ఈ అందగత్తెలా మారాలని ఐదు కోట్లు ఖర్చు పెట్టింది.. కానీ చివరికి..!

అభిమాన తారల్ని ఆరాధించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. పచ్చబొట్టు పొడిపించుకోవడం, వాళ్ల స్టైల్‌ని ఫాలో అవడం, గది నిండా పోస్టర్లు అతికించుకోవడం.. ఇలా అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకు ఎలాంటి సమస్యా ఉండదు. కానీ అది హద్దు దాటితేనే ఇదిగో ఇలా ‘వెర్రి వేయి రకాల’న్నట్లుగా ఉంటుంది. బ్రెజిల్‌కు చెందిన జెన్నిఫర్‌ పంప్లోనా....

Published : 14 Jul 2022 12:47 IST

(Photos: Instagram)

అభిమాన తారల్ని ఆరాధించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. పచ్చబొట్టు పొడిపించుకోవడం, వాళ్ల స్టైల్‌ని ఫాలో అవడం, గది నిండా పోస్టర్లు అతికించుకోవడం.. ఇలా అభిమానం హద్దుల్లో ఉన్నంత వరకు ఎలాంటి సమస్యా ఉండదు. కానీ అది హద్దు దాటితేనే ఇదిగో ఇలా ‘వెర్రి వేయి రకాల’న్నట్లుగా ఉంటుంది. బ్రెజిల్‌కు చెందిన జెన్నిఫర్‌ పంప్లోనా అనే మోడల్‌కు అమెరికన్‌ సెలబ్రిటీ కిమ్‌ కర్దాషియన్‌ అంటే వల్లమాలిన అభిమానం. అదెంతలా అంటే.. తన రూపాన్ని కిమ్‌లా మార్చుకోవడానికి దాదాపు ఐదు కోట్లు ఖర్చు పెట్టేంతగా..! అనుకున్నట్లుగానే 40 సర్జరీలు చేయించుకొని కిమ్‌లా మారింది జెన్నిఫర్‌.. సోషల్‌ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.. ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. కానీ ఇందులో సంతోషం లేదని ఆలస్యంగా గుర్తించిన ఆమె.. చివరికి ఏం చేసిందో మీరే చదవండి!

బ్రెజిల్‌కు చెందిన జెన్నిఫర్‌ పంప్లోనా.. గతంలో ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ వెర్సేస్‌కు మోడల్‌గా వ్యవహరించింది. అయితే చిన్న వయసు నుంచే తనకో సమస్య ఉండేదట! అదే బాడీ డిస్‌మార్ఫియా. అంటే.. పదే పదే అద్దంలో చూస్తూ తమ శరీరం, అందంలో లోపాల్ని వెతుక్కుంటూ మానసిక ఒత్తిడికి లోనుకావడం. పైగా అమెరికన్‌ సెలబ్రిటీ కిమ్‌ కర్దాషియన్‌ అంటే ఆమెకు వెర్రి అభిమానం. ఈ క్రమంలోనే తన అందం విషయంలో తన మనసుతో తాను పోరాటం చేయలేక.. కిమ్‌లా తన రూపాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది జెన్నిఫర్.

12 ఏళ్లు.. 40 సర్జరీలు!

కిమ్‌లా మారాలని 17 ఏళ్ల వయసులో తొలి కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకుంది జెన్నిఫర్‌. అయినా పూర్తిగా తన రూపాన్ని పొందలేకపోయింది. దీంతో సర్జరీల పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మూడు రినోప్లాస్టీస్‌, బట్‌ ఇంప్లాంట్స్‌, బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌, ఫ్యాట్‌ ఇంజెక్షన్స్‌, లిప్‌ ఫిల్లర్స్‌.. ఇలా మొత్తంగా ఈ 12 ఏళ్ల కాలంలో.. సుమారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి.. 40 సర్జరీలు చేయించుకుంది. ఏదైతేనేం.. తను అనుకున్నట్లుగానే కిమ్‌కి కవల సోదరిగా మారిపోయింది జెన్నిఫర్‌. దీంతో ఆమెకు మిలియన్ల కొద్దీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు పెరిగిపోయారు. తన రూపంతో ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని సైతం ఆకర్షించిందామె. అయినా ఇవేవీ నాకు సంతృప్తినివ్వలేకపోయాయని జెన్నిఫర్ చెప్పడం ఈ కథలో కొసమెరుపు!

హతవిధీ.. క్షణికావేశంతో ఎంత పనిచేశా?!

‘నా రూపాన్ని మార్చుకున్న తర్వాత అందరూ నన్ను కిమ్ అని పిలిచేవారు. కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. చదువులో, బిజినెస్‌ ఉమన్‌గా.. ఇలా నా జీవితంలో నేను ఎన్నో విషయాల్లో సక్సెసయ్యా. కిమ్‌లా నా రూపాన్ని మార్చుకోవాలన్న ఆలోచనలతో నన్ను నేనే హింసించుకుంటున్నానన్న విషయం అప్పుడు గ్రహించలేకపోయా. ఈ పన్నెండేళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. మానసికంగా ఎంతో కుంగిపోయా. సర్జరీలకు బానిసయ్యా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయా. నాకున్న బాడీ డిస్‌మార్ఫియా సమస్యే ఇన్ని అనర్థాలకు దారితీసిందని ఆలస్యంగా గ్రహించా. అందుకే నా పూర్వ రూపంలోకి మారిపోవాలని నిర్ణయించుకున్నా..’ అంటూ క్షణికావేశంలో తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతోంది జెన్నిఫర్.

బుగ్గల నుంచి రక్తం కారేది!

తన పూర్వ రూపాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఇస్తాంబుల్‌లోని ఓ నిపుణుడిని సంప్రదించిందీ బ్రెజిల్‌ మోడల్. ‘ఒక్కసారి కంప్యూటర్‌ స్క్రీన్‌పై నా పూర్వ రూపాన్ని చూసుకోగానే పునర్జన్మ ఎత్తినట్లనిపించింది. తిరిగి నా రూపాన్ని పొందడానికి.. ముఖం, మెడ లిఫ్టింగ్‌ సర్జరీలు; క్యాట్‌ ఐ సర్జరీ; పెదాలు-ముక్కు భాగాల్లో ఆపరేషన్లు.. వంటివి చేయించుకున్నా. ఇలా ఆపరేషన్‌ థియేటర్లోకి వెళ్తున్న ప్రతిసారీ వెళ్లేటప్పుడు ఒక వ్యక్తిలా, వచ్చేటప్పుడు మరో వ్యక్తిగా అనిపించేది. కొన్నిసార్లు బుగ్గల నుంచి రక్తం కారేది.. అనారోగ్యంగా అనిపించేది.. ఒక్కోసారి చనిపోతానేమోనన్న భయం కూడా కలిగేది. ఈ పరిస్థితులన్నీ నన్ను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టేవి. నా జీవితంలో నేనెంత పెద్ద తప్పు చేశానోనన్న పశ్చాత్తాప భావన నన్ను వేధించేది..’ అంటూ తన అనుభవాలను పంచుకుంది జెన్నిఫర్.

జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది!

ప్రస్తుతం తన రూపాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో పలు దుష్ప్రభావాలు ఎదురవుతున్నా.. ధైర్యంతో ముందుకు సాగుతోంది. అంతేకాదు.. బ్రెజిల్‌కు చెందిన ఓ ఫిజీషియన్‌ తెరకెక్కిస్తోన్న ‘అడిక్షన్‌’ అనే డాక్యుమెంటరీలోనూ నటిస్తోందీ మోడల్.
‘ఈ పన్నెండేళ్ల కాలంలో జీవితమంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. అందుకే నాకేం కావాలో ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతున్నా. ఈ ప్రక్రియ అంతా ఓ పక్క కష్టంగానే ఉన్నా.. మరో పక్క ఈ ఫీలింగ్‌ నన్నెంతో సంతోషానికి గురిచేస్తోంది. అందుకే నాలా మరెవరూ తప్పటడుగు వేయకూడదని తెలియజేయడానికి ‘అడిక్షన్’ అనే డాక్యుమెంటరీలో నటిస్తున్నా. కాస్మెటిక్‌ పద్ధతుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయో ఈ లఘు చిత్రంలో సవివరంగా పొందుపరిచారు. ఈ దిశగా ఆలోచించే ఎంతోమందిలో నా జీవిత కథ స్ఫూర్తి నింపుతుందనుకుంటున్నా. ఇప్పుడే కాదు.. ఇకపైనా నేను అందగత్తెనే!’ అంటోంది జెన్నిఫర్.


గతంలో వీళ్లు కూడా!

గతంలో కూడా కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకున్న మహిళలు, సెలబ్రిటీలు మరి కొందరున్నారు. అయితే అది అందరి విషయంలో సత్ఫలితాలను చూపలేదు. ఉదాహరణకు.. టాలీవుడ్‌ నటి ఆర్తి అగర్వాల్‌ ఇలాంటి సర్జరీలు వికటించి మరణించిన సంగతి తెలిసిందే! అదే గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ముక్కు-పెదాలకు సర్జరీ చేయించుకొని సత్ఫలితాలు పొందింది. ఇక ఇటీవలే బెంగళూరుకు చెందిన యువ నటి చేతనా రాజ్‌ కూడా ఇలాంటి చికిత్సలు వికటించే ప్రాణాలు వదిలింది.

ఏదేమైనా.. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి సౌందర్య చికిత్సలు చేయించుకోవడం ఆలోచనా రహితంగా తీసుకునే అవివేక నిర్ణయం అని జెన్నిఫర్‌ కథను బట్టి మనకు అర్థమవుతోంది. కాబట్టి ఎవరిలానో మారాలన్న అనవసర ఆలోచనలకు చెక్‌ పెట్టి.. స్వీయ ప్రేమను పెంచుకోవడం వల్ల సంతోషంగా, సంతృప్తిగా జీవితాన్ని ఆస్వాదించచ్చు. మరి, ఈ విషయంలో మీ స్పందనేంటి? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్