Gulabi Gang: లండన్‌ మ్యూజియంలో ఆ ‘గులాబీ’ చీర!

మహిళల్ని హింసించడం, వారి హక్కుల్ని కాలరాయడం.. ఉత్తరాదిన చాలా గ్రామాల్లో మహిళల పట్ల ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి చూసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంపత్‌పాల్‌ దేవి. భర్త, అత్తింటి వారి చేతుల్లో దెబ్బలు తింటూ హింసను మౌనంగా భరిస్తోన్న ఆ మహిళ వేదన ఆమెను...

Published : 21 Mar 2023 12:56 IST

మహిళల్ని హింసించడం, వారి హక్కుల్ని కాలరాయడం.. ఉత్తరాదిన చాలా గ్రామాల్లో మహిళల పట్ల ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇలాంటి సంఘటనే ఒకటి చూసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంపత్‌పాల్‌ దేవి. భర్త, అత్తింటి వారి చేతుల్లో దెబ్బలు తింటూ హింసను మౌనంగా భరిస్తోన్న ఆ మహిళ వేదన ఆమెను ఆలోచింపజేసింది. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘గులాబీ గ్యాంగ్‌’. ‘మహిళలే మహిళలకు అండగా నిలబడగలర’న్న సిద్ధాంతాన్ని చాటుతూ మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతోన్న ఈ కమ్యూనిటీ ప్రస్తుతం దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. ఇక ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుందీ మహిళా గ్యాంగ్‌. మహిళా సాధికారతను చాటేలా వీరు ధరించే గులాబీ రంగు చీరకు తాజాగా అరుదైన గుర్తింపొచ్చింది. త్వరలోనే ఈ చీరను లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ది డిజైన్‌ మ్యూజియం’లో ప్రదర్శించనున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో సంపత్‌పాల్‌ ప్రారంభించిన ఈ మహిళా కమ్యూనిటీ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

ఉత్తరప్రదేశ్‌లోని తైరీ అనే గ్రామంలో పుట్టిపెరిగిన సంపత్‌పాల్‌.. పెళ్లి తర్వాత చిత్రకూట్‌ జిల్లా రౌలీ అనే గ్రామంలో స్థిరపడింది. అక్కడ పురుషాధిపత్యం ఎక్కువ. భర్త, అత్తింటి వారి చేతుల్లో గృహహింస, ఇతర వేధింపులతో సతమతమవుతూ అక్కడి కొందరు మహిళలు నిత్యం నరకం చూస్తుంటారు. ఓసారి ఓ మహిళ ఇలాగే వేధింపులకు గురవడం ప్రత్యక్షంగా చూసింది సంపత్‌పాల్.

ఆ వేధింపులకు చలించిపోయి..!

ఓ భర్త తన భార్యను కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. ఆమె వద్దని వేడుకున్నా తన హింసను మాత్రం ఆపట్లేదతను. అయితే మరుసటి రోజు అదే మహిళ మరో ఐదుగురు మహిళలతో కలిసి వచ్చి కర్రలతో తన భర్తపై దాడి చేయడంతో ఆమె ధైర్యాన్ని చూసి కంగుతినడం ఆ భర్త వంతైంది. నిజానికి ఆ బాధితురాలి వెనకున్న ఆ ధైర్యం మరెవరో కాదు.. సంపత్‌పాల్. చిన్నతనం నుంచి ఆమెలో మహిళాభ్యుదయ భావాలు ఎక్కువ. ఆ మహిళ ఒక్కర్తే కాదు.. తనలాగే చాలామంది ఇలాంటి హింసను మౌనంగా భరిస్తున్నారని తెలుసుకున్న ఆమె.. ఇలాంటి మహిళలందరినీ అపర కాళికలుగా మార్చాలనుకుంది. మహిళల అణచివేతకు చరమగీతం పాడుతూ.. వారి హక్కుల్ని పరిరక్షించే గొంతుక కావాలనుకుంది. ఈ ఆలోచనలే ఆమెను 2006లో ‘గులాబీ గ్యాంగ్‌’ పేరుతో మహిళా కమ్యూనిటీని ప్రారంభించేలా చేశాయి. ఆపై క్రమంగా పదుల సంఖ్యలో మహిళలు ఈ బృందంలో చేరడంతో నెలల వ్యవధిలోనే ఇది బలమైన మహిళా కమ్యూనిటీగా ఎదిగింది.

స్వీయ రక్షణ విద్యలు..!

‘మహిళలే మహిళలకు అండగా నిలబడగలుగుతారు.. అన్ని విషయాల్లో వారిని ముందుండి నడిపించగలుగుతారు..’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు సంపత్‌పాల్‌. ఇదే సూత్రాన్ని తన ‘గులాబీ గ్యాంగ్‌’ బృందానికీ వర్తింపజేస్తున్నారామె. ఈ 17 ఏళ్ల వ్యవధిలో తన మహిళా కమ్యూనిటీని దేశంలోని ప్రతి రాష్ట్రానికి విస్తరించడమే కాదు.. ఇతర దేశాల్లోనూ ఏర్పాటుచేసి.. అక్కడి మహిళలకూ అండగా నిలుస్తున్నారామె. ఈ క్రమంలో పలు కార్యక్రమాల ద్వారా.. స్వీయ రక్షణ విద్యలతో స్త్రీలలో ధైర్యాన్ని, బలాన్ని నింపడమే కాదు.. మహిళా హక్కుల పైనా వారిలో అవగాహన పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ మహిళా కమ్యూనిటీలో సుమారు 11 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఓ యూనిఫాం కూడా పెట్టారు సంపత్‌పాల్‌. గులాబీ రంగు చీర, అదే రంగు బ్లౌజ్‌తో పాటు లాఠీ సైజులో ఉన్న ఓ కర్ర కూడా అందిస్తున్నారామె. ఆ బృందంలో భాగమైన మహిళలకు ఈ కర్రతో స్వీయ రక్షణ పాఠాలు కూడా చెబుతున్నారీ డేరింగ్‌ లేడీ.

ఆమె ధైర్యానికి మచ్చుతునకలు!

‘స్త్రీలపై ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదం’టోన్న సంపత్‌పాల్‌.. తనదాకా వచ్చిన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. ఓసారి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమెపై అక్కడి పోలీస్‌ అధికారి ఒకరు దుర్భాషలాడి దాడి చేయబోయాడు. దాంతో ఆమె తన లాఠీతో అతనికి బుద్ధి చెప్పింది. ఇక మరో సందర్భంలో.. తన ఊరి రోడ్ల దుస్థితి గురించి ఓ ప్రభుత్వ అధికారిని నిలదీసి.. అత్యవసరంగా వాటిని మరమ్మతు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఇలా ఆమె తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ తోటి మహిళల్లో స్ఫూర్తి నింపిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

‘స్ఫూర్తిదాయక మహిళ’గా!

తన మహిళా కమ్యూనిటీతో, అవగాహన కార్యక్రమాలతో మహిళల అభ్యున్నతికి పాటుపడుతోన్న సంపత్‌పాల్‌ సేవల్ని గుర్తించిన ‘ది గార్డియన్‌’ పత్రిక ఆమెను ‘ప్రపంచంలోనే వందమంది అత్యంత ప్రభావశీల, స్ఫూర్తిదాయక మహిళల జాబితా’లో చోటు కల్పించి గౌరవించింది. ఫ్రాన్స్ జర్నలిస్ట్ అన్నే రాసిన సంపత్‌పాల్ జీవిత గాథను స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్.. వంటి భాషల్లో అనువదించారు. ఇదేవిధంగా ‘పింక్‌ శారీస్‌’ పేరుతో యూకే ఫిల్మ్‌ మేకర్ రూపొందించిన చిత్రం పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. అవార్డులూ అందుకుంది. మరోవైపు హిందీ ‘బిగ్‌బాస్‌ సీజన్‌-6’లోనూ పాల్గొన్నారు సంపత్‌పాల్.


చీరకు దక్కిన గుర్తింపు!

ఇక తాజాగా ఆమె కమ్యూనిటీకి మరో అరుదైన ఘనత దక్కింది. ‘గులాబీ గ్యాంగ్‌’ మహిళలు యూనిఫాంగా ధరించే గులాబీ రంగు చీరను లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ది డిజైన్‌ మ్యూజియం’లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
‘మా మహిళా ఉద్యమం విదేశాలకు విస్తరించడం చాలా సంతోషంగా ఉంది. 2008లో ఫ్రాన్స్‌ మా సేవల్ని గుర్తించింది. ఇప్పుడు మా యూనిఫాం పంపమని లండన్‌ నుంచి పిలుపొచ్చింది. డిజైన్‌ మ్యూజియం కోసం గులాబీ రంగు చీర, బ్లౌజ్‌, కర్ర.. వంటివన్నీ పంపించబోతున్నా. వీటిని ఈ ఏడాది మేలో ఆ మ్యూజియంలో ఏర్పాటుచేయబోయే ‘ఆఫ్‌బీట్‌ శారీ’ అనే భారతీయ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు..’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు సంపత్‌పాల్. ఆమె గతంలోనే  రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. అయితే కాంగ్రెస్‌ తరఫున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఆపై బీజేపీలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్