Solar Warrior: కిరాణా కొట్టు నుంచి ఆ కంపెనీ సీఈఓగా ఎదిగింది!

‘మనసులో సాధించాలన్న తపన ఉంటే.. ఏదీ మనల్ని ఆపలేదు..’ అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. రాజస్థాన్‌కు చెందిన రుకమ్నీ దేవి కటారా కూడా ఇందుకు మినహాయింపు కాదు. 13 ఏళ్లకే పెళ్లై, 16 ఏళ్లకే తల్లైన ఆమె.. గృహిణిగా ఇంటికే పరిమితమవ్వాలని కోరుకోలేదు. ‘వ్యాపారం నీకెందుకు? హాయిగా ఇంటిని చక్కదిద్దుతూ....

Published : 23 Apr 2022 18:03 IST

(Photos: Facebook)

‘మనసులో సాధించాలన్న తపన ఉంటే.. ఏదీ మనల్ని ఆపలేదు..’ అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. రాజస్థాన్‌కు చెందిన రుకమ్నీ దేవి కటారా కూడా ఇందుకు మినహాయింపు కాదు. 13 ఏళ్లకే పెళ్లై, 16 ఏళ్లకే తల్లైన ఆమె.. గృహిణిగా ఇంటికే పరిమితమవ్వాలని కోరుకోలేదు. ‘వ్యాపారం నీకెందుకు? హాయిగా ఇంటిని చక్కదిద్దుతూ పిల్లల్ని చూసుకోక!’ అన్నా అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. తన పట్టుదలకు పర్యావరణ పరిరక్షణను జోడించి ఓ ఎకో-ఫ్రెండ్లీ సంస్థనే స్థాపించిందామె. దీని ద్వారా చదువు లేని ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు తన వంతుగా పర్యావరణాన్ని కాపాడుతూ గ్రీన్‌ వారియర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ తపనే ఆమెను ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా ‘నేషనల్‌ జియోగ్రాఫిక్స్‌ వన్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమానికి నామినేట్‌ చేసింది. మరి, ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకొనే రుకమ్ని.. ఇంత పెద్ద కంపెనీని ఎలా స్థాపించారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని దుంగార్‌పూర్‌ అనే చిన్న గ్రామం రుకమ్నిది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పదమూడేళ్ల ప్రాయంలోనే పెళ్లి చేసేశారు. మూడేళ్లు తిరిగే సరికి ఓ బిడ్డకు తల్లైందామె. అయితే పెళ్లయ్యాక భర్తతో కలిసి ఇంటి వద్దే ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగించేది రుకమ్ని. కానీ అలా ‘నలుగురిలో నారాణయ’ అన్నట్లుగా జీవించడం ఆమెకు నచ్చలేదు. ఏదో సాధించాలన్న తపన ఆమెను అనునిత్యం వెంటాడేది. దీనికి తోడు ఆమె అత్తింటి వారు ‘వ్యాపారం నీకెందుకు? ఇంటి పట్టున ఉంటూ పిల్లల్ని చూసుకోక!’ అన్న మాటలు తనలో పట్టుదలను మరింతగా పెంచాయని చెబుతున్నారు రుకమ్ని.

పర్యావరణహితం కోరి..!

సాధారణంగా విద్యుత్‌ తయారు కావాలంటే నీరు, బొగ్గు.. వంటి సహజ వనరుల్ని ఉపయోగించుకోవాలి. పైగా మన దేశంలో బొగ్గుతో తయారయ్యే విద్యుత్తే ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో పాటు.. పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుంది. ఈ విషయం రుకమ్నికి మింగుడు పడలేదు. ముందు నుంచీ పర్యావరణ పరిరక్షణ అంటే మక్కువ చూపే ఆమె.. ఈ దిశగా అవకాశం వస్తే ఏదైనా చేయాలనుకుంది. అదే సమయంలో ఐఐటీ ముంబయి ప్రొఫెసర్‌, సౌర విద్యుత్‌ నిపుణులు అయిన చేతన్‌ సోలంకి.. తాను తయారుచేసే సౌర విద్యుత్‌ దీపాలను ఉదయ్‌పూర్‌ చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకునే పిల్లలకు అందించడానికి అన్వేషణ మొదలుపెట్టారు. ఈ బాధ్యతల్ని మహిళకు అప్పగించాలనుకున్న ఆయన.. రుకమ్నిని ఇందుకోసం ఎంపిక చేశారు. దాంతో అప్పటివరకు ఇంటికే పరిమితమైన ఆమె.. సోలంకి అప్పగించిన పనుల రీత్యా తొలిసారి గ్రామం దాటి బయట అడుగుపెట్టింది. అలా మొదలైన ఆమె సోలార్‌ ప్రయాణం నేటికీ దిగ్విజయంగా కొనసాగుతోందని చెప్పచ్చు.

‘దుర్గా ఎనర్జీ’ ఆశయం అదే!

పర్యావరణ స్పృహ, సౌర విద్యుత్‌ దీపాల పంపిణీ.. ఆమె మనసును పూర్తిగా సౌర విద్యుత్‌ శక్తి వైపు మళ్లించాయి. ఈ క్రమంలోనే దేశంలో సౌర విద్యుత్‌ విప్లవం సృష్టించాలనుకుంది రుకమ్ని. ఆ దిశగా అడుగులు వేసేందుకే 2017లో తన గ్రామంలోనే ‘దుర్గా ఎనర్జీ’ పేరుతో ఓ సంస్థను స్థాపించిందామె. సౌర విద్యుత్‌ ప్యానల్స్‌ని తయారుచేసి వాటిని ఇళ్లు, స్కూళ్లు, ఇతర వ్యాపార సముదాయాలకు అందించడమే దీని ముఖ్యోద్దేశం. ఇందుకు ఐఐటీ ముంబయి, రాజస్థాన్‌ ప్రభుత్వం తమ వంతు సహకారం అందించాయి. అక్కడి ఓ పురాతన పాఠశాలను ఈ సంస్థ కార్యకలాపాల కోసం కేటాయించింది ప్రభుత్వం. అలాగే మరో టెలికాం సంస్థ కొంత డబ్బు, ప్యానల్స్‌ తయారీకి అవసరమైన సామగ్రిని అందించింది. ఇలా కార్యకలాపాలు మొదలుపెట్టినప్పట్నుంచి నేటి వరకు సుమారు 3 లక్షలకు పైగానే సౌర విద్యుత్‌శక్తి ప్యానల్స్ను రూపొందించిందీ సంస్థ.

అక్కడందరూ మహిళలే!

తన సంస్థ ద్వారా తానొక్కర్తే ఎదగడం కంటే మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తే వారికీ చేయూతనందించినట్లవుతుందని ఆలోచించింది రుకమ్ని. ఈ క్రమంలోనే తన సంస్థ కార్యకలాపాల్లో సుమారు 40 మంది మహిళల్ని భాగం చేశానంటోందామె.
‘నేను కిరాణా కొట్టు నడిపే సమయంలో మా గ్రామంలోని మహిళలకు సూక్ష్మ రుణాలు ఇవ్వడం, చిన్న చిన్న సహకార సంఘాలు ఏర్పాటుచేయడం.. వంటివి చేసేదాన్ని. అలా ఇక్కడి మహిళలతో నాకు చక్కటి స్నేహబంధం ఏర్పడింది. ఇదే నా సంస్థ నెలకొల్పిన సమయంలో నాకు ఉపయోగపడింది. సౌర ప్యానల్స్‌ తయారీకి ఈ మహిళల్నే నేను ఎంచుకున్నా. వారిలో ఏ ఒక్కరూ పాఠశాల దశ కూడా దాటలేదు. అయినా అప్పగించిన పనిని శ్రద్ధతో, నిబద్ధతతో చేయగలరు. ఇలా తపన ఉంటే తమ కాళ్లపై తాము నిలబడగలమని నిరూపించారు మా వద్ద పనిచేసే మహిళలు!’ అంటూ చెప్పుకొచ్చిందామె. పర్యావరణ పరిరక్షణ, విద్య-సాంకేతిక పరిజ్ఞానం నోచుకోని మహిళలకు ఉపాధి కల్పించడం.. ఈ రెండు లక్ష్యాలతో మొదలుపెట్టిన తన సంస్థకు ఇన్ని పేరు ప్రఖ్యాతులు వస్తాయని కలలో కూడా అనుకోలేదంటోంది రుకమ్ని.

ఆమె గాథ.. షార్ట్‌ ఫిల్మ్‌గా..!

‘దుర్గా ఎనర్జీ’ తయారుచేసే సౌర ప్యానల్స్‌ ఒక్కొక్కటి 2.5-10 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. అంటే.. ఈ కరెంట్‌తో టేబుల్‌ ఫ్యాన్‌, కంప్యూటర్‌, టీవీ.. వంటివి కొన్ని గంటల పాటు నడిపించుకోవచ్చు. ఇక అక్కడి గ్రామాల్లో ఒక్కో ఇంట్లో 20 నుంచి 100 వాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్యానల్స్‌ని అమర్చుకుంటారని చెబుతున్నారు రుకమ్ని. ఇలా తన సంస్థతో అటు పర్యావరణాన్ని కాపాడుతూ.. ఇటు దేశ ప్రగతిలో తన వంతు పాత్ర పోషిస్తోన్న రుకమ్ని.. ఈ ఏడాది ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌ ప్రారంభించిన ‘వన్‌ ఆఫ్‌ ఛేంజ్’ క్యాంపెయిన్‌కు నామినేట్‌ అయింది. ఇందులో భాగంగా తమ చేతలతో ప్రపంచ గతిని మారుస్తోన్న కొంతమంది వ్యక్తుల విజయగాథల్ని లఘుచిత్రాల రూపంలో ప్రదర్శించనున్నారు. అందులో రుకమ్ని సక్సెస్‌ స్టోరీ కూడా షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో రూపొందుతోంది. తద్వారా మరెంతోమందికి చేరువై ఆదర్శంగా మారనుందీ సోలార్‌ వారియర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్