Miss Universe Singapore: ఈ అందాల రాశి గురించి మీకివి తెలుసా?

అందాల కిరీటం అందుకోవాలంటే కేవలం బాహ్య సౌందర్యమే కాదు.. అంతః సౌందర్యమూ కీలకమే! అలాంటి అందమైన మనసుకే ఈ ఏటి ‘మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌’ టైటిల్‌ దక్కింది. ఆమే.. నందితా బన్నా. తను మన తెలుగమ్మాయి కావడం మరో విశేషం.

Published : 19 Sep 2021 18:19 IST

(Photo: Instagram)

అందాల కిరీటం అందుకోవాలంటే కేవలం బాహ్య సౌందర్యమే కాదు.. అంతః సౌందర్యమూ కీలకమే! అలాంటి అందమైన మనసుకే ఈ ఏటి ‘మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌’ టైటిల్‌ దక్కింది. ఆమే.. నందితా బన్నా. తను మన తెలుగమ్మాయి కావడం మరో విశేషం. ఈ అందాల పోటీల వేదికగా రేసిజం (జాత్యంహంకారం)పై గళమెత్తిన నందిత.. తెర వెనుక చిన్నారుల అభివృద్ధి/సంక్షేమమే ధ్యేయంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది. తుది పోటీల్లో ఏడుగురిని వెనక్కి నెట్టి మరీ అందాల కిరీటం చేజిక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

* నందితా బన్నా.. 21 ఏళ్ల ఈ అందాల రాశి పుట్టిపెరిగిందంతా సింగపూర్‌లోనే! అయితే ఆమె అమ్మానాన్నలది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. పాతికేళ్ల క్రితమే వాళ్లు సింగపూర్‌లో స్థిరపడ్డారు.

* పుట్టినప్పట్నుంచి సింగపూర్‌లోనే ఉంటోన్నా.. తన రక్తంలోనే తెలుగు మూలాలున్నాయంటోందీ సొగసరి. ఇందుకు ప్రతిగా తన ఇన్‌స్టా పేజీలో తన పేరుని ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ రాసుకుంది.

* ప్రస్తుతం సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చదువుతోన్న ఈ తెలుగమ్మాయికి.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం అలవాటు. అలా ప్రస్తుతం కోడింగ్‌ నేర్చుకుంటున్నానంటోంది. వంట చేయడం, స్కేటింగ్‌ అంటే తనకు అమితమైన ఇష్టమట!

* ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ మోడల్‌గానూ కొనసాగుతోంది నందిత. ఈ క్రమంలోనే పలు ప్రకటనల్లోనూ భాగమైంది.

* డ్యాన్స్‌ అంటే తనకు విపరీతమైన మక్కువ అంటోందీ అందాల రాశి. ఈ క్రమంలోనే స్కూల్లో చదువుకునే రోజుల్లో విభిన్న డ్యాన్స్‌ కన్సర్ట్‌లలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది నందిత.

* ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు ఉద్యోగం కూడా చేసింది నందిత. ‘The Pique Lab Learning Centre’లో పార్ట్‌టైమ్‌ డేటా అసిస్టెంట్‌గా, అక్కడి ఓ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ క్లబ్‌కి ఫుల్‌టైమ్‌ సెక్రటరీ జనరల్‌గానూ కొన్ని నెలల పాటు విధులు నిర్వర్తించింది.

* సేవలోనూ తానెప్పుడూ ముందే ఉంటానంటోందీ బ్యూటీ. ప్రస్తుతం ‘Care Corner Singapore’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్న నందిత.. ఈ క్రమంలో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మెంటార్‌గా వ్యవహరిస్తూ.. వారి అభివృద్ధికి దోహదం చేసే పలు నైపుణ్యాలు నేర్పుతోంది.

* అందాల పోటీలపై మక్కువతో ఈ ఏటి ‘మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌’ కంటెస్ట్‌లో పాల్గొని తుది పోటీలకు అర్హత సాధించింది. తొలిసారిగా వర్చువల్‌గా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో.. తుది పోరులో భాగంగా ఏడుగురితో పోటీ పడిన ఆమె.. అందరినీ వెనక్కి నెట్టి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ వేదికగా సింగపూర్‌లో వేళ్లూనుకుపోయిన రేసిజం (జాత్యహంకార ధోరణి)పై తన స్పందనను వినిపించింది.

* డిసెంబర్‌ 2020-జనవరి 2021 వోగ్‌ సింగపూర్‌ ఎడిషన్‌ కవర్‌ పేజీ పైనా దర్శనమిచ్చింది నందిత.

ఇలా తన అందం, ఆత్మసౌందర్యంతో ఈ ఏటి ‘మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌’గా నిలిచిన నందిత.. డిసెంబర్‌లో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొనబోతోంది. మరి, అక్కడా టైటిల్‌ నెగ్గి అటు తన దేశానికి, ఇటు తెలుగు వారికీ మరోసారి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ నందిత!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్