చేతులతో డ్యాన్స్‌.. గ్లోబల్‌ అవార్డు తెచ్చిపెట్టింది!

డ్యాన్స్‌ అంటే మనకు తెలిసింది.. శరీరాన్ని లయబద్ధంగా కదిలించడం. కానీ శరీరాన్ని నిశ్చలంగా ఉంచి.. చేతులు, వేళ్లను అర్థవంతంగా కదిలిస్తే.. దాన్నే ‘టటంగ్ డ్యాన్స్‌’ అంటారు. అలాంటి విభిన్న నృత్య రీతిలో అంతర్జాతీయ పురస్కారం అందుకుంది ముంబయికి చెందిన.....

Updated : 13 Jun 2022 20:15 IST

(Photos: Screengrab)

డ్యాన్స్‌ అంటే మనకు తెలిసింది.. శరీరాన్ని లయబద్ధంగా కదిలించడం. కానీ శరీరాన్ని నిశ్చలంగా ఉంచి.. చేతులు, వేళ్లను అర్థవంతంగా కదిలిస్తే.. దాన్నే ‘టటింగ్‌ డ్యాన్స్‌’ అంటారు. అలాంటి విభిన్న నృత్య రీతిలో అంతర్జాతీయ పురస్కారం అందుకుంది ముంబయికి చెందిన 23 ఏళ్ల నిధి అచా. గత ఐదేళ్ల నుంచి ఈ డ్యాన్స్‌ స్టైల్‌ని అవపోసన పడుతోన్న ఆమె.. తన నైపుణ్యాలతో సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. ఇటీవలే తన డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ని ‘జామెట్రిక్ లేడీస్‌ టట్‌-2 కాంపిటీషన్‌’లో ప్రదర్శించి.. ఈ పోటీలో విజేతగా నిలిచింది నిధి. మన దేశం తరఫున ఇందులో పాల్గొన్న, ‘ప్రపంచంలోనే ఉత్తమ మహిళా టటింగ్ ఆర్టిస్ట్‌’గా ఈ పోటీలో ట్రోఫీ గెలిచిన ఏకైక ఇండియన్‌ ఆమే కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలో నిధి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ఏమిటీ డ్యాన్స్?

టటింగ్ డ్యాన్స్‌ అనేది ఓ స్ట్రీట్‌ డ్యాన్స్‌ స్టైల్‌. పాపింగ్‌ డ్యాన్స్‌ నుంచి ఇది పుట్టింది. ఇందులో భాగంగా.. చేతులు-చేతి వేళ్లు, కాళ్లు-కాలి వేళ్లు, శరీరం, ఇతర శరీర అవయవాలు.. గణిత ఆకృతులు, 90 డిగ్రీల కోణాల్లో కదిలిస్తూ లయబద్ధంగా డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ తరహా డ్యాన్స్‌ నైపుణ్యాలున్న వారు మన దేశంలో చాలామందే ఉన్నా.. తనదైన ప్రత్యేకతతో సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించుకుంది నిధి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ‘జామెట్రిక్‌ లేడీస్ టట్‌-2 కాంపిటీషన్‌’లో పాల్గొంది. మనదేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న ఏకైక టట్‌ డ్యాన్సర్‌ కూడా తనే! ఈ వేదికగా చైనా, రష్యా, బ్రిటన్‌తో పాటు దక్షిణ ఆసియా దేశాల పోటీదారులతో పోటీ పడి మరీ.. విజేతగా నిలిచిందామె. తద్వారా ‘ప్రపంచంలోనే ఉత్తమ మహిళా టటింగ్ ఆర్టిస్ట్‌’గా ట్రోఫీ అందుకుంది.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..!

23 ఏళ్ల నిధిది ముంబయిలోని కుర్లా అనే ప్రాంతం. ప్రస్తుతం Gozoop అనే కంపెనీలో అకౌంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్న్‌గా ఉన్న ఆమె.. గత ఐదేళ్లుగా టటింగ్ డ్యాన్స్‌ స్టైల్‌ని సాధన చేస్తోంది. ఇందులో రోజురోజుకీ మెలకువల్ని పెంచుకుంటూ పోతోన్న ఆమె.. పలు పోటీల్లోనూ తన సత్తా చాటుతోంది. అయితే ఇలాంటి వీధి నృత్యాన్ని అమ్మాయిలు ప్రదర్శిస్తామంటే సంప్రదాయ కుటుంబాలు చాలా వరకు ఒప్పుకోవు. కానీ తన తల్లిదండ్రులు మాత్రం ఎంతో ప్రోత్సహిస్తున్నారంటోంది నిధి.

‘టట్‌ డ్యాన్స్‌ అంటే వీధుల్లో ప్రదర్శించే నృత్యం. ఇందులో భాగంగా గార్డెన్స్‌, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలివ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు స్టూడియోల్లోనూ సాధన చేస్తాం. వేళాపాళా లేని టైమింగ్స్ వల్ల కొంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డా ఈ రంగంలోకి రాలేకపోతున్నారు. కొంతమంది విషయంలో సంప్రదాయ కట్టుబాట్లూ ఇందుకు అడ్డుపడుతున్నాయి. కానీ నా తల్లిదండ్రులు మాత్రం ముందు నుంచీ నన్నెంతో ప్రోత్సహిస్తున్నారు. నాన్నైతే వృత్తిరీత్యా ఆలస్యంగా ఇంటికొచ్చినా.. ఓపికతో నా వీడియోలు షూట్‌ చేస్తుంటారు. అంతేకాదు.. నా పెర్ఫార్మెన్స్‌ను విమర్శించడానికీ మొహమాటపడరు. నేను ఈ డ్యాన్స్‌లో ఆరితేరడానికి ఇదీ ఓ కారణమే!’ అంటోంది నిధి.

డ్యాన్స్ కాదు.. అదే నా లక్ష్యం!

ప్రస్తుతం ఓవైపు ఇంటర్న్‌గా కొనసాగుతూ.. మరోవైపు డ్యాన్స్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముంబయి అమ్మాయి.. సమాజ సేవలోనూ ముందుంది. అనాథలు, వృద్ధులు, నీడ లేని వారిని అక్కున చేర్చుకున్న ఓ స్వచ్ఛంద సంస్థతో మమేకమైంది నిధి. అయితే ఇన్ని పనుల్ని ఒకేసారి ఎలా బ్యాలన్స్‌ చేస్తున్నారని అడిగితే.. ‘ఇష్టంతో చేసే పనులెన్నైనా కష్టపడకుండా ఏకకాలంలో పూర్తిచేయచ్చు. నా సీక్రెట్‌ కూడా ఇదే! అంతర్జాతీయ పోటీలో గెలవడం ఆనందంగా ఉంది. అయితే దీన్నే నా ఫుల్‌టైమ్‌ కెరీర్‌గా మార్చుకోవాలన్న ఆలోచనలైతే ఇప్పటివరకు లేవు. సోషల్‌ మీడియా మేనేజర్‌గా, వలంటీర్‌గా నా కెరీర్‌ని మలచుకోవాలనుకుంటున్నా. అయితే స్ట్రీట్‌ డ్యాన్స్‌ స్టైల్‌ మన దేశంలో ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ లభిస్తోందని చెప్పచ్చు. అందుకే ఆసక్తి ఉన్న వాళ్లు దీన్నే మహదవకాశంగా భావించి సాధన చేయాలి. అమ్మాయైనా సరే.. అభిరుచి ఉంటే ఈ డ్యాన్స్‌ స్టైల్‌లో తమ నైపుణ్యాల్ని నిరూపించుకోవచ్చు..’ అంటూ సమాధానమిస్తోందీ ముంబయి డ్యాన్సర్‌. ప్రస్తుతం ట్యూటర్‌గా తన డ్యాన్స్‌ వీడియోల్ని రూపొందిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది నిధి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని