మోదీ కూడా ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారు!

సోషల్‌ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవడం పెద్ద విషయం కాదు. కానీ కొంతమంది చేసే పనులు, వాళ్ల స్ఫూర్తిదాయక మాటలు నచ్చి.. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ వాళ్ల సోషల్‌ మీడియా ఖాతాల్ని అనుసరిస్తుంటారు. మైసూరుకు చెందిన ప్రజ్ఞా కశ్యప్‌ కూడా అలాంటి అరుదైన అమ్మాయే!

Published : 03 Jan 2022 21:07 IST

(Photo: Instagram)

సోషల్‌ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవడం పెద్ద విషయం కాదు. కానీ కొంతమంది చేసే పనులు, వాళ్ల స్ఫూర్తిదాయక మాటలు నచ్చి.. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ వాళ్ల సోషల్‌ మీడియా ఖాతాల్ని అనుసరిస్తుంటారు. మైసూరుకు చెందిన ప్రజ్ఞా కశ్యప్‌ కూడా అలాంటి అరుదైన అమ్మాయే! ఇంతకీ ఈమె ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతోన్న ఆ సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఇంకెవరు? సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మరి, మోదీజీ ఫాలో అయ్యేంతగా ఆమె చేస్తోన్న పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరతరాలుగా సేవలోనే..!

ప్రజ్ఞా కశ్యప్‌.. 22 ఏళ్ల ఈ మైసూరు అమ్మాయి ప్రస్తుతం లా చదువుతోంది. సమాజ సేవ అంటే ఆమెకు ఎనలేని మక్కువ! అందుకే పదకొండేళ్ల వయసు నుంచే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటోంది. ఇలాంటి సేవా భావాన్ని తన కుటుంబం నుంచే పుణికిపుచ్చుకుంది ప్రజ్ఞ. తన తండ్రి, తాతయ్య తమ జీవితాలను సమాజ సేవకే అంకితం చేశారని.. వారి ప్రభావమే తనను సేవ వైపు మళ్లేలా చేసిందేమో అంటోందీ లా స్టూడెంట్.

మా అమ్మ, నాన్న, తాతయ్యల స్ఫూర్తితో చిన్నప్పటి నుంచీ నాక్కూడా సమాజ సేవ అంటే మక్కువ పెరిగింది. అందుకే 11 ఏళ్ల వయసు నుంచే వివిధ సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహిస్తోన్న పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ వస్తున్నా. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొంటుంటా. అలాగే చదువుకు నోచుకోని పేద పిల్లలకు, యువతకు ఉచితంగా క్లాసులు/కోర్సులు నిర్వహిస్తుంటా..’ అంటోంది ప్రజ్ఞ.

బహుముఖ ప్రజ్ఞాశాలి!

కేవలం చదువు, సేవే కాదు.. ఈ మైసూర్‌ అమ్మాయిలో మరెన్నో నైపుణ్యాలు దాగున్నాయి.

* ప్రజ్ఞ క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా! పలు వేదికల పైనా నృత్య ప్రదర్శనలిస్తుంటుంది. అంతేకాదు.. తను వీణ వాయించడంలోనూ దిట్టే!

* తన చేత్తో, సృజనతో అద్భుతమైన బొమ్మలు గీయడం ప్రజ్ఞకు అలవాటు! అంతేకాదు.. వాటిని సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తుంటుంది.

* ప్రకృతి అంటే ప్రాణమిస్తుంది ప్రజ్ఞ. ఈ క్రమంలోనే వీలు చిక్కినప్పుడల్లా పచ్చని చెట్లు, సెలయేళ్ల మధ్య సమయం గడుపుతుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితానికి సరిపడా సంతృప్తిని అందిస్తాయని చెబుతోంది.

* అటు చదువు, ఇటు సేవతో ఎంత బిజీగా ఉన్నా ధ్యానం చేయకుండా మాత్రం ఉండలేనంటోందీ టీనేజ్‌ సెన్సేషన్.

* ప్రముఖుల, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సోషల్‌ మీడియా పేజీల్ని ఫాలో అవడం, సందర్భానుసారం వాళ్లకు సంబంధించిన పోస్టులు చేయడంలోనూ ముందుంటుందీ యూత్‌ ఐకాన్.

మోదీజీ నా స్ఫూర్తి!

ఇలా తన సేవా కార్యక్రమాలు, తనలోని విభిన్న ఆసక్తుల గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంతోమందిని ఆకర్షించిన ప్రజ్ఞ.. దేశ ప్రధాని మోదీ మనసు గెలుచుకుంది. ఇలా ఈ అమ్మాయి సేవల్ని మెచ్చిన ఆయన.. ఆమెను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తెగ సంబరపడిపోయింది ప్రజ్ఞ.

‘మోదీజీ నన్ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారంటేనే చెప్పలేనంత ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. మీరు నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్యూ సర్! మీరు నా ప్రియతమ నేతే కాదు.. నా స్ఫూర్తి ప్రదాత కూడా!’ అంటోందీ మైసూర్‌ టీన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్