Samantha: మయోసైటిస్‌కు ఆ చికిత్స తీసుకుంటున్నా!
ఆరోగ్య సమస్యలు, వాటి నుంచి బయటపడే క్రమంలో తీసుకునే చికిత్సల గురించి బయటికి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కొంతమంది వీటి గురించి ధైర్యంగా బయటపెడుతూ ఎంతోమంది బాధితుల్లో.....
(Photos: Instagram)
ఆరోగ్య సమస్యలు, వాటి నుంచి బయటపడే క్రమంలో తీసుకునే చికిత్సల గురించి బయటికి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కొంతమంది వీటి గురించి ధైర్యంగా బయటపెడుతూ ఎంతోమంది బాధితుల్లో స్ఫూర్తి నింపుతుంటారు. టాలీవుడ్ అందాల తార సమంత ఇదే కోవకు చెందుతుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన వృత్తిపరమైన విషయాలే కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్నీ నిర్మొహమాటంగా పంచుకుంటుంది. గతేడాది తాను మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించిన సామ్.. దీన్నుంచి బయటపడే క్రమంలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తన ఆరోగ్య సమస్యను దూరం చేసుకునే క్రమంలో ప్రస్తుతం ‘హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ’ అనే మరో చికిత్స తీసుకుంటున్నట్లు తాజాగా పోస్ట్ పెట్టిందామె. ఇంతకీ ఏంటీ థెరపీ? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి...
ప్రతికూలతల్నీ పాజిటివ్‌గా తీసుకోవడంలో ముందుంటుంది టాలీవుడ్ బ్యూటీ సమంత. శరీరంలోని కండరాలపై ప్రతికూల ప్రభావం చూపే మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పటికీ.. ధైర్యంగా, సానుకూలంగా ఈ వ్యాధిని జయించే ప్రయత్నం చేస్తున్నానంటూ గతేడాది పోస్ట్ పెట్టింది సామ్. ఇక ఇప్పుడు ఇంకా ఈ వ్యాధితో పోరాడుతున్నానని, ఈ క్రమంలో ప్రస్తుతం ‘హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ’ చికిత్స తీసుకుంటున్నట్లు తాజాగా పోస్ట్ పెట్టిందీ అందాల తార.
ఆ థెరపీ తీసుకుంటున్నా!
తన 36వ పుట్టినరోజు సందర్భంగా.. కొన్ని ఫొటోలను కొలేజ్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సామ్. తన టీనేజ్ ఫొటో, వ్యాయామం చేస్తోన్న ఫొటో, నచ్చిన డెజర్ట్, గుర్రపు స్వారీ చేస్తోన్న ఫొటో, తన పెంపుడు కుక్కలు.. ఇలా కొన్ని ఫొటోలతో పాటు తాను ఆక్సిజన్ మాస్క్ ధరించిన మరో ఫొటోను, మరో స్లైడ్‌లో ప్రస్తుతం తాను తీసుకుంటోన్న హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీకి సంబంధించిన సమాచారాన్నీ జత చేసింది.
‘ఆటోఇమ్యూన్ వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలు, ఆటిజం.. మెదడు కైన గాయాలు.. వంటి దీర్ఘకాలిక సమస్యల్ని నయం చేసే శక్తిమంతమైన సాధనం ఈ హైపర్‌బేరిక్ థెరపీ. ఇది శరీరంలోని వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గించి.. డ్యామేజ్ అయిన కణజాలాల్ని తిరిగి రిపేర్ చేస్తుంది..’ అంటూ థెరపీ గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ. అయితే ఇలా సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. చాలామంది ‘ఫైటర్’, ‘స్ట్రాంగ్’ అంటూ ఈ ముద్దుగుమ్మ ధైర్యాన్ని, పాజిటివిటీని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో ఈ చికిత్స గురించి అంతర్జాలంలో శోధించి మరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు మూడు రెట్లు అధికంగా..!
గాలి ఒత్తిడి సాధారణం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉన్న ప్రత్యేకమైన ఛాంబర్‌లో ‘హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ’ అందిస్తారు. ఈ క్రమంలో మనం ఎక్కువ గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ మొత్తంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ చేరుతుంది. ఇది రక్తం ద్వారా ఆయా శరీర భాగాలకు సరఫరా అవుతుంది. దెబ్బతిన్న కణజాలానికి సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. దీంతో ఈ అదనపు ఆక్సిజన్ ఆయా శరీర భాగాల్లోని బ్యాక్టీరియాతో పోరాడి దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి రిపేర్ చేస్తుంది. తద్వారా వ్యాధిని/గాయాల్ని త్వరగా నయం చేసుకోవచ్చు. అలాగే బాధితులు సమస్య నుంచి కోలుకునే క్రమంలో వాళ్ల పరిస్థితిని బట్టి వైద్యులు ఈ థెరపీని వారానికోసారి లేదా వారానికి ఐదు రోజులు అందిస్తూ.. సుమారు 30 సెషన్స్ దాకా కొనసాగించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
ఏయే సమస్యలకు విరుగుడు?!
ఈ ఆక్సిజన్ థెరపీ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని ప్రేరేపించి పలు దీర్ఘకాలిక సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. తీవ్ర రక్తహీనత, రక్తనాళాల్లో గాలిబుడగలున్నప్పుడు (ఆర్టీరియల్ గ్యాస్ ఎంబాలిజం), కాలిన గాయాలు, ఉన్నట్లుండి వినికిడి కోల్పోవడం, రేడియేషన్ గాయం, మెదడుకు గాయమవడం, ఆటిజం, ఉన్నట్లుండి కంటి చూపు కోల్పోవడం, చర్మం లేదా ఎముకకు వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా ఆయా భాగాల్లోని కణజాలాలు చనిపోవడం, కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావం, నయం కాని గాయాలు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్.. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు/వ్యాధులకు ఈ థెరపీ అందిస్తారు.
దుష్ప్రభావాలూ ఉన్నాయ్!
హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ చాలా వరకు సురక్షితమైనదే అయినా.. కొంతమందిలో పలు దుష్ప్రభావాలూ తలెత్తే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు.
⚛ గాలి ఒత్తిళ్లలో హెచ్చుతగ్గుల కారణంగా కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుందట!
⚛ గాలి ఒత్తిళ్లలో మార్పుల వల్ల ఒక్కోసారి ఊపిరితిత్తులూ దెబ్బతినచ్చంటున్నారు నిపుణులు. దీన్నే ‘బారోట్రామా’గా పేర్కొంటున్నారు.
⚛ కేంద్ర నాడీ వ్యవస్థలో ఆక్సిజన్ స్థాయులు పెరిగిపోయి మూర్ఛ కూడా రావచ్చట!
⚛ ఇన్సులిన్‌తో మధుమేహానికి చికిత్స తీసుకునే బాధితుల్లో.. ఈ అధిక ఆక్సిజన్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయలు తగ్గే ప్రమాదం పొంచి ఉంటుందట!
⚛ అధిక ఆక్సిజన్ కారణంగా.. అరుదుగా జలుబు, ముక్కు దిబ్బడ.. వంటి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు.
కాబట్టి ఆయా దీర్ఘకాలిక అనారోగ్యాల్ని బట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ థెరపీ తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇక ఈ థెరపీలో భాగంగా.. వ్యక్తిగతంగా లేదంటే కొంతమంది బాధితులతో కలిపి చికిత్స తీసుకునేందుకు వీలుగా వేర్వేరు ఛాంబర్లుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.