నువ్వు కోలుకోవడానికేనమ్మా.. ఇవన్నీ!
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి....
మాతృత్వం ప్రతి మహిళకు ఓ వరం! ఈక్రమంలో నవ మాసాలు మోసి బిడ్డను కనడం ఒకెత్తయితే.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర సమస్యల్ని ఎదుర్కోవడం మరో ఎత్తు! అయినా వీటన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తుంటుంది వెన్న లాంటి అమ్మ మనసు.
అయితే అమ్మైన సంతోషంలో ఎంత ఒత్తిడికైనా ఓర్చుకునే మహిళలు.. ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే పలు జాగ్రత్తల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. తద్వారా దాని ప్రభావం తల్లీబిడ్డలిద్దరిపై పడుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే పూర్వకాలం నుంచి పాటిస్తోన్న కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు బాలింతలు తు.చ. తప్పకుండా పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. కొత్తగా తల్లైన మహిళల ఆరోగ్యం కోసం మన పూర్వీకులు నిర్దేశించిన కొన్ని పద్ధతులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..
ఆహారమే ఔషధం!
ఎలాంటి అనారోగ్యాల నుంచి బయటపడాలన్నా ఆహారమే పరమౌషధం అంటుంటారు పెద్దలు. బిడ్డకు జన్మనిచ్చాక కూడా ఇది వర్తిస్తుంది. నిద్రలేమి, అధిక బరువు, ప్రసవానంతర ఒత్తిడి.. వంటి సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు బాలింతల్లో పాలు బాగా పడాలన్నా పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో నువ్వులు, మెంతులు/మెంతి ఆకులు, వెల్లుల్లి, మునక్కాడలు, ఆకుకూరలు, క్యారట్స్, బీట్‌రూట్, బీన్స్, పప్పులు.. ఇవన్నీ ప్రత్యుత్పత్తి అవయవాలను తిరిగి దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయి. హార్మోన్ల సమతుల్యతను ప్రేరేపిస్తాయి. ఇక ప్రసవానంతరం కొంతమంది మహిళల్లో గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వారు క్యాబేజీ, బంగాళాదుంప, క్యాలీఫ్లవర్.. వంటివి అస్సలు తినకూడదు. అది కూడా మితంగా తినడం, భోజనం తర్వాత తమలపాకులు నమలడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అయితే ఈ కాలపు మోడ్రన్ అమ్మాయిల్లో కొందరు ఇలాంటి ఆహారపుటలవాట్లను చాదస్తం అంటూ కొట్టిపడేస్తుంటారు. తమకు నచ్చిన ఆహారం తీసుకుంటుంటారు. దానివల్ల తాము త్వరగా కోలుకోకపోగా.. పాలు తాగే పిల్లలకూ పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలింతలు ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు.
మర్దన.. మంగళస్నానం!
బాలింతల్ని అటు శారీరక నొప్పులు, ఇటు మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి తోడు సిజేరియన్ అయిన తల్లుల్లో కుట్లలో నొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి అసౌకర్యాల్ని అధిగమించాలంటే మర్దన చక్కటి ఉపశమనం ఇస్తుందని చెబుతారు మన పెద్దవాళ్లు. ఈ క్రమంలో నువ్వులు, కొబ్బరి, ఆలివ్.. వంటి నూనెలతో నిపుణులు/ఇంట్లో వాళ్లతో నెమ్మదిగా మర్దన చేయించుకోవాలి. తద్వారా ఆయా శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇక పొట్టపై చేసే మర్దన వల్ల అది సాధారణ స్థితిలోకి వస్తుంది.. పొత్తి కడుపుపై మృదువుగా మర్దన చేయడం వల్ల ప్రత్యుత్పత్తి భాగాలు దృఢమవుతాయి. కుట్లు త్వరగా మానిపోతాయి.
ఇక మర్దన తర్వాత వేపాకులు వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తారు. గోరువెచ్చటి నీళ్లు పొత్తి కడుపు, కటి భాగాల్లో పడడం వల్ల డెలివరీ సమయంలో ఆయా భాగాల్లో తలెత్తే నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు. అలాగే వేపాకుల్లో సహజసిద్ధమైన యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. ఇవి కుట్లను త్వరగా నయం చేస్తాయి. అయితే ఇలా స్నానం చేసే క్రమంలో బయట దొరికే సబ్బులు కాకుండా శెనగపిండి, వెన్నతో తయారుచేసిన బాడీ స్క్రబ్‌ని ఉపయోగిస్తే చర్మం తిరిగి ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.
నడుం కట్టు.. అందుకే!
ప్రసవానంతరం పొట్ట పెరగడం సహజం. బిడ్డ పుట్టాక ఈ విషయంలో చాలామంది తల్లులు అసౌకర్యానికి, ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇందుకూ ఓ ఉపాయం కనిపెట్టారు మన పూర్వీకులు. అదే నడుం కట్టు! కాటన్ చీర/చున్నీని పొట్ట చుట్టూ గట్టిగా చుట్టుకోవడం వల్ల పొట్ట పెరగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే కడుపులోని గ్యాస్ కూడా క్రమంగా తొలగిపోతుంది. అంతేకాదు.. పొట్ట కండరాలు యథాస్థితికి రావడానికి, స్ట్రెచ్‌మార్క్స్‌ని తగ్గించుకోవడానికి.. ఇలా పలు విధాలుగా ఈ నడుం కట్టు బాలింతలకు మేలు చేస్తుంది. అయితే సిజేరియన్ అయిన మహిళలు కుట్లపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా ఈ కట్టు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ పార్టమ్ బెల్టులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చీర/చున్నీకి బదులు వాటిని కూడా వాడుకోవచ్చు.
ఇక వీటితో పాటు పాపాయికి పాలివ్వడం, నిపుణుల సలహా మేరకు చిన్నపాటి వ్యాయామాలు చేయడం.. వంటివి కూడా బాలింతలు త్వరగా కోలుకోవడానికి, వారిలో ప్రసవానంతర ఒత్తిడి దూరం చేయడానికి దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.