కాటన్‌ బాల్స్‌ని ఇలా కూడా వాడచ్చు!

అమ్మాయిల బ్యూటీ కిట్‌లో ఉండే ముఖ్యమైన వస్తువుల్లో కాటన్‌ బాల్స్‌ కూడా ఒకటి. ముఖానికి రోజ్‌ వాటర్‌ రాసుకోవడానికైనా, వేసుకున్న మేకప్‌ తొలగించుకోవడానికైనా, నెయిల్‌ పాలిష్‌ని తొలగించుకునే క్రమంలో.. ఇలా అతివల సౌందర్య సంరక్షణలో ఇవి చాలా రకాలుగానే ఉపయోగపడతాయని చెప్పచ్చు.

Published : 22 Sep 2023 21:10 IST

అమ్మాయిల బ్యూటీ కిట్‌లో ఉండే ముఖ్యమైన వస్తువుల్లో కాటన్‌ బాల్స్‌ కూడా ఒకటి. ముఖానికి రోజ్‌ వాటర్‌ రాసుకోవడానికైనా, వేసుకున్న మేకప్‌ తొలగించుకోవడానికైనా, నెయిల్‌ పాలిష్‌ని తొలగించుకునే క్రమంలో.. ఇలా అతివల సౌందర్య సంరక్షణలో ఇవి చాలా రకాలుగానే ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇలా కేవలం బ్యూటీ విషయంలోనే కాదు.. ఈ కాటన్‌ బాల్స్‌ని ఇంట్లో మరిన్ని అవసరాల కోసం కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగంటే..!

ఇంటి అవసరాల కోసం..!

ఇంట్లో చీమల బెడదను తగ్గించుకోవాలంటే.. కొన్ని వేడి నీళ్లలో కొద్దిగా చక్కెర వేసి.. అందులో టీస్పూన్‌ బోరాక్స్‌ పొడి వేసి కలపాలి. ఇందులో ముంచిన కాటన్‌ బాల్‌ని చీమలున్న చోట పెడితే.. అవి చచ్చిపోతాయి. ఇతర కీటకాల్ని తొలగించడానికీ ఈ చిట్కా ఉపయోగించచ్చు.

ఇంట్లో సింక్‌, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, బాత్‌రూమ్‌.. వంటి పలుచోట్ల మూలల్లో జిడ్డుగా మారి, మురికి పేరుకుపోవడం మనం గమనిస్తుంటాం. అయితే ఎంత రుద్దినా ఆ జిడ్డు ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు కాటన్ బాల్‌ను బ్లీచింగ్‌ పౌడర్‌లో ముంచి మూలలకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచాలి. ఆపై రుద్దుతూ వేడినీటితో కడిగేస్తే సులభంగా జిడ్డు వదిలిపోతుంది.

కొన్ని చుక్కల వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ని కాటన్‌ బాల్‌పై వేసి వార్డ్‌రోబ్‌లో ఓ మూల ఉంచితే దుస్తులు సువాసనలు వెదజల్లుతాయి. అలాగే రిఫ్రిజిరేటర్‌లో నుంచి వచ్చే దుర్వాసనలు పోగొట్టడానికీ ఈ చిట్కాను పాటించచ్చు.

వంటింట్లో అప్పుడప్పుడూ దుర్వాసనలు రావడం మామూలే. ఇలాంటి సమయాల్లో కొన్ని కాటన్‌ బాల్స్‌ని ఏదైనా అత్యవసర నూనెలో (ఎసెన్షియల్ ఆయిల్) కాసేపు నానబెట్టి.. ఆ గిన్నెను ఓ మూలన ఉంచడం వల్ల ఫలితం ఉంటుంది.

సింక్‌ ట్యాప్‌, వాష్‌బేసిన్‌ ట్యాప్‌, సింక్‌ టైల్స్‌.. ఇలా నీళ్లు పడిన చోట తెల్లటి మరకలు పడుతుంటాయి. వాటిని స్క్రబ్బర్‌తో ఎంత రుద్దినా పోవు. అలాంటప్పుడు వెనిగర్‌, నీళ్లు సమపాళ్లలో తీసుకొని.. ఆ మిశ్రమంలో కాటన్‌ బాల్‌ని ముంచి మరకలు పడిన చోట అప్లై చేయాలి. కొన్ని నిమిషాలయ్యాక వాటిని కడిగేయడం లేదంటే మృదువైన గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

స్విచ్‌బోర్డులు, డోర్‌ నాబ్స్‌, డోర్‌ స్టాపర్స్‌.. వంటి చిన్న చిన్న వస్తువుల్ని శానిటైజ్‌ చేయడానికి పెద్ద పెద్ద క్లాత్స్‌ కంటే చిన్న కాటన్‌ బాల్స్‌ ఉపయోగిస్తే సులభంగా పని పూర్తవుతుంది.

విత్తనాలు నాటుకోవడానికి ముందుగా అవి మొలకెత్తాలంటే ఒక జార్‌లో ఆయా విత్తనాలు, కొన్ని కాటన్‌ బాల్స్‌ని ఉంచాలి. ఆపై మూత పెట్టి ఒకసారి జార్‌ను షేక్‌ చేస్తే విత్తనాలు, బాల్స్‌ కలిసిపోతాయి. ఇప్పుడు బాల్స్ తడిసేలా నీళ్లు పోయాలి. బాల్స్‌ తడిని లాక్ చేసి ఉంచడం వల్ల నాలుగైదు రోజులకు విత్తనాలు మొలకలొస్తాయి. ఆపై వాటిని తీసి కుండీలో, నేలలో నాటుకుంటే సరి!

ఎలుకలు, ఉడతలు.. వంటివి మీ గార్డెన్‌ను పాడుచేస్తుంటే.. వెనిగర్‌లో ముంచిన కొన్ని కాటన్‌ బాల్స్‌ని గార్డెన్‌లో అక్కడక్కడా వేయండి. సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్