్లోనే స్వయంగా ఆసనాలు వేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు.. ఎందుకంటే ఆసనాలను వేయాల్సిన రీతిలో వేయకపోతే కండరాలు, నాడులపై ఒత్తిడి పడి ఆయా భాగాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలోనే యోగాసనాలు సాధన చేయడం మంచిది.

చేసే ముందు...

వ్యాయామాలు చేసే క్రమంలో ముందుగా వార్మప్‌ చేస్తాం. యోగాసనాలు చేసే క్రమంలోనూ ఇది తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కానీ కొందరు మాత్రం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ నేరుగా యోగాసనాల్లోకి దిగిపోతారు. దీంతో ఆసనాలు వేయడానికి శరీరం అంతగా సహకరించదు. ఫలితంగా యోగా చేయడం కష్టతరమై నెమ్మదిగా దానిపై ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యోగా చేయడానికి అరగంట ముందు నుంచే దానికోసం తగిన వార్మప్ చేయడం తప్పనిసరి. ఫలితంగా యోగాసనాలకు శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారు కావడంతో పాటు.. దానిపై శ్రద్ధ పెరిగి మరింత మెరుగైన ఫలితం పొందచ్చు.

ఆదరాబాదరాగా వద్దు...

యోగాసనాలు చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా, ఆసక్తితో చేస్తే అంత చక్కటి ఫలితం దక్కుతుంది. అలాకాకుండా సమయం మించిపోతోందనో లేదంటే తక్కువ సమయంలోనే అన్ని ఆసనాలు కవర్ చేసేయాలనో.. ఆదరాబాదరాగా ఆసనాల్ని పూర్తి చేయడం వల్ల మీరు ఇన్ని రోజులు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. పైగా ఇలా చేయడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఆసనాలు వేసే క్రమంలో ఎంత నెమ్మదిగా, ఆస్వాదిస్తూ చేస్తే అంత మంచిది. అలాగే ఒక ఆసనం పూర్తయిన తర్వాత వెంటనే మరో ఆసనం ప్రయత్నించకుండా శరీరంలోని కండరాలకు, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడం ఉత్తమం. ఫలితంగా ఆ తర్వాత చేసే ఆసనం మరింత పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.. యోగా మీద శ్రద్ధ, ఆసక్తి కూడా రెట్టింపవుతాయి.

ఇవి కూడా!

ప్రారంభ దశలోనే కఠినతరమైన ఆసనాలు ప్రయత్నిస్తుంటారు కొందరు. దీనివల్ల ఒక్కోసారి అతి కష్టంగా అనిపించి అసలు యోగా అంటేనే విముఖత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే యోగాసనాలు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కనీసం 45 రోజుల వరకు సులభతరమైన ఆసనాలు వేయడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

వ్యాయామానికి ఎలాగైతే సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారో.. యోగాకు కూడా సౌకర్యంగా, వాతావరణానికి తగ్గట్లుగా ఉండే దుస్తుల్ని ధరించడం మంచిదని గుర్తుంచుకోండి. అయితే ఈ క్రమంలో దుస్తులు మరీ బిగుతుగా, మరీ వదులుగా ఉండకుండా జాగ్రత్తపడాలి.

గుండె సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు కఠినతరమైన యోగాసనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం ఉత్తమం. అంతగా చేయాలనిపిస్తే నిపుణుల పర్యవేక్షణలో వారు సూచించిన సులభతరమైన ఆసనాల్ని మాత్రమే సాధన చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్