Published : 17/06/2022 15:46 IST

ఆరోగ్యమంతా ‘పుస్తకం’లోనే ఉందంటున్నారు!

(Photos: Instagram)

‘మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది’ అంటోంది బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మలైకా అరోరా. పోషకాహారం తీసుకుంటే మన శరీరంలోని ఎన్నో అనారోగ్యాల్ని తరిమికొట్టచ్చంటోంది. ఆరోగ్యం-ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇందుకోసం తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా వేదికగా తరచూ పంచుకుంటుంది. అయితే ఈసారి ఈ రహస్యాలన్నీ ఓ పుస్తకం రూపంలో మన ముందుకు తీసుకురానుందీ అందాల తార. ‘పోషకాహారం’ ప్రధానాంశంగా ప్రస్తుతం తాను ఓ పుస్తకం రాస్తున్నానని, త్వరలోనే దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా ప్రకటించింది మలైకా. ఈ నేపథ్యంలో.. ‘ఆరోగ్యమంటే ఏ ఒక్కరికో సొంతమైంది కాదు.. దాన్ని నలుగురికీ పంచినప్పుడే సంతోషం, సంతృప్తి..’ అంటూ మరికొంతమంది సెలబ్రిటీలు కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యం.. లోలోపలి నుంచీ..!

వయసుతో పాటే తన అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌నూ పెంచుకుంటూ పోతోంది మలైకా అరోరా. 50కి చేరువవుతోన్నా ఎంతో ఉత్సాహంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన ఆరోగ్యకరమైన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణమంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. తను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాల్ని తరచూ సోషల్‌ మీడియా ద్వారా పంచుకునే మలైకా.. వీటిపై త్వరలోనే ఓ పుస్తకం విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.

‘ప్రతి క్షణం నా ఆలోచనలన్నీ ఆరోగ్యం చుట్టూనే తిరుగుతుంటాయి. వీటిని నలుగురితో పంచుకుంటూ వారిలో అవగాహన పెంచడానికే ప్రయత్నిస్తుంటా. మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సరైన పోషకాహారం వల్లే శరీరంలోని ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు క్రమశిక్షణతో తినడం, తీసుకునే ఆహారంలో పోషకాలన్నీ ఉండేలా ఒక చక్కటి ప్రణాళిక రూపొందించుకోవడం.. తద్వారా ఆరోగ్య, ఫిట్‌నెస్‌ లక్ష్యాల్ని చేరుకోవడం.. ఇలాంటి అంశాలన్నీ ప్రస్తుతం నేను రాస్తోన్న పుస్తకంలో పొందుపరుస్తున్నా. ఆరోగ్యకరమైన జీవనశైలే మనల్ని లోలోపలి నుంచి ఉత్సాహంగా ఉంచుతుంది..’ అంటోంది మలైకా. ఇలా తన తొలి పుస్తకంతోనే రచయిత్రిగా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధపడిందీ బాలీవుడ్‌ అందం.


ఆ రహస్యాలన్నీ మీకోసం తెచ్చా!

నటిగా, హోస్ట్‌గా ఎంతోమందికి చేరువైన తమన్నా.. రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకుంది. కెరీర్‌తో పాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కూ సమప్రాధాన్యమిచ్చే ఈ బ్యూటీ.. అదే ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేసే ఉద్దేశంతో గతేడాది ఓ పుస్తకం రాసింది. పాత కాలపు ఆరోగ్య రహస్యాలను సేకరించి, మధించి.. ‘బ్యాక్‌ టు ది రూట్స్‌’ పేరుతో ఆ బుక్‌ని విడుదల చేసింది తమ్మూ. సెలబ్రిటీ లైఫ్‌స్టైల్‌ కోచ్ Luke Coutinhoతో కలిసి రాసిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని చేరువ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది.

‘మన దేశం పాతకాలపు ఆరోగ్య రహస్యాల్ని తనలో నింపుకొన్న గ్రంథాలయం. ఆ రహస్యాలన్నీ మనం పునశ్చరణ చేసుకొని పాటించాల్సిన సమయమిది! బ్యాక్‌ టు ది రూట్స్‌ కూడా అలాంటి పుస్తకమే. ఇందులోని అన్ని ఛాప్టర్స్‌లో పొందుపరిచిన ఆరోగ్య రహస్యాలన్నీ మరోసారి పరీక్షించి, పరిశీలించాకే మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవన్నీ మీకూ ఉపయోగపడతాయి.. మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి’ అంటూ తన పుస్తకం గురించి పంచుకుందీ మిల్కీ బ్యూటీ.


నవమాసాల జర్నీ ఇది!

గర్భం ధరించిన నవమాసాలు ప్రతి మహిళ జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులు. అయితే ఈ జర్నీని ఎంతగా ఆస్వాదిస్తామో.. అప్పుడప్పుడూ పలు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటోంది బాలీవుడ్‌ మామ్‌ కరీనా కపూర్‌. ఇద్దరు కొడుకులకు అమ్మైన ఆమె.. తన రెండు ప్రెగ్నెన్సీలలో తనకెదురైన అనుభవాల్ని రంగరించి.. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆన్‌లైన్‌లో ఈ పుస్తకం కాపీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

‘నా రెండు ప్రెగ్నెన్సీల్లో నాకు ఎదురైన అనుభవాల సారాంశమే ఈ ప్రెగ్నెన్సీ బైబిల్‌. ఈ క్రమంలో కొన్ని రోజులు ఎంతో ఉత్సాహంగా విధులకు హాజరయ్యేదాన్ని.. మరికొన్ని రోజుల్లో బెడ్‌పై నుంచి లేవలేనంతగా నీరసంగా అనిపించేది. ఇలా గర్భం ధరించిన సమయంలో శారీరకంగా, మానసికంగా నా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ పుస్తకం ద్వారా సవివరంగా తెలుసుకోవచ్చు..’ అంది కరీనా.


ఇదే మన ‘ఇమ్యూనిటీ పిల్’!

ఆరోగ్యం, అందం, ఫిట్‌నెస్‌.. ఈ మూడూ కలగలిసిన బాలీవుడ్‌ అందాల తార శిల్పా శెట్టి. పెరుగుతోన్న తన వయసుతో పాటే చురుకుదనాన్నీ పెంచుకుంటూ.. తన ఫ్యాన్స్‌కు వెల్‌నెస్ పాఠాలు నేర్పుతోన్న శిల్ప.. రచయిత్రిగానూ తనను తాను నిరూపించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యకరమైన వంటకాల్ని పరిచయం చేస్తూ ఇప్పటికే ‘ది గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌’, ‘ది డైరీ ఆఫ్‌ ఎ డొమెస్టిక్‌ దివా’.. అనే రెండు పుస్తకాలు రాసింది. ఇక గతేడాది ‘ది మ్యాజిక్‌ ఇమ్యూనిటీ పిల్‌ : లైఫ్‌స్టైల్‌’ అనే మరో పుస్తకాన్ని తన అభిమానుల కోసం తీసుకొచ్చిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. సెలబ్రిటీ లైఫ్‌స్టైల్‌ కోచ్ Luke Coutinhoతో కలిసి రాసిన ఈ పుస్తకంలో భాగంగా.. రోగనిరోధక శక్తిని పెంచే ఇంటి చిట్కాలను పొందుపరచామంటోంది శిల్ప.

‘ఆరోగ్యకరమైన జీవనశైలిని అందరికీ చేరువ చేయాలనే ఈ పుస్తకం రాశాను. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండడం ఎంత అవసరమో కరోనా సమయంలో మనకు తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీని పెంచే ఇంటి చిట్కాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాం. నిజానికి ఈ పుస్తకం మాతృక ముందే విడుదలైనా.. హిందీ వెర్షన్‌ను మాత్రం ఇప్పుడు తీసుకొచ్చాం. ఎందుకంటే హిందీలో అయితే ఇది మరింత మందికి చేరువవుతుందన్నదే దీని వెనకున్న ముఖ్యోద్దేశం. ప్రస్తుతం మీరు దీన్ని ఆన్‌లైన్‌లో ఉచితంగానే చదువుకోవచ్చు..’ అంటోందీ ముద్దుగుమ్మ.


ఆరోగ్యమే ఆనందం!

ఆరోగ్యంగా ఉండాలంటే మనం వేసే ప్రతి అడుగూ కీలకమే అంటున్నారు సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఆరోగ్యం-మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. వంటి విషయాలకు సంబంధించిన పోస్టులు, వీడియోలతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే ఈ న్యూట్రిషనిస్ట్‌.. ఈ క్రమంలోనే ఎన్నో పుస్తకాలు రాశారు. ‘Don't Loose Your Mind Loose Your Weight’, ‘Women and the Weight Loss tamasha’, ‘Don't Loose Out, Workout’, ‘The PCOD Thyroid Book’, ‘Indian Super Foods’, ‘Pregnancy Notes’, ‘Notes For Healthy Kids’.. వంటి పుస్తకాలను మన ముందుకు తెచ్చిన రుజుత.. ‘12 Week Fitness Project’ పేరుతో మరో పుస్తకాన్ని విడుదల చేశారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలే కీలకమని, ఈ క్రమంలోనే పలు సంప్రదాయ వంటకాల్ని, ఆరోగ్య రహస్యాల్ని ఈ పుస్తకం ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారామె.

‘ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. ఈ రెండూ ఒకదాంతో మరొకటి ముడిపడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది తెలిసో తెలియకో అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లకు బానిసై చేజేతులా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారు బరువు అదుపులో ఉన్నా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండలేకపోతున్నారు..’ అంటున్నారు రుజుత. ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో మనం తీసుకునే పోషకాహారమే కీలక పాత్ర పోషిస్తుందంటోన్న ఆమె.. ఈ నేపథ్యంలోనే ‘సీక్రెట్స్‌ ఆఫ్‌ గుడ్‌హెల్త్‌’ అనే ఆడియో బుక్‌ని అందరికీ చేరువ చేశారు. ఇందులో భాగంగా రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, అందులోని పోషకాల గురించి వివరించారామె.


పేరెంట్స్‌లో ఆ స్పృహ ఉండాలి!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు తల్లులు ఆరోగ్యంగా ఉండాలి అంటారు మరో సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ పూజా మఖిజ. తాను పాటించే ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలతో పాటు పోషకాహారం, వ్యాయామాలు.. వంటి అంశాలకు సంబంధించిన పోస్టులతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచే పూజ.. పలు పుస్తకాలు సైతం రాశారు. ‘N for Nourish’, ‘Eat Delete Junior’, ‘Eat Delete : How To Get Off The Weight Loss Cycle For Good’.. వంటివి అందులో కొన్ని!

ముఖ్యంగా తన పుస్తకాల విషయంలో పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే ఆమె.. ‘తల్లిదండ్రుల్లో ఆరోగ్య స్పృహ ఉంటే.. అది పిల్లలకూ అలవాటవుతుంది. తద్వారా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు.. ఇలా ప్రతి విషయంలోనూ వారు తల్లిదండ్రుల్నే ఫాలో అవుతారు. ఇది పెరిగే కొద్దీ వారిని ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడేలా చేస్తుంది. ఫలితంగా డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు అంటూ వాళ్ల దగ్గరికి పరిగెత్తే అవసరం రాదు..’ అంటారు పూజ.


అనుభవాలే పుస్తకమై!

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి విషయాల్లో ఇలా పుస్తకాల ద్వారా అవగాహన పెంచిన సెలబ్రిటీలు కొందరైతే.. తమకెదురైన అనారోగ్యాల నుంచి జీవితం విలువ తెలుసుకొని.. తమ అనుభవాల్ని పుస్తకాలకెక్కించిన వారూ ఉన్నారు. వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మనీషా కొయిరాలా ఒకరు. ఒవేరియన్‌ క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఆమె.. ఈ క్రమంలో తనకెదురైన తీపి-చేదు అనుభవాల్ని ‘Healed: How Cancer Gave Me a New Life’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ధైర్యం, మానసిక సంకల్పం ఉంటే క్యాన్సర్‌ వంటి మహమ్మారుల్నీ జయించచ్చంటూ తన పుస్తకం ద్వారా బాధితుల్లో స్ఫూర్తి రగిలించిందీ అందాల తార.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని