తండ్రికి తగ్గ తనయ..
close
Updated : 04/12/2021 21:05 IST

తండ్రికి తగ్గ తనయ..!

(Photo: Instagram)

దేశంలో కొవిడ్‌ రెండో దశ ముప్పు అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. ఓవైపు కొవిడ్‌ కేసులు పెరిగిపోవడంతో టెస్టుల నిర్వహణ కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే సామాన్యులకు గుదిబండే! ఇలాంటి ప్రతికూలతలన్నీ పాతికేళ్ల అవనీ సింగ్‌ను ఆలోచనలో పడేశాయి. అందరిలా మిన్నకుండకుండా నలుగురి కోసం నడుం బిగించేలా చేశాయి. ఫలితంగా ఓ హెల్త్‌ స్టార్టప్‌ ప్రారంభించి సామాన్యులకు తక్కువ ధరకే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించడం మొదలుపెట్టిందామె. ఆ తర్వాత తన వ్యాపారాన్ని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లకూ విస్తరించింది. ఈ క్రమంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది అవని. ఇలా అందరి ఆరోగ్యం కోసం ఆమె పడిన ఆరాటమే ఆమెను తాజాగా విడుదల చేసిన ‘బ్లూమ్‌బర్గ్‌ వన్స్‌ టు వాచ్‌ గ్లోబల్‌ – 50’ జాబితాలో చోటు దక్కించుకునేలా చేసింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ కొవిడ్‌ వారియర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

అవనీ సింగ్‌.. స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ అధినేత అజయ్‌ సింగ్‌ ముద్దుల కూతురు. తరగని ఆస్తిపాస్తులున్నా, తండ్రి పేరు ప్రఖ్యాతులతో కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటుంది. ఈ క్రమంలోనే స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ పాలసీ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి భారత్‌లో అడుగుపెట్టిందామె. తన ప్రజ్ఞతో గతేడాది దిల్లీలోని McKinsey కంపెనీలో అనలిస్ట్‌గా ఉద్యోగం కూడా తెచ్చుకుంది.

ఆ ఆలోచనల్లోంచే పుట్టింది!

అయితే అదే సమయంలో దేశంలో కరోనా రెండో దశ మొదలైంది. కేసులు పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. పెద్దలంతా ఇంటి నుంచే పనిచేయడం మొదలుపెట్టారు. అలా అవని కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే పరిమితమైంది. ఇంట్లో ఎలా ఉన్నా బయట మాత్రం కొవిడ్‌కు సంబంధించిన ప్రతికూల పరిస్థితులు తెలుసుకొని చలించిపోయిందామె. కేసులు పెరగడం, నిర్ధారణ పరీక్షల కొరత ఏర్పడడం, ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర ఆకాశాన్నంటడం.. ఇవన్నీ అవనిని ఆలోచనలో పడేశాయి. ఫలితంగా గతేడాది నవంబర్‌లో ‘స్పైస్‌ హెల్త్‌’ అనే స్టార్టప్‌ ప్రారంభించడంలో ఊతమిచ్చాయి.

అదే మా ప్రత్యేకత!

‘స్టార్టప్‌ అయితే ప్రారంభించాలనుకున్నా. కానీ ఆరోగ్య రంగం గురించి నాకు బొత్తిగా అవగాహన లేదు. అందుకే దీనిపై పట్టు పెంచుకోవడానికి ఎంతోమంది నిపుణులతో మాట్లాడా. నేను చదువుకున్న స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనూ చర్చించా. ఇలా పూర్తి అవగాహన పెంచుకున్నాకే ICMR, NABL అనుమతితో ‘స్పైస్‌ హెల్త్‌’ సంస్థను ప్రారంభించా. ఇందులో భాగంగానే దిల్లీ, హరియాణా, మహారాష్ట్రల్లో తొలి విడత మొబైల్‌ ల్యాబ్స్‌ని అందుబాటులోకి తెచ్చా. బయట ల్యాబ్స్‌లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధర రూ. 3 వేలకు పైగానే ఉండేది. కానీ మా వద్ద రూ. 499కే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించే వాళ్లం. ఇతర ల్యాబ్స్‌ టెస్టు ఫలితాల్ని ఇవ్వడానికి 24-48 గంటల సమయం తీసుకుంటే.. మేము కేవలం ఆరు గంటల్లోనే ఫలితాలు ఇచ్చే వాళ్లం. ఇలా రోజుకు 20-50 వేల దాకా టెస్టులు నిర్వహించాం.. మా మొబైల్‌ ల్యాబ్స్‌ని క్రమంగా మారుమూల ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్స్‌, గ్రామాలకూ విస్తరించాం. ఇలా ఇప్పటివరకు దేశంలోని పది రాష్ట్రాల్లో 18 టెస్టింగ్‌ ల్యాబ్స్‌ని అందుబాటులోకి తెచ్చాం.. సుమారు 50 లక్షలకు పైగానే కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాం.. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వంతో, కుంభమేళా సమయంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేశాం..’ అంటూ తన కంపెనీ సేవల గురించి చెప్పుకొచ్చింది అవని.

టీకా పంపిణీలోనూ ముద్ర!

స్పైస్‌ హెల్త్‌ కేవలం ఆర్టీపీసీఆర్‌ టెస్టులకే పరిమితం కాలేదు.. వ్యాక్సిన్‌ రవాణాతో పాటు టీకా సెంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా చేపడుతోంది. ‘ప్రస్తుతం మా వద్ద వ్యాక్సిన్లను నిల్వ ఉంచడానికి కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. SpiceXpress పేరుతో మా విమానయాన సంస్థ ద్వారా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను దేశవిదేశాలకు పంపిణీ చేశాం. ప్రస్తుతం టీకాలనూ పంపిణీ చేస్తున్నాం. అంతేకాదు.. ఐదు రాష్ట్రాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లనూ ఏర్పాటుచేసి అక్కడి వారికి టీకా అందిస్తున్నాం..’ అంటూ చెప్పుకొచ్చిందామె. ఇక కొవిడ్‌ తర్వాత కూడా తమ సేవలు కొనసాగుతాయని.. ఈ క్రమంలో TB, HIV.. వంటి నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతోంది అవని.

పైలట్‌ పాఠాలు..!

ఈ సంస్థ ప్రారంభించడానికి ముందు ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా పొందింది అవని. అయితే ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్‌ మాత్రం స్పైస్‌ హెల్త్‌ మీదే ఉందని చెబుతోంది. ‘విమానయానం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఇంటికి వచ్చినప్పుడల్లా నాన్నతోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని. ఆయన దగ్గర్నుంచి పైలట్‌ పాఠాలు నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ ఫ్లయింగ్‌ క్లబ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. గతేడాది ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా పొందాను. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు.. ప్రస్తుతానికి మాత్రం నా పూర్తి సమయాన్ని స్పైస్‌ హెల్త్‌ అభివృద్ధికే కేటాయిస్తున్నా..’ అంటోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

ఇలా చిన్న వయసులోనే సొంతంగా కంపెనీని స్థాపించి.. తన సృజనాత్మకతతో సంస్థను విజయపథంలో నడిపిస్తోన్న అవని ‘ఏషియా పసిఫిక్‌ స్టీవ్‌ అవార్డ్స్‌’లో భాగంగా ‘గోల్డ్‌ స్టీవ్‌’ పురస్కారం గెలుచుకుంది. ఇక తాజాగా ‘బ్లూమ్‌బర్గ్‌ వన్స్‌ టు వాచ్‌ గ్లోబల్‌ - 50’ జాబితాలోనూ స్థానం సంపాదించింది.


Advertisement

మరిన్ని